కదలి వస్తున్న ఖాకీ దుర్గలు
స్త్రీశక్తిని కొలిచే వేడుకలు నవరాత్రులు. దుష్టశక్తులను దునుమాడటానికి ఆ పరాశక్తి.. నవదుర్గలుగా అవతరించిన సందర్భం ఇది. ఈ అభినవ దుర్గలు కూడా తెగువను చూపారు.
స్త్రీశక్తిని కొలిచే వేడుకలు నవరాత్రులు. దుష్టశక్తులను దునుమాడటానికి ఆ పరాశక్తి.. నవదుర్గలుగా అవతరించిన సందర్భం ఇది. ఈ అభినవ దుర్గలు కూడా తెగువను చూపారు. లా అండ్ ఆర్డర్‌ను కంట్రోల్లో ఉంచడానికి లాఠీ చేతబూని కర్తవ్యోన్ముఖులు అవుతున్నారు. అహరహం శ్రమించి సివిల్స్ సాధించిన ఈ మగువలు.. శిక్షణలో మరింత రాటుదేలారు. నేరాలను అదుపు చేసి, ప్రజలకు మెరుగైన జీవనం అందించడమే తమ లక్ష్యం అని చెబుతున్నారు. ఐపీఎస్ మొదటి దశ శిక్షణ పూర్తి చేసుకున్న ఈ సివంగులను ‘జిందగీ’ పలకరించింది.
ఎన్జీఓలో మారిన నా ప్రయాణం
మాది మెదక్ జిల్లా తూప్రాన్ మండలం నర్సంపల్లి గ్రామం. నా చదువంతా హైదరాబాద్‌లోనే కొనసాగింది. 2019లో జేఎన్టీయూ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో ఇంజినీరింగ్ పూర్తి చేశాను. నేను బీటెక్ చదువుతున్న రోజుల్లోనే ఒక ఎన్జీఓలో వర్క్ చేశాను. అక్కడ నాలో చాలా మార్పు వచ్చింది. అప్పుడే నేను సివిల్ సర్వెంట్ అవ్వాలని నిర్ణయించుకున్నా. బీటెక్ అయిపోయిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. అప్పట్నుంచి సివిల్స్ కోసం కష్టపడుతూనే ఉన్నా. మధ్యలో ఎన్నో ఒడుదొడుకులు ఎదురైనా కూడా నా ప్రయత్నాన్ని విరమించలేదు. 4వ ప్రయత్నంలో నేను సివిల్స్ సాధించాను. నాన్న అమర్‌సింగ్.. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో డివిజనల్ మేనేజర్‌గా వర్క్ చేస్తున్నారు.
అమ్మ రేణుక.. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో జూనియర్ అసిస్టెంట్. అన్నయ్య సాఫ్ట్వేర్ ఇంజినీర్, తమ్ముడు ఎంబీబీఎస్ ఫోర్త్ ఇయర్ చదువుతున్నాడు. ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించాలనే కసితోనే నేను ఎక్కడా ఎలాంటి ఉద్యోగం చేయలేదు. అయినా అమ్మానాన్నలు, కుటుంబం నన్ను ప్రోత్సహించారు. ఒక్కోసారి ప్రిపరేషన్ ఓ రోజంతా ఉండేది. సొంతంగా నోట్స్ రాసుకోవడంతోనే సమయం గడిచిపోయేది. ఉదయం పుస్తకాలు ముందేస్తే.. రాత్రయ్యేది. ఏకధాటిగా 14-15 గంటలు కష్టపడేదాన్ని. తపస్సులా సాధన చేయబట్టే సివిల్స్ సాధించగలిగాను. హోం స్టేట్‌కు రాలేకపోయాననే బాధ లేదు. ప్రజా సేవ చేయాలి అనుకుంటున్నా కాబట్టి.. అది ఎక్కడైనా, ఎప్పుడైనా సిద్ధంగా ఉండాలనేది నా ఫిలాసఫీ. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ కేడర్‌కు అలాట్ అయ్యాను. నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తా.
