సన్ నెక్ట్స్‌లో ‘హ్యాంగ్ మ్యాన్’ తెగ స్ట్రీమింగ్ అవుతున్నది. అందులో తలారి భార్య డైలాగ్ ఒకటి ప్రేక్షకుల్ని భలేగా ఆకట్టుకుంటున్నది! అదేంటంటే.. ‘నీ తాత, నీ అయ్య, నువ్వు తలారి చేశారు? ఎంతమంది ఉసురు కొట్టుకుంటారు. ఇంకా నా కొడుకు కూడా అదే పాపం చేయాలా? వద్దు. వాడిని చదువుకోనివ్వు’ అని తలారి(బ్రహ్మాజీ)తో గొడవపడుతుంది. తలారి కొడుకు క్యారెక్టర్ పోషించిన పల్లె సన్ని జీవితం కూడా అలాంటిదే. సమాజంలో తలారి వృత్తికి గౌరవం లేనట్టే మేస్త్రి పనికీ అంతగా గౌరవం లేదు. గుర్తింపు లేదు. తాతలు, తండ్రులు పడ్డ అవమానాలు చాలనుకుని ఊరు వదిలి పెట్టాడు సన్ని. హైదరాబాద్‌ల అడుగుపెట్టి సినిమాల్లో ప్రయత్నించాడు. యాక్టర్‌గా ప్రయాణం మొదలుపెట్టిన ఈ తెలంగాణ పిల్లగాని కథ అతని మాటల్లోనే..
మా నాన్న పల్లె శంకరయ్య వీధి బాగోతాలు ఆడేవాడు. చిన్నప్పుడు నాకు వేషం వేసి నిలబెట్టేవాడు. అట్ల వేషం కట్టడం అలవాటైంది. మెదక్ జిల్లా రేగొండ మండలంలోని పోచారం మా ఊరు. అక్కడ పీర్ల పండుగకు నేను గుడ్డెలుగు వేషం, పెండ్లి కొడుకు వేషం వేస్తే జనం చప్పట్లు కొట్టేది. ‘నిన్ను సిన్మల సూడాలె’ అనేది. ఏడు రోజుల సవారీ మస్తుగ జరుగుతుండె. నారాయణఖేడ్ సోషల్ వెల్ఫేర్ స్కూల్లో పదో తరగతి చదివిన. ఇంటర్మీడియెట్ చదువుతున్న రోజుల్లో తెలంగాణ ఉద్యమం ఊపుమీదికొచ్చింది. ధూంధాం మీటింగులైతున్నయ్. ఆ మీటింగ్‌ల కోరస్ పాడనీకి పోతుంటి. డ్యాన్స్ వేసుకుంట ఊళ్లెమ్మటి తిరిగిన. ఏడ మీటింగ్ ఉందంటే ఆడికి పోయిన. ఆడిన, పాడిన. అట్ల నా ఇంటర్ సదువంతా ఉద్యమం చుట్టూర తిరిగింది.
మాకు రెండెకరాల పొలం ఉంది. ఆ భూమిని పండించుకుంట మా అమ్మ పారమ్మ పొలం కైకిలికి పోయేటిది. నాన్న మేస్త్రి పనికి పోతుండేది. నాన్నతోని నేను గూడ మేస్త్రి పనికి పోతుంటి. పనిల పెట్టుకున్న మేస్త్రి ఊకె ‘అటుపో, ఇటుపో’ అని గద్దించేటోడు. పనికి పిలిచిన ఓనరైతే ఇగ ‘అరె, ఒరె, రాబే’ అని తప్ప పేరుపెట్టి పిలవకపోయేది. నాన్న కష్టపడుతుండు. నేనూ ఇదే కష్టం చేయాల్నా? మర్యాద కూడా లేదని వద్దనుకున్న. ఊర్ల ఫొటోగ్రాఫర్‌కి రెస్పెక్ట్ ఉంటదని వీడియోగ్రాఫర్ కింద అసిస్టెంట్‌గా చేరిన. కొన్నాళ్లకు కెమెరా నా చేతికొచ్చింది. కెమెరా తెలిసినంక సినిమాటోగ్రాఫర్ కావాల్ననుకున్న. ఇంటర్ కాంగనే బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్(బీఎఫ్ఏ) ఎంట్రన్స్ రాసిన. సీటొచ్చింది.
