రాముడు దేవుడు కాదు.. మనిషి. రాముడు మనిషి కాదు.. దేవుడు. కాదు.. రాముడు మనిషిగా పుట్టి దేవుడయ్యాడు.. కాదుకాదు.. దేవుడే మనిషిగా పుట్టి రాముడయ్యాడు.. వాల్మీకి రాస్తుండగా రామాయణం జరిగిందా? వాల్మీకి రాశాక రామాయణం జరిగిందా? లేక జరిగిపోయిన కథను వాల్మీకి రాశాడా? ఈ వాదనలు, ఈ ప్రశ్నలు ఈనాటివి కావు. యుగాల నాటివి. అసలు ‘రామాయణం జరగలేదు.. అది వాల్మీకి అనే ఓ పెద్దాయన రాసిన కథ మాత్రమే..’ అనే వాళ్లు కూడా ఉన్నారు. అలాగే.. అయోధ్య నుంచి శ్రీలంక వరకూ రామ పాదముద్రలను చారిత్రక ఆధారాలుగా చూపించే ఆధ్యాత్మిక పరిశోధకులు కూడా ఉన్నారు. సంకుచిత మనసుతో ఆలోచిస్తే ఇది అర్థమయ్యేది కాదు.
Sri Rama Navami | అఖండ భరతావనిపై రామాయణం ప్రభావం మాత్రం అసామాన్యం. అసలు భారతీయ వైవాహిక, కుటుంబ వ్యవస్థలు ప్రపంచానికే తలమానికంగా నిలిచాయంటే కారణం రామాయణం. కొడుకు ఎలా ఉండాలి? రాముడిలా ఉండాలి. అన్న ఎలా ఉండాలి? రాముడిలా ఉండాలి. భర్త ఎలా ఉండాలి? రాముడిలా ఉండాలి. వీరుడెలా ఉండాలి? రాముడిలా ఉండాలి. దేవుడెలా ఉండాలి? రాముడిలా ఉండాలి. అసలు మనిషి ఎలా ఉండాలి? రాముడిలా ఉండాలి. అలాగే కూతురెలా ఉండాలంటే సీతమ్మలా ఉండాలి.. కోడలెలా ఉండాలంటే సీతమ్మలా ఉండాలి.. భార్య ఎలా ఉండాలంటే సీతమ్మలా ఉండాలి. ఇలా అన్ని బంధాలకూ ఆదర్శంగా నిలిచారు సీతారాములు. సంస్కృతిపైనే కాదు, సాంస్కృతికంగా కూడా దేశంపై చెరగని ముద్ర వేశారు.
రామ నామానికీ.. రామభక్తికీ.. ఏదో తెలియని శక్తి ఉన్నదని చరిత్ర చెబుతున్నది. 72 మేళకర్త రాగాలను, తద్వారా ఎన్నో కృతులను సంగీత ప్రపంచానికి రామ ప్రసాదంగా సమర్పించారు త్యాగరాజస్వామి. ‘పలికెడిది భాగవతమట.. పలికించెడివాడు రామభద్రుండట’ అని భాగవత రచనకు ముందే అసలు విషయాన్ని వ్యక్తపరిచారు పోతనామాత్యుడు. ఇక భజన సంకీర్తనా సంస్కృతిని సమస్త మానవాళికీ రామభక్తితో అందించిన కంచర్ల గోపన్న.. ‘రామదాసు’గా వినుతికెక్కాడు. సాంస్కృతిక పరంగా రామభక్తి ప్రభావం దేశంపై, మరీ ముఖ్యంగా తెలుగు నేలపై ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఈ ఉదాహరణలు చాలు.
