‘గ్యాప్ ఇచ్చావ్..’ ‘ఇవ్వలే… వచ్చింది..’‘అల వైకుంఠపురములో’ సినిమాలోని మాటలివి. త్రివిక్రమ్ పొడిపొడిగా రాసినా.. ఇందులో చాలా తడి కనిపిస్తుంది. కథ దొరకాలి.. కాంబినేషన్ కుదరాలి.. డేట్స్ అడ్జెస్ట్ కావాలి.. బడ్జెట్ పరిధి దాటకుండా ఉండాలి.. అన్నీ కలిస్తేనే.. హీరోకైనా, హీరోయిన్‌కైనా గ్యాప్ ఇవ్వాల్సిన అవసరం రాకుండా ఉంటుంది. వీటిలో ఏది మిస్సయినా.. ఏండ్లకేండ్లు గ్యాప్ వచ్చేస్తుంది. వాటన్నిటినీ పూడ్చుకొని మళ్లీ తెరమీద కనిపించడం ప్రేక్షకులకు మాత్రమే కాదు… ఆ తారాగణానికీ థ్రిల్ ఫీలింగ్ కలిగిస్తుంది. అలా చాలా గ్యాప్ తర్వాత మళ్లీ అభిమానులను అలరించడానికి రెడీ అవుతున్న నటీనటుల ముచ్చట్లు ఇవి..
ఇటీవల హీరోలకు గ్యాప్ రావడం కామన్ సినారియోగా మారింది. ఒక్కో సినిమా సెట్స్ మీదే ఏడాదిన్నర పాటు తిష్ఠ వేస్తుండటంతో గ్యాప్ అనివార్యం అవుతుంది. ‘గ్యాప్’ డైలాగ్ కొట్టిన అల్లు అర్జున్నే తీసుకుంటే.. ఆయన కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏడాదికి ఒక సినిమా పక్కా రిలీజైంది. 2018లో ‘నా పేరు సూర్య’ తర్వాత రెండేండ్ల గ్యాప్‌తో 2020లో ‘అల వైకుంఠపురములో’ సినిమా రిలీజైంది.
ఈ చిన్న గ్యాప్కే.. సినిమాలో పంచ్ వేయించాడు త్రివిక్రమ్. 2021లో పుష్ప రిలీజైంది. సూపర్ హిట్ అయింది. తర్వాత మూడేండ్ల గ్యాప్ వచ్చింది. ఈ మూడేండ్లూ పుష్ప-2కే అంకితమైనా.. అభిమానులు మాత్రం ఆ సమయాన్ని గ్యాప్‌గానే ఫీలయ్యారు. 2024లో పుష్ప-2 మరింత గొప్ప విజయం సొంతం చేసుకుంది. పుష్ప-3కి మళ్లీ రెండున్నరేండ్లు గ్యారెంటీ అని ఫిక్సయ్యారు ప్రేక్షకులు. కానీ, ఇంతలోనే అట్లీ సినిమా పైకి రావడంతో.. మళ్లీ ఈ ఐకాన్ స్టార్‌కు గ్యాప్ తప్పదని ఫిక్సయ్యారు. కథ, కాస్టింగ్ అన్నీ లాక్ అయినా.. ఇంతలా విరామాలు వస్తుండటమే సగటు ప్రేక్షకుడికి మింగుడుపడని విషయం.
వాయిదాల వీరమల్లు బాక్సాఫీస్‌ను రూల్ చేసే నటుల్లో పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ఒకడు. ఆయన సినిమా వస్తుందంటే చాలు.. అభిమానులు కండ్లల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తుంటారు. 2018 వరకు పవన్ కెరీర్లో చిన్న చిన్న విరామాలు తప్ప… యావరేజ్‌గా ఏడాదికో సినిమా వచ్చింది. ‘అజ్ఞాతవాసి’ ఫ్లాప్ తర్వాత.. మళ్లీ ఆయన సినిమా విడుదల కావడానికి మూడేండ్లు పట్టింది. 2021లో ‘వకీల్ సాబ్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు పవన్. 2022లో ‘భీమ్లా నాయక్’, 2023లో ‘బ్రో’ సినిమాలతో బాక్సాఫీస్ ముందుకు వచ్చాడు. మళ్లీ దాదాపు రెండేండ్లుగా ఆయన సినిమా రాలేదు.