హైదరాబాద్‌ల సదువుకుంటనే సినిమా షూటింగ్ క్రేన్ ఆపరేటింగ్ యూనిట్లో అసిస్టెంట్‌గా చేరిన. పని చేసుకుంటూనే షూటింగ్‌ల నటీనటులు ఎట్లా యాక్ట్ చేస్తున్నరో చూసేటిది. రూమ్‌కి పోయినంక అద్దంల చూస్కుంట వాళ్ల తీర్గనే నేనూ యాక్టింగ్ చేసి మురిసిపోయేది. అనుకోకుండా ఓసారి సినిమా అవకాశం వచ్చింది. జూనియర్ ఆర్టిస్టులు లేక నన్ను బ్యాక్ గ్రౌండ్ల పెట్టుకున్నరు. వెండితెర మీద నా బొమ్మ పడ్డదని మస్త్ ఖుషీ అయిపోయిన. ఇగ అయితే.. గియితే యాక్టరే ఇంకోటి లేదనుకున్న. అట్లనే డిసైడ్ అయిన. సినిమా చాన్స్‌కి ఎవరిని పట్టుకోవాల్నో తెలియదు. తెలిసినోళ్లు చెబితే.. స్టిల్ ఫొటోలు దిగి, వాటి ఎనక ఫోన్ నంబర్ రాసి, సినిమా ఆఫీస్‌లకు పోయి ఇచ్చొచ్చిన. ఎవ్వలూ ఫోన్ చేయలే. అయినా ఆఫీస్‌లకు పోతనే ఉన్న.
హైదరాబాద్ వచ్చినంక రవీంద్ర భారతిలో అడుగుపెట్టడమే గొప్ప అనుకునేది. లోపలికి రానిస్తరో లేదోనని గేట్ దగ్గర రెండు రోజులు నిలబడి లోపల తిరిగే జనాన్ని చూసుకుంట ఉన్న. కొంచెం ధైర్యమొచ్చినంక గేటు దాటిన. రవీంద్ర భారతి ఆడిటోరియంలోకి పోవాలంటే భయమేసి బయటే తిరిగిన. అట్ల తిరుగుతుంటె.. ఓ రోజు ‘అందరూ ఆహ్వానితులే’ అనే పోస్టర్ కనిపించింది. అందర్నీ ఎందుకు పిలుస్తరు? ఇదంతా ఉత్తదేననుకొని పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ బయటే ఉన్న. రెండో రోజూ పోదాం.. చూద్దాం. ఏమన్నా అంటే బయటికొద్దామనుకుని అడుగుపెట్టిన. లోపలంతా నాలాంటి వాళ్లే. అందరూ సినిమా చూస్తున్నరు. నేను ఫొటోలు తీసిన. ‘ఎవరు నువ్వు?’ అని సినిమా స్క్రీనింగ్ నడిపే అక్షర కుమార్ అడిగిండు. భయపడుతూ చెబుతుంటే.. ‘అరె తమ్ముడు. తెలంగాణోడివా. మన కోసమే ఈ తెలంగాణ సిన్మా’ అంటూ ముచ్చట చెప్పిండు. మామిడి హరికృష్ణ సార్‌ని కలిపిచ్చిండు. నా ఫొటోలు చూసి ఎగ్జిబిషన్ పెట్టమని చెప్పి, సాయం చేస్తమన్నరు. అట్ల రవీంద్ర భారతిల ‘ఫిల్మ్ తెలంగాణ’ టీమ్‌తో దోస్తీ కుదిరింది. అందులో ఉన్న ప్రదీప్, నితిన్ దొరసాని సినిమా ఆడిషన్స్ ఉన్నయని చెబితే పోయిన. ‘దొరసాని’ల హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ వచ్చింది.
నా లైఫ్ మారిపోయింది. తర్వాత ‘మెయిల్’ల చిన్న రోల్ (విలన్) చేసిన. అమెజాన్ వెబ్ సిరీస్ ‘శివరపల్లి’లో పంచాయతీ ఆఫీస్‌లో గుమస్తా క్యారెక్టర్ చేసిన. ఎనిమిది ఎపిసోడ్స్ల కనిపించే మెయిన్ రోల్ ఇది. చిన్న చిన్న రోల్స్ చేసుకుంట పెద్ద అవకాశాల దాంక వచ్చిన. ‘హ్యాంగ్ మ్యాన్’కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రెండు పెద్ద సినిమాలు చేస్తున్న. గౌరవం ఉన్న పని చేస్కొని బతకాల్నని వచ్చిన. ఇప్పుడు నేనే కాదు మా ఊరోళ్లు గిన నా గురించి గర్వంగా చెప్పుకొంటున్నరు!
‘ఉరి తీస్తే సమాజం మారుతుందంటే మొదటి ఉరితోనే నేరాలు ఆగాలి. కానీ, సమాజం మారలేదు. నేరాలు ఆగలేదు. ఇంకెందుకు ఈ ఉరి? వ్యవస్థ మారెదెప్పుడు? ఉరి ఆగెదెప్పుడు?’ తలారి సినిమా సారం ఇదే. సన్నీ జీవితంలోని సారం కూడా ఇలాంటిదే. వ్యవస్థ మారదు. కాబట్టి ఆకలి, అవమానం ఉన్న చీకట్లోనే ఎందుకుండాలనుకున్నడు? గౌరవం, గుర్తింపు ఉన్న చోటకుపోయిండు. వెండి వెలుగు అతని జీవితంలో గెలుపు, గుర్తింపు, గౌరవం తీసుకొచ్చింది.
– నాగవర్ధన్ రాయల