సకల కళల సమ్మేళనమైన సినిమాపైన కూడా రాముడి ముద్ర బలంగానే ఉంది. రామాయణం ప్రేరణగా వందల కథలు వెండితెరపై వెలిగాయి. ఆ మాటకొస్తే అచ్చంగా రామాయణాన్నే ఎన్నోసార్లు తీశారు. సాంకేతికంగా సినిమా ఎంత ఎదిగినా.. కథా గమనాల్లో ఎన్ని మార్పులు జరిగినా.. రామాయణ ప్రభావం మాత్రం నేటికీ సినిమాపై అలాగే ఉంది. ప్రస్తుతం వెండితెరపై హీరోయిజం, ఎలివేషన్స్ రాజ్యమేలుతున్నాయి. అభిమాన హీరోల సినిమాల్లో హీరోయిజం అదిరిపోవాలనీ, ఎలివేషన్లు ఓ స్థాయిలో ఉండాలని అభిమానులే కోరుకుంటున్నారు. అసలు ఈ హీరోయిజం ఎక్కడినుంచి పుట్టింది?.. అంటే.. రాముడి గురించి తెలుసుకోవడమే దానికి సమాధానం. విలన్ ఎంత శక్తిమంతుడైతే హీరోయిజం అంత ఎస్టాబ్లిష్ అవుతుందనే సూత్రం సినిమాకు తెలియజెప్పిందే రామాయణం. ఇక ఎలివేషన్స్.. ఈ ట్రెండ్‌కి త్రేతాయుగంలోనే నాంది పలికారు వాల్మీకి. ‘మారీచ ఉవాచ’, ‘అంగద రాయబారం’, ‘హనుమంతుడి హితబోధ’.. రామాయణంలోని ఈ ఘట్టాలే అందుకు నిదర్శనాలు.
పురాణాల ప్రకారం ముక్కోటి దేవతలున్నా.. రాముడంటేనే ఎందుకో కోట్లాదిమందికి అలవిమాలిన ప్రేమ.. అనిర్వచనీయమైన భక్తి. ఈ భక్తి ఆచంద్రతారార్కం వర్ధిల్లుతూనే ఉంటుంది. నేడు శ్రీరామనవమి. తెలుగునేలంతా చలువ పందిళ్లే.. ఎటు చూసినా సీతారామ కల్యాణాలే. ఎక్కడ విన్నా మంగళవాయిద్యాలే. తీయని పానకం.. కమ్మటి వడపప్పు రామచంద్రమూర్తికి నైవేద్యంగా సమర్పించి, భక్తిపారవశ్యంతో జనం మైమరిచిపోయే శుభదినం నేడు. దేవుడి పెళ్లి అయ్యేదాకా, మనుషులు పెళ్లాడకూడదనే సంప్రదాయం తెలుగునేలపై ఇంకా ఉంది. అందుకే భద్రాద్రి రామయ్య కల్యాణం కోసం పెళ్లి కావాల్సిన జంటలు ఆశగా ఎదురు చూస్తుంటాయి. బహుశా రాములోరి పెళ్లి తెలంగాణ గడ్డపై జరిగినంత ఘనంగా మరెక్కడా జరగదేమో! ఈ శుభ ఘడియలు పదిలం చేసుకుందాం. కల్యాణ రాముడి కమనీయ గాథలు పదే పదే తలుచుకుందాం!!