ఐదేండ్ల కిందట షూటింగ్ మొదలైన ‘హరిహర వీరమల్లు’ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. పవన్ పొలిటికల్‌గా బిజీగా మారడం, దర్శకుడి మార్పు ఇవన్నీ సినిమా షూటింగ్ ఆలస్యానికి కారణాలు అయ్యాయి. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా నత్త నడకన సాగడంతో.. వీరమల్లు ఆగమనం వాయిదా పడుతూ వచ్చింది. మొత్తానికి ఈ నెల 24న ఈ చిత్రం బాక్సాఫీస్ ముందుకు వస్తుందని నిర్మాత ప్రకటించాడు. దాదాపు రెండేండ్ల తర్వాత పవన్ సినిమా విడుదల అవుతుండటంతో ఆయన అభిమానుల్లో ఫుల్ క్రేజ్ నెలకొని ఉంది. ఇంకా పవన్ హీరోగా షూటింగ్ దశలో ఉన్న ‘ఓజీ’ ఈ ఏడాది, ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ వచ్చే ఏడాది విడుదల అవుతాయని సినీట్రేడ్ వర్గాల అంచనా! కానీ, అవి ఎప్పుడు విడుదల అవుతాయో కచ్చితంగా చెప్పలేకపోతున్నారు.
బాహుబలిలో భల్లాలదేవుడిగా భయపెట్టిన రానా కెరీర్లో ఒక్కసారిగా పెద్ద గ్యాపే వచ్చింది. 2022లో ‘1945’, ‘భీమ్లా నాయక్’, ‘విరాటపర్వం’ ఇలా మూడు సినిమాలతో పలకరించిన ఆయన తర్వాత వెండితెరకు ముఖం చాటేశాడు. రెండేండ్ల గ్యాప్‌తో తమిళ చిత్రం ‘వేట్టయన్’లో విలన్‌గా కనిపించాడు. మళ్లీ ఆయన సినిమాలపై ఇంకా క్లారిటీ లేకుండాపోయింది. రానా ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ‘హిరణ్యకశిప’ ఎప్పుడు మొదలుకానుందో ఇండస్ట్రీ వర్గాలు కూడా చెప్పలేకపోతున్నాయి. ఆయన అప్‌కమింగ్ ప్రాజెక్టుల వివరాలు కూడా టీ-టౌన్లో పెద్దగా వినిపించడం లేదు. ఈ నేపథ్యంలో రానా రాక మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తున్నది.
రావయ్యా రామయ్య కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏడాదికో సినిమాతో ప్రేక్షకులను అలరించాడు జూనియర్ ఎన్టీఆర్.
2008 తర్వాత చిన్న గ్యాప్ వచ్చినా.. తర్వాత 2018 వరకు రామయ్య విరామం లేకుండా ప్రేక్షకులను పలకరించాడు. తర్వాత రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ కారణంగా మూడున్నరేండ్లు గ్యాప్ మూటగట్టుకున్నాడు. రాజమౌళి సినిమాలకు ఆ మాత్రం టైమ్ కామన్ అనుకోవచ్చు! ఆ తర్వాత రెండేండ్లకు గానీ ‘దేవర-1’ విడుదల కాలేదు. త్వరలో బాలీవుడ్ సినిమా ‘వార్ 2’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే, ఎన్టీఆర్ ఓకే చేసిన ప్రాజెక్టులు చాలానే ఉన్నా.. అవన్నీ పట్టాలెక్కి, షూటింగ్ పూర్తి చేసుకొని, ప్రేక్షకుల ముందుకు వచ్చేసరికి కొంత గ్యాప్ తప్పేలా లేదంటున్నారు ఇండస్ట్రీ పీపుల్.
మహేశ్‌బాబు వంతు గ్యాప్‌లు ఇవ్వడం మహేశ్‌బాబుకు కొత్తేం కాదు. 2007లో ‘అతిథి’ సినిమా తర్వాత మూడేండ్లకు ‘ఖలేజా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అప్పట్నుంచి దాదాపు 2020 వరకు ఏడాదికోసారి అభిమానులను అలరిస్తూ వచ్చాడు. తర్వాత రెండేండ్లకో సినిమాతో పలకరించాడు. త్రివిక్రమ్, మహేశ్ కాంబోలో వచ్చిన ‘గుంటూరు కారం’ 2024లో విడుదలైంది. రాజమౌళి తదుపరి సినిమాకు మహేశ్‌ను హీరోగా సెలెక్ట్ చేసుకోవడంతో… మినిమమ్ మూడేండ్ల వరకు ఆయన తెరమీద కనిపించే అవకాశాలు దాదాపు లేనట్టే! రాజమౌళి ట్రాక్ రికార్డు ప్రకారం ఈ సినిమా 2027 చివరికల్లా అయినా విడుదల అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే జక్కన్న చెక్కడంలో నిమగ్నమైతే.. ఇంకెంత కాలం వెయిట్ చేయాల్సి వస్తుందో అని అభిమానులకు ఇప్పట్నుంచే గాబరా మొదలైంది.