-ఖోలా అర్పిత, మెదక్, నర్సంపల్లి గ్రామం
అమ్మానాన్నల కష్టం వృథాగా పోలేదు
నా సొంతూరు హైదరాబాద్. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌లో ఇంజినీరింగ్ చేశాను. దాని తర్వాత ఒక ఏడాది పాటు ఓ ఇండస్ట్రియల్‌లో వర్క్ చేశాను. సివిల్స్ నా చిన్ననాటి కల. దాన్ని నెరవేర్చుకోవడం చాలా కష్టం. పట్టుదలగా కృషిచేశాను. 4వ ప్రయత్నంలో ఐపీఎస్ సాధించాను. అమ్మానాన్నలు ఇద్దరూ వైద్యులే. నాన్న వెంకటనర్సింహా రెడ్డి, అమ్మ కవిత. ప్రజలకు సేవ చేయాలనేది అమ్మానాన్నల నుంచే స్ఫూర్తి పొందాను. వాళ్లు వైద్యులుగా ఎంతోమందికి సేవలు అందిస్తున్నారు. నేను వైద్యరంగం వైపు కాకుండా.. ప్రజా సేవలో మరో కోణంగా సివిల్స్ వైపు వచ్చాను. నా ఇష్టాన్ని వాళ్లు ప్రోత్సహించారు. నా కోసం చాలా త్యాగం చేశారు.
వారి కష్టం వృథాగా పోలేదు. చిన్నప్పట్నుంచి నా ఇష్టాలకు అడ్డు చెప్పకుండా.. నన్ను ప్రోత్సహించారు. ఎన్పీఏలో శిక్షణ చాలా కఠినంగా ఉన్నా.. ఉత్సాహంగా మొదటి దశను పూర్తి చేసుకున్నాం. తెలంగాణలోని అన్ని కమిషనరేట్లు, వివిధ రకాల పోలీసు స్టేషన్లు తిరిగాం. నాకు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ చాలా ఇష్టంగా అనిపించింది. ఉమెన్ సేఫ్టీ, సైబర్ క్రైమ్ కేసులపై పట్టు సాధించేలా నన్ను నేను మలుచుకున్నాను. తెలంగాణలో పుట్టిన ఏ బిడ్డకైనా పోరాటం కొత్తకాదు. మన నేలలోనే ఆ లక్షణం ఉంది. అందుకే ప్రజలకు ఇబ్బంది లేకుండా క్రౌడ్ మేనేజ్మెంట్ ఎలా చేయాలని ప్రత్యేకంగా నేర్పిస్తుంటారు. ఆ విషయాలన్నీ నేను కూలంకషంగా తెలుసుకున్నా. నా మాతృ రాష్ర్టానికే ఐపీఎస్‌గా రావడం చాలా ఆనందంగా ఉంది.
-ఎన్.చేతనా రెడ్డి, హైదరాబాద్
తెలంగాణ.. భిన్నత్వంలో ఏకత్వం
నాకు తెలంగాణ అంటే చాలా ఇష్టం. 2013 నుంచి 2020 వరకూ నేను హైదరాబాద్‌లోనే ఉన్నాను. ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ సార్ దగ్గర బ్యాడ్మింటన్ నేర్చుకున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో మంచి క్రీడాకారిణిగా రాణించాను. అప్పుడే నాకు తెలంగాణలో ఉన్న భిన్నత్వంలో ఏకత్వం తెలిసింది. ఇక్కడి కల్చర్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. మా నాన్న 2020 నుంచి 2023 వరకు ఉత్తరాఖండ్ డీజీపీగా పనిచేశారు.

ఆయన్ను చూసే నేను చాలా నేర్చుకున్నాను. ఆయన స్ఫూర్తితోనే నేను ఐపీఎస్ అవ్వాలనుకున్నాను. నా రెండో ప్రయత్నంలోనే ఐపీఎస్ సాధించాను. నా విజయంలో అమ్మానాన్నల ప్రోత్సాహం మరువలేనిది. హైదరాబాద్‌లో నేర్చుకున్న బ్యాడ్మింటన్.. అవుట్డోర్ గేమ్స్‌లో బెస్ట్ ప్రొహిబేషనరీగా ఎదగడానికి ఉపయోగపడింది. అవుట్డోర్ పోటీల్లో, పరీక్షల్లో నాతో నాకే పోటీ అన్నట్లుగా ప్రయత్నం చేశాను. చివరికి బెస్ట్ అవుట్డోర్ ప్రొహిబేషనరీగా నిలిచాను. ట్రైనింగ్ చాలా కష్టంగా ఉన్నా తట్టుకోగలిగాం. ఒకేసారి చాలా యాక్టివిటీస్ చేయించే వారు. క్రౌడ్ మేనేజ్మెంట్, కొత్త నేరాలపై సమగ్రంగా నేర్పించారు.