రాముడు.. రామాయణం.. సినిమా.. ఈ అంశాల గురించి మాట్లాడుకునేటప్పుడు ఓ ఇద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వారిలో ఒకరు నటరత్న ఎన్టీరామారావు అయితే.. మరొకరు దర్శకుడు బాపు. శ్రీరాముడి అవతార ప్రారంభం నుంచి సమాప్తం వరకూ రాముడిగా నటించిన క్రెడిట్ ఎన్టీఆర్దైతే.. రామకథను సంపూర్ణంగా తెరపై ఆవిష్కరించిన ఘనత దర్శకుడు బాపుది. ఎన్టీఆర్ నటించిన ‘సంపూర్ణ రామాయణం’ (1958) సినిమా.. రామ జననం నుంచి పట్టాభిషేకం వరకూ ఉంటుంది. ఆ తర్వాత ఆయన ‘లవకుశ’ (1963) చేశారు. ఆ సినిమా రామావతార సమాప్తం వరకూ ఉంటుంది. ఆ విధంగా వెండితెరపై ఎన్టీఆర్ రామావతారాన్ని పూర్తిచేశారు. ఇక బాపు విషయానికి వస్తే.. ఆయన తీసిన ‘సీతా కల్యాణం’ (1976) కథ.. సీతారాముల కల్యాణం వరకు ఉంటుంది. ఆయనే తీసిన ‘సంపూర్ణ రామాయణం’ (1972).. శ్రీరామ పట్టాభిషేకం వరకూ ఉంటుంది. అలాగే.. బాపు చివరి సినిమా ‘శ్రీరామరాజ్యం’ (2011) రామావతార సమాప్తం వరకు కొనసాగుతుంది. ఆ విధంగా బాపు వెండితెరపై రామాయణ కావ్యాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించారు. రామాయణ పాత్రల కల్పిత కథతో నిర్మాతలు పొట్లూరి వెంకటనారాయణరావు, ఎస్బీకే ఉమామహేశ్వరరావు ‘శ్రీరామాంజనేయ యుద్ధం’ అనే సినిమా తీశారు. ఆ సినిమాకు దర్శకుడు బాపు అయితే.. రాముడు ఎన్టీఆర్. మొత్తంగా ఎక్కువసార్లు రాముడిగా నటించి రామారావు.. ఎక్కువసార్లు రామాయణాన్ని తెరకెక్కించి బాపు.. ఇద్దరూ రాములోరి తాలూకాగా మిగిలిపోయారు.
మరీ ముఖ్యంగా రామారావుకి రాముడికీ ఏదో అవినాభావ సంబంధం ఉందనిపిస్తుంది. ఎన్టీఆర్ రాముడిగా చేసిన ‘లవకుశ’లో లక్ష్మణుడిగా నటించిన కాంతారావు.. ఆ తర్వాత ‘వీరాంజనేయ’ (1968) చిత్రంతో రాముడిగా మారారు. అలాగే.. అదే ‘లవకుశ’లో శత్రుఘ్నుడిగా నటించిన శోభన్‌బాబు బాపు ‘సంపూర్ణ రామాయణం’లో రాముడిగా నటించారు. ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘సీతారామ కళ్యాణం’ (1961) సినిమాతో హరనాథ్ రాముడిగా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ఆయనే ‘శ్రీరామకథ’ (1969) సినిమాలో రాముడిగా నటించారు. ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలకృష్ణ ‘శ్రీరామరాజ్యం’ సినిమాలో రాముడిగా నటిస్తే.. మనవడు జూనియర్ ఎన్టీఆర్.. పిల్లలతో గుణశేఖర్ తెరకెక్కించిన ‘రామాయణం’ సినిమాలో రాముడిగా మెరిశారు. ఆ విధంగా రాముడిగా నటించి, మెప్పించిన దాదాపు అందరితో కూడా.. అటు వృత్తిపరంగా, ఇటు వ్యక్తిగతంగా రామారావుకు అనుబంధం ఉండటం విశేషం. అంతేకాదు, ఒకే కుటుంబంలో తాత, తనయుడు, మనవడు.. ఇలా మూడు తరాలు శ్రీరాముడిగా నటించిన ఘనత భారత సినీ చరిత్రలో ఒక్క ఎన్టీఆర్ కుటుంబానికే దక్కింది. ఇక బాపు అయితే.. రామాయణం ప్రేరణగా సాంఘిక చిత్రాలను కూడా తీసేశారు. మచ్చుకు.. ముత్యాలముగ్గు, గోరంతదీపం, కలియుగ రావణాసురుడు.. ఈ మూడు సినిమాలనూ చెప్పుకోవచ్చు.