అందాన్ని పెంచడంలో చక్కెర చక్కగా ఉపయోగపడుతుంది. ముఖ సౌందర్యాన్ని రెట్టింపు చేయడంతోపాటు చర్మాన్ని మరింత మృదువుగా మారుస్తుంది. వంటింట్లో దొరికే కొన్ని పదార్థాలను చక్కెరతో కలిపి చేసే స్క్రబర్స్.. చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. కాఫీ పొడి, ఓట్మీల్, కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్.. ఇవన్నీ ఒక్కో సమస్యకు ఒక్కో పరిష్కారాన్ని చూపుతాయి.
డెడ్ స్కిన్ పొరను తొలగించడంలో.. గ్రీన్‌టీ, చక్కెర స్క్రబ్ అద్భుతంగా పనిచేస్తుంది. అర టీస్పూన్ చక్కెరలో కొద్దిగా ఆలివ్ నూనె, గ్రీన్ టీ ఆకులను కలిపి.. పేస్టులా చేసుకోవాలి. దీనితో ముఖం, మెడభాగంలో స్క్రబ్ చేసుకొని.. అరగంట తర్వాత కడిగేసుకుంటే డెడ్ స్కిన్ మొత్తం తొలగిపోతుంది.
చక్కెరకు ఓట్మీల్, ఆలివ్ ఆయిల్ కలిపి చేసే స్క్రబ్.. జిడ్డు చర్మం, మొటిమలను నివారిస్తుంది. చర్మంలో ఉండే అదనపు నూనెను తొలగిస్తుంది. దీనిలో ఉండే యాంటి ఇన్ఫ్లమేటరీ లక్షణాలు.. మొటిమలను నివారిస్తాయి.
మోచేతులు, మోకాళ్ల వద్ద నలుపును పోగొట్టడంలో.. చక్కెర, ఆలివ్ ఆయిల్ స్క్రబ్ ముందుంటుంది. మృతకణాలను తొలగించడంలో చక్కెర సాయపడితే.. ఆలివ్ నూనె చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.
చక్కెరకు కొద్దిగా కాఫీ పొడి, కొబ్బరినూనె కలిపి ముఖం, మెడ, చేతులపై సున్నితంగా రుద్దుతూ మర్దన చేసుకోవాలి. అరగంట తర్వాత కడిగేస్తే.. చర్మం మృదువుగా, కాంతిమంతంగా తయారవుతుంది.