సాధారణంగా స్మార్ట్వాచీలన్నీ స్టయిలిష్గానే కనిపిస్తాయి. కొన్ని రగ్గ్డ్ లుక్‌తో ఉంటే.. మరికొన్ని స్పోర్ట్ లుక్‌ను తీసుకొస్తాయి. కానీ, కొన్ని ప్రీమియం వాచీలే.. రాయల్ లుక్ అందిస్తాయి. అయితే, ఈ రెండిటినీ మిక్స్ చేసి.. అటు స్టయిలిష్‌గా, ఇటు రాయల్ లుక్‌లో కనిపించేలా ఓ సరికొత్త స్మార్ట్‌వాచీ మార్కెట్లోకి అడుగుపెట్టింది. చైనాకు చెందిన దిగ్గజ టెక్ సంస్థ హువావే.. తాజాగా ‘జీటీ సిరీస్’ స్మార్ట్‌వాచీలను తీసుకొచ్చింది. హువావే వాచ్ జీటీ6, జీటీ6 ప్రొ ఎడిషన్లను భారత్‌లో విడుదల చేసింది. లుక్ పరంగానే కాదు.. ఫీచర్ల విషయంలోనూ ఎలాంటి రాజీ పడకుండా ఈ వాచీలకు రూపకల్పన చేసింది. వీటిలో 466*466 పిక్సెల్ రిజల్యూషన్ కలిగిన 1.47 అంగుళాల AMOLED డిస్ప్లేను ఏర్పాటు చేశారు. టైటానియం అల్లాయ్ కేస్‌తో స్టయిలిష్‌గా కనిపిస్తాయివి. సైక్లిస్టులు, అథ్లెట్ల కోసం రూపొందించిన ఈ వాచీలు.. సైక్లింగ్ పవర్ ట్రాకింగ్‌తోపాటు 100 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్లకు మద్దతు ఇస్తాయి. ఇందులో ఏర్పాటు చేసిన ఆప్టికల్ హార్ట్‌రేట్ సెన్సర్.. కచ్చితమైన హృదయ స్పందన రేటును అందిస్తుంది.
స్పోర్ట్స్ ట్రాకింగ్, సైక్లింగ్ పవర్ మానిటరింగ్, స్లీపింగ్ మానిటరింగ్ లాంటి హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లను పొందుపరిచారు. యాక్సిలెరోమీటర్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్, బేరోమీటర్, టెంపరేచర్ సెన్సర్, యాంబియంట్ లైట్ సెన్సర్, ఈసీజీ సెన్సర్‌తోపాటు డెప్త్ సెన్సర్ ఉన్నాయి. 5ఏటీఎం+ ఐపీ 69 రేటింగ్‌లతో వస్తుండటం వల్ల.. వర్కవుట్లు చేస్తున్నప్పుడు చెమట పట్టినా ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కనెక్టివిటీ కోసం జీపీఎస్, ఎన్ఎఫ్సీ, బ్లూటూత్ 6, వైఫై, గెలీలియో లాంటి ఆధునిక ఫీచర్లు ఏర్పాటుచేశారు. వీటిని ఒకసారి చార్జింగ్ పెడితే.. 21 రోజులపాటు వాడుకోవచ్చు. ప్రస్తుతం ఈ రెండు స్మార్ట్‌వాచీలు ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌పై అందుబాటులో ఉన్నాయి. హువావే జీటీ 6 ప్రొ ధర.. రూ.28,999 నుంచి ప్రారంభమవుతున్నది. టైటానియం ఆప్షన్ ధర రూ.39,999గా నిర్ణయించారు. ఇక హువావే వాచ్ జీటీ 6 ధర.. రూ.21,999 నుంచి మొదలవుతున్నది. గోల్డ్ వేరియంట్ కావాలంటే.. రూ. 24,999 చెల్లించాల్సి ఉంటుందని హువావే ప్రతినిధులు చెబుతున్నారు.