ఇంటీరియర్ డిజైనింగ్‌లో ఎన్ని వెరైటీలు వచ్చినా ఇంకా ఏదో కొత్తది మిగిలిపోయే ఉంటుంది. అలాంటి వాటిలో ఒక రకమే ఈ ‘యానిమల్ ఫేస్ ఫాసెట్’లు. ప్రతి ఇంట్లోనూ సింకు, ట్యాప్ అన్నవి తప్పనిసరి. సింకు దగ్గర నీళ్ల ధార పడటం, మనం చేతులు కడుక్కోవడం, లేదా గిన్నెలు తోమడంలాంటి పనులు చేసుకోవడం.. సర్వసాధారణమే.
కానీ ఆ ట్యాప్‌కి కూడా విభిన్నతను అద్దుతూ, ఆ చోటుకు ప్రత్యేకమైన అందాన్ని తీసుకొస్తాయి ఈ కొత్త రకం ఫాసెట్లు. జిరాఫీ, ఎలుగుబంటి, ఎద్దు, బాతు… ఇలా రకరకాల జంతువుల ముఖాలను పోలి వీటిని తయారు చేస్తున్నారు. విభిన్న రంగులతో పాటు బ్రౌన్లాంటి ముదురు వన్నెల్లోనూ రూపొందుతున్నాయివి. ఇత్తడి, సిరామిక్, కంచు, స్టెయిన్ లెస్స్టీల్లాంటి వాటితో వీటిని తీర్చిదిద్దుతున్నారు.

చూడగానే విభిన్నంగా కనిపించడంతో పాటు గదికి లగ్జరీ లుక్‌ని తీసుకురావడంలో ఇవి తమదైన ముద్ర వేస్తున్నాయి. అటు చిన్నపిల్లల్ని ఆకట్టుకుంటూ, ఇటు జంతుప్రేమికుల మనసు దోచుకుంటున్న ఇవి ఇప్పటి ఇంటీరియర్‌లో నయా ట్రెండ్. చేతులు కడుక్కునేందుకు మారాం చేసే పిల్లలకు ఇవి మంచి మందు. వెరైటీ, లగ్జరీల మేలిమి కలబోతగా వీటిని చెప్పొచ్చు. అందుకే ఈ రెండూ ఒకేచోట కావాలనుకుంటే యానిమల్ ఫేస్ ఫాసెట్లు మంచి ఎంపికనే చెప్పాలి.