విద్యార్థి శక్తియుక్తులను సరిగ్గా అంచనా వేయగలిగేవాడు.. ఉపాధ్యాయుడు. పిల్లల దారి ఎటు మళ్లించాలో గురువుకు తెలిసినంతగా మరెవరికీ పట్టుచిక్కదు. తనను నమ్ముకొని వచ్చిన విద్యార్థులనే కాదు, తనను ప్రధాన పాత్రగా చూపిన సినిమానూ విజయపథంలో నడిపించగలడు గురువు. అందుకేనేమో, ఉపాధ్యాయుడి పాత్ర వెండితెరపై వెలుగులీనింది. ఎన్నో చిత్రాలు ఆయన పేరిట బ్లాక్‌బస్టర్ విజయాలు సాధించాయి. ఉపాధ్యాయ దినోత్సవం (సెప్టెంబరు 5) సందర్భంగా సినీ వినీలాకాశంలో మేటి గురువులను పరిచయం చేసిన సినిమాలను తలుచుకుందాం!
‘నూటికో కోటికో ఒక్కరూ.. ఎప్పుడో ఎక్కడో పుడతారు.. మా దేవుడు మీరే మాస్టారు’.. ప్రతి ఉపాధ్యాయ దినోత్సవంనాడు ఈ పాట మార్మోగుతూనే ఉంటుంది. తెలుగునాట ఉపాధ్యాయుల ప్రాధాన్యం తెలియజేసే సినిమాలెన్నో వచ్చాయి. ‘బడిపంతులు’, ‘విశ్వరూపం’, ‘శంకరాభరణం’, ‘ఆనందభైరవి’, ‘కోడెనాగు’, ‘త్రిశూలం’, ‘రేపటి పౌరులు’ తదితర చిత్రాలు గురువుల ప్రాధాన్యాన్ని తెలియజేస్తూనే, మంచి హిట్లు సాధించాయి. విశ్వనాథ్, బాపు వంటి దర్శకులు ఏ ఇతివృత్తంతో సినిమాలు తీసినా గురుబ్రహ్మ ఘనతను తెలియజేసే ఒకట్రెండు సన్నివేశాలైనా జోడించేవారు. గురువుల జీవితమే ప్రధాన ఇతివృత్తంగా నిర్మించిన సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటున్నది. ఆనాటి ‘బడిపంతులు’ మొదలు ఈ తరం ‘ఠాగూర్’ వరకు.. ఆచార్య హిట్టోభవ అని నిరూపించాయి.
బడుగు బడిపంతులు
‘బతకలేక బడిపంతులు’ అనే రోజుల్లో విడుదలైన సినిమా ‘బడిపంతులు’. ఎన్టీఆర్ నాయకుడిగా తెర కెక్కిన ఈ చిత్రంలో ఉపాధ్యాయుడి గొప్పదనాన్ని కండ్లకుకట్టారు దర్శకుడు పి.చంద్రశేఖర్‌రెడ్డి. సరిగ్గా యాభై ఏండ్ల కిందట 1972లో వచ్చిన ‘బడి పంతులు’ ఆనాటి ఉపాధ్యాయుల స్థితిగతులను తెలియ జెప్పింది. కాస్త నిదానంగా సాగినట్టు అనిపించినా, ఒక ఉత్తమ ఉపాధ్యాయుడు ఎలా ఉండాలో ఎన్టీఆర్ పాత్ర ద్వారా ఈ తరమూ తెలుసుకోవచ్చు. ‘బడిపంతులు’ తర్వాత కొన్నేండ్లకు.. ఎన్టీఆర్ నటించిన ‘విశ్వరూపం’ కూడా అధ్యాపకుడి గొప్పదనాన్ని చాటి చెప్పింది. కళాశాలలో దారి తప్పుతున్న విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పిన లెక్చరర్ పాత్రలో ఎన్టీఆర్ నటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
‘కళాతపస్వి’ గురువులు
తెలుగు సినిమా వైభవాన్ని చాటిచెప్పిన చిత్రాలు కళాతపస్వి విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘శంకరాభరణం’, ‘సాగర సంగమం’, ‘స్వర్ణ కమలం’, ‘స్వాతి కిరణం’. ఈ నాలుగు సినిమాలూ శాస్త్రీయ కళలకు ఆదరణ పెంచినవే! కళలనే నమ్ముకున్న ఆచార్యులకు కొత్త శోభ తెచ్చినవే. శంకరాభరణంలో శంకరశాస్త్రి పాత్ర శాస్త్రీయ సంగీతాన్ని తిరిగి బతికించాలని పరితపిస్తుంటుంది. సినిమా పతాక సన్నివేశంలో శంకరం గురువును మించిన శిష్యుడు అనిపించినా, ఆ సినిమా ప్రభంజనం తర్వాత ఊరూరా ఎందరో శంకరాలు గొంతులు సవరించుకున్నారు. కొన్నేండ్లకు వాళ్లూ సంగీత గురువులు అయ్యారు. శాస్త్రీయ సంగీతానికి ఊపిరులూదారు. ఇక ప్రేమలో విఫలమైన ఓ నృత్య కళాకారుడు ‘గురు’తర బాధ్యత మీదపడ్డాక తన శిష్యురాలిని ఎంత గొప్పగా తీర్చిదిద్దాడో వివరించిన కథ ‘సాగర సంగమం’. శాస్త్రీయ నృత్యం గొప్పదనాన్ని చాటిచెప్పే ‘స్వర్ణకమలం’లోనూ గురువు ఔన్నత్యం కనిపిస్తుంది. ‘స్వాతి కిరణం’లో గంగాధరం పాత్ర గురువును మించిన శిష్యుడు అనిపించినా, సినిమా పూర్తయ్యే నాటికి గురువు మనసు మార్చిన శిష్యుడిగా గుర్తుండిపోతాడు.