కుహూ గార్గ్, ఉత్తరాఖండ్
మొదటి ప్రయత్నంలోనే ఐపీఎస్..
కేవలం 24 ఏండ్లకే.. అదీ తొలిప్రయత్నంలోనే ఐపీఎస్ సాధించడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. నాకు సైకాలజీ అంటే చాలా ఇష్టం. అందుకే ఢిల్లీలో సైకాలజీ చదువుతున్నప్పుడు స్ఫూర్తిపొంది సివిల్స్ వైపు అడుగులు వేశాను. ఒక పథకం ప్రకారం సొంతంగా నోట్స్ రాసుకుంటూ ప్రిపేర్ అయ్యాను. సెలెక్టెడ్ మెటీరియల్ చదువుకున్నాను. తెలిసిన కొందరు సీనియర్స్ అనుభవాల నుంచి చాలా నేర్చుకున్నాను.

చేసిన తప్పులు మళ్లీ చేయకుండా.. సివిల్స్‌కు సిద్ధపడుతూ అహోరాత్రులు పుస్తకాల పురుగుగా మారాను. ఎలాంటి కోచింగ్ సెంటర్స్ వైపు వెళ్లకుండా, నేనే ఒక స్టడీ సెంటర్‌గా మారాను. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ సాధించాను. ప్రస్తుతం అసోం కేడర్‌కు వెళ్తున్నాను. ఈ శిక్షణలో నేను ‘మణిపూర్ కప్’కు ఎంపికయ్యాను. నాన్న చార్టెడ్ అకౌంటెంట్.. నా తమ్ముడు కూడా నాన్న దారినే
ఎంచుకున్నాడు. నేను మాత్రం ప్రజాసేవను ఎన్నుకున్నాను. ఇది నాకు
చాలా తృప్తినిచ్చే అంశం.
ఆరుషి శర్మ, జలంధర్, పంజాబ్
23 ఏండ్లకే ఐపీఎస్‌గా..
ఈ బ్యాచ్‌లో నేనే అతి పిన్న వయస్కురాలైన ఐపీఎస్‌ను. మాది పశ్చిమ బెంగాల్‌లోని హౌరా. నేను నా మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ పరీక్షలో విజయం సాధించా. కోల్‌కతాలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో పొలిటికల్ సైన్స్ ఆనర్స్ పూర్తి చేశాను. అమ్మ గృహిణి కాగా, నాన్న పిల్లల వైద్యుడు. నాకో తమ్ముడు ఉన్నాడు. సివిల్స్ కోసం రోజూ దాదాపు 10 -11 గంటలు క్రమం తప్పకుండా చదివాను. ప్రజలకు పోలీసు వ్యవస్థను మరింత చేరువ చేయడమే నా లక్ష్యం.

కుల, మత, సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా అందరికీ న్యాయం అందేలా చూడాలని, ప్రజల పట్ల మరింత సున్నితంగా వ్యవహరించేలా వ్యవస్థను తీర్చిదిద్దాలని కోరుకుంటున్నా. నేను ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు ఎంపిక కావడం పట్ల ఆనందంగా ఉన్నాను. నా కోసం అమ్మనాన్నలు చేసిన త్యాగాలు వృథా కాలేదు. నా ప్రిపరేషన్లో అమ్మ చాలా సపోర్టివ్‌గా ఉన్నారు. నేను పుస్తకాల్లో మునిగిపోతే.. తానే నాకు అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. నా వంతుగా ప్రజలకు సేవ చేస్తా.
-ఉర్మి సిన్హా, పశ్చిమ్ బెంగాల్
-రవికుమార్ తోటపల్లి
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

