శ్రీరామ నవమి సందడి అంతటా కనిపిస్తున్నది. ఆసేతు హిమాచలం రామయ్య పెండ్లి కన్నులపండువగా జరుగుతుంది. కోదండ రామయ్య కల్యాణ క్రతువులో ప్రతి పర్వమూ ముచ్చటే! కల్యాణరాముడికి నివేదనగా సమర్పించి పంచే వడపప్పు, పానకం మరింత ప్రత్యేకమైనవి. రామనామమంత మధురంగా ఉండే పానకాన్ని బిందెలకొద్దీ చేసి ఊరూవాడా పంచుతుంటారు భక్తులు. అది తాగడానికి జనం ఎగబడుతుంటారు. నీటికి బెల్లం, మిరియాలు, యాలకులను కలిపి పానకం తయారుచేస్తారు. సూర్యుడు భగభగమండే ఎండాకాలంలో పానకం శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. వాత పిత్త కఫ-త్రిదోషాలను సమతూకంలో ఉంచుతుంది. శరీర ఆరోగ్యానికి సహకరిస్తుంది. ఇక నీళ్లలో నానబెట్టి వడగట్టిన పెసరపప్పును వడపప్పు అంటారు. వడపప్పు పానకం కలిపి తీసుకుంటే జీవక్రియలు మెరుగవుతాయని చెబుతారు.