మాస్టర్ టు ఠాగూర్
మెగాస్టార్ చిరంజీవి విద్యార్థిగా అలరించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఆయన ఉపాధ్యాయుడిగా పలకరించిన మొదటి సినిమా ‘మాస్టర్’. బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్రంలో చిరంజీవి నటనకు విద్యార్థులంతా ఫిదా అయ్యారు. క్లాస్‌లో పాఠాలు చెబుతూ, క్యాంటీన్లో ప్రేమ పాటలు పాడుతూ ఆద్యంతం అలరిస్తాడు మెగాస్టార్. పెడదారి పట్టిన విద్యార్థులను మంచివారిగా తీర్చిదిద్దడమే కాదు, కళాశాలను కలుషితం చేయజూసిన విలన్ గ్యాంగ్‌కు సరైన బుద్ధి చెబుతాడు ‘మాస్టర్’. ఇక చిరంజీవి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటి ‘ఠాగూర్’. ఇందులో ఆయన యూనివర్సిటీ ప్రొఫెసర్. సమాజంలో పేరుకు
పోయిన అవినీతి, లంచగొండితనాలపై తన విద్యార్థులను అస్ర్తాలుగా సంధిస్తాడు ఠాగూర్. ‘యాంటీ కరప్షన్ ఫోర్స్’ (ఏసీఎఫ్)తో ఠాగూర్ చేసిన యుద్ధం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. అధ్యాపకులపై గౌరవాన్నీ పెంచింది.
హైహై నాయకా
ఎంతటి జటిలమైన విషయాన్ని అయినా హాస్యం రంగరించి చెప్పడం దర్శకుడు జంధ్యాల మార్కు. గురువుల స్థితిగతులు, తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది.. ఈ సమస్యలన్నిటికీ నవ్వుల సమాధానం ‘హైహై నాయకా’ సినిమా. ఉద్యోగం దొరకని ఓ తెలుగు ఉపాధ్యాయుడు ఉపాధి కోసం ఎన్ని పాట్లు పడ్డాడో హాస్యభరితంగా చూపించాడు జంధ్యాల. తండ్రి గారాబంతో పిచ్చిమాటలు మాట్లాడే ఓ పిల్లవాణ్ని ఆ తెలుగు టీచర్ ఎలా దారిన పెట్టాడో మిగతా సినిమా. ఈ క్రమంలో నవ్వులు పూయిస్తూనే ఆలోచింపజేశాడు జంధ్యాల. ఆయన దర్శకత్వంలోనే తెరకెక్కిన మరో కళాత్మకమైన సినిమా ‘ఆనందభైరవి’. శాస్త్రీయ నృత్యాన్ని నేర్చుకోవడానికి అర్హత కులం కాదనీ, గుణమే అనీ నిరూపించిన సినిమా ఇది. ‘పిల్ల జమీందారు’లో ఎమ్మెస్ నారాయణలా ‘భాష చచ్చిపోతున్నది. ఎలాగైనా బతికించుకోవాలి’ అని ఆరాటపడే తెలుగు మాస్టార్లు బడికొక్కరు తారసపడతారు. ఆ జ్ఞానమూర్తులకు అక్షరాల పూలదండలు. ఆ సంస్కార స్వరూపులకు సాష్టాంగ నమస్కారాలు.