గ్యాప్ తీసుకోవడంలో హీరోలకు మేమేం తీసిపోం అంటున్నారు హీరోయిన్లు. పెండ్లి తర్వాత చాలా సంవత్సరాలు విరామమిచ్చి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం నాయికలకేం కొత్తకాదు. కానీ, లైమ్‌లైట్‌లో ఉంటూనే గ్యాప్ తీసుకుంటున్న వాళ్లూ ఉన్నారు. వారిలో ఒకరు త్రిష. కోలీవుడ్‌లో బిజీగా కనిపించే ఈ అమ్మడు.. నేరుగా తెలుగు సినిమా చేసి ఏండ్లు గడిచియిపోయాయి. ఆమె నటించిన ‘పొన్నియిన్ సెల్వన్’ రెండు భాగాలు, ‘లియో’, ‘ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’, ‘థగ్ లైఫ్’ తదితర చిత్రాలు తమిళం నుంచి తెలుగులోకి డబ్ అయ్యాయి. దీంతో.. ఆమె గ్యాప్ తీసుకున్నట్టుగా అనిపించలేదు. కానీ, త్రిష తెలుగులో నేరుగా నటించి దాదాపు పదేండ్లు అవుతున్నదంటే ఆశ్చర్యం కలగకమానదు. చిరంజీవి హీరోగా వస్తున్న ‘విశ్వంభర’లో త్రిష నాయిక. ఇది ఈ ఏడాదే విడుదల కానుంది. మొత్తంగా ‘ఇన్నాళ్లకు గుర్తొచ్చామా..’ అంటూ ఆమె రాక కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.
తెలుగు సినిమాల్లోకి ‘సూపర్’గా ఎంట్రీ ఇచ్చిన కథానాయిక అనుష్క. ఇండస్ట్రీలో దాదాపు దశాబ్దం పాటు టాప్ హీరోయిన్గా నిలిచింది. 2019లో ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో ఝాన్సీ లక్ష్మీబాయిగా అతిథి పాత్ర పోషించిన అనుష్క 2020లో ‘నిశ్శబ్దం’తో మరోసారి ప్రేక్షకులను పలకరించింది. తర్వాత మూడేండ్లకు ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాలో కనిపించింది. మళ్లీ గ్యాప్ తీసుకుంది. ఆమె హీరోయిన్గా నటించిన ‘ఘాటి’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఏప్రిల్‌లోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం తొలుత ఈ నెల 11కు వాయిదా పడింది. పోస్ట్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడంతో మళ్లీ వాయిదా పడింది. మొత్తం మీద రెండేండ్ల తర్వాత మన స్వీటీ ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది.
‘బాయ్స్’ సినిమాతో ఇండస్ట్రీని తన వైపు తిప్పుకొన్న నటి జెనీలియా. ‘బొమ్మరిల్లు’తో తెలుగింటి అమ్మాయి అయిపోయింది. వరుస హిట్లతో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. ఆమె నటించిన చివరి తెలుగు సినిమా ‘నా ఇష్టం’. అదే ఏడాది రితేశ్ దేశ్‌ముఖ్‌ను పెండ్లి చేసుకుంది. తర్వాత అడపాదడపా హిందీ సినిమాలు చేసినా తెలుగు వైపు కన్నెత్తి చూడలేదు. తాజాగా ‘సితారే జమీన్ పర్’ సినిమాతో జెనీలియా మరోసారి లైమ్‌లైట్‌లోకి వచ్చింది. అదే జోరులో తెలుగు, కన్నడ రెండు భాషల్లో నిర్మితమైన ‘జూనియర్’ సినిమాలో
ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరీటి హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో మళ్లీ టాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇవ్వనుంది మన హాసిని.