Inspiration |ఆమెకు కేకులు, పిజ్జా బర్గర్లు అంటే ఇష్టం. రోజూ ఏదో ఒకటి రుచిచూడాల్సిందే. కొవిడ్ సమయంలో ఆ జిహ్వ చాపల్యానికి పెద్ద సమస్యే వచ్చింది. బేకరీలు మూసేశారు. ఆన్లైన్ డెలివరీ ఆగిపోయింది. ఇంట్లోనే తయారు చేసుకోవాల్సిన పరిస్థితి. తాను వండుకుని తినడమే కాదు, సహచరులకూ పంపేది. రుచి, నాణ్యత ఎలా ఉందని గుచ్చిగుచ్చి అడిగేది. ఆ ఫీడ్బ్యాక్ ఆధారంగా.. మరింత బాగా తయారు చేయడం మొదలుపెట్టింది. ఆ నైపుణ్యాన్ని వ్యాపార ఆలోచనగా మలుచుకుని, పెద్దపల్లి కేంద్రంగా ‘ద ఫుడ్ ప్రాజెక్ట్’ను ప్రారంభించింది గాదె అఖిల.
జీవితం చాలా చిత్రమైంది. మనం ఒక వైపు వెళ్లాలనుకుంటాం. కానీ మరో వైపు నడిపిస్తుంది. ఏదో సాధించాలని ఆరాటపడతాం. ఇంకేదో చేతిలో పెడుతుంది. అఖిల ప్రయాణంలోనూ ఇలాంటి మలుపులు అనేకం. ఆమె ఎంఏ చేశారు. ఐఏఎస్ తన జీవిత లక్ష్యం. రెండుసార్లు తీవ్రంగా ప్రయత్నించారు. సర్వీసు రాకపోయినా కష్టపడటం అలవాటైంది. ప్రపంచం పట్ల అవగాహన పెరిగింది. ఆమె తల్లి మాధవి పెద్దపల్లి మున్సిపల్ కౌన్సిలర్. తండ్రి రైతు. చిన్నప్పటి నుంచీ అఖిల చదువుల్లో చురుకే. దానికి కన్నవారి ప్రోత్సాహమూ తోడైంది. కూతుర్ని ఉన్నత స్థానంలో చూడాలనే కోరికతో.. పెద్ద చదువుల కోసం హైదరాబాద్ పంపారు. ఢిల్లీలో సివిల్స్ శిక్షణ ఇప్పించారు. రెండు వైఫల్యాల తర్వాత.. మరో అతిపెద్ద కుదుపు కొవిడ్. లాక్డౌన్తో ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చేశారు అఖిల. స్నేహితుడిని ప్రేమ వివాహం చేసుకున్నారు.
అఖిలకు బేకరీ ఫుడ్స్ అంటే ఇష్టం. లాక్డౌన్లో బయట తినడం కుదిరేది కాదు. దీంతో ఇంట్లోనే ప్రయోగాలు ప్రారంభించారు. కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తన వంటలు పంపేవారు. ‘రుచి ఎలా ఉంది?’, ‘తయారీలో ఏమైనా మార్పులు అవసరమా?’ అని అడిగేవారు. సలహాలూ తీసుకునేవారు. అలా తనను తాను సరిచేసుకుంటూ కేకులు, బర్గర్లు, పిజ్జాల తయారీలో నైపుణ్యం సంపాదించారు. ఆ అనుభవంలోంచి పుట్టుకొచ్చిన వ్యాపార ఆలోచనే.. ‘ద ఫుడ్ ప్రాజెక్ట్’ కేరాఫ్ పెద్దపల్లి. ఆర్టీవో ఆఫీసు ఎదురుగా సువిశాలమైన భవనాన్ని తన రుచుల ల్యాబొరేటరీగా మార్చుకున్నారు. పార్కింగ్ సౌకర్యం కల్పించారు. ఉచిత వైఫై ఉంటుంది. కిట్టీ పార్టీలు, బర్త్డే ఫంక్షన్లు కూడా చేసుకోవచ్చు. ఖరీదైన వ్యవహారమే అయినా ఏసీలు బిగించారు. ఫొటో ప్రియుల కోసం సెల్ఫీజోన్ కూడా ఉంది. రాత్రిపూట రంగురంగుల దీపకాంతులతో నక్షత్ర మండలాన్ని తలపిస్తుంది ఆ ప్రాంతం. ఇక రుచులు అంటారా? క్రిస్పీ బర్గర్, పాస్తా, మిల్ షేక్, మోజిటోస్, ఫ్రెంచ్ ఫ్రైస్, శాండ్ విచ్, కస్టమైజ్డ్ కేక్స్.. ఆ జాబితా చాలా పెద్దది. శుద్ధ శాకాహారుల కోసం ఎగ్లెస్ కేక్స్ అందిస్తారు. ఆరోగ్య ప్రియులకు ఇబ్బంది లేకుండా.. షుగర్ ఫ్రీ బిసెట్స్, మిల్లెట్ బ్రౌనీస్, మిల్లెట్ కేక్స్, షుగర్ ఫ్రీ- మైదా ఫ్రీ కేక్స్ విక్రయిస్తున్నారు.
ఏ అంకుర సంస్థకు అయినా పెట్టుబడే ప్రాణం. తొలిదశలో అఖిలకు కూడా అదే పెద్ద అవరోధంగా మారింది. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వ ‘స్టార్టప్ ఇండియా పథకం’ ఆదుకుంది. బ్యాంకు నుంచి పదిహేడు లక్షల రూపాయల రుణం తీసుకున్నారు. అంతకు ముందు నుంచే ఇన్స్టాగ్రామ్లో విస్తృత ప్రచారం ప్రారంభించారు. ఆన్లైన్లో ఆర్డర్లు తీసుకొని హోమ్ డెలివరీ చేశారు. ప్రతి వినియోగదారుడి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకునేవారు. అన్నిరకాలుగా సిద్ధమైన తర్వాతే.. ద ఫుడ్ ప్రాజెక్ట్ ప్రారంభించారు. తయారీలో కొంత సృజన జోడించి డాక్టర్, పోలీస్, జర్నలిస్ట్, పొలిటికల్ లీడర్.. కొనుగోలుదారుల వృత్తిని తలపించేలా డిజైనర్ కేక్స్ అందిస్తారామె. ‘కస్టమర్ వైవిధ్యాన్ని ఇష్టపడతారు. అందులోనూ ఆరోగ్య స్పృహ పెరిగిపోయింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే వ్యాపారాన్ని నిర్వహిస్తున్నా’ అని వివరిస్తారు అఖిల.
మా ఫుడ్ ప్రాజెక్ట్ను అన్ని వర్గాల ప్రజలూ ఆదరిస్తున్నారు. రసాయనాలకు దూరంగా.. సహజ సిద్ధమైన దినుసులతో తయారు చేస్తున్నాం. కేవలం పండ్లతోనే వెజ్ కేకులు చేయడం మా ప్రత్యేకత. శుభ్రతకు,
తాజాదనానికి పెద్దపీట వేస్తున్నాం. మహా నగరాలకే పరిమితమైన రుచులను పెద్దపల్లి ప్రజలకు పరిచయం చేస్తున్నాం. ఇదెంతో సంతృప్తిని కలిగించే విషయం.
– గాదె అఖిల
– అంకరి ప్రకాశ్,
-◊తూర్పాటి శ్రీనివాస్