పలకరింపు సందేశాలకు కొత్త భాష్యం చెప్పిన ప్లాట్‌ఫామ్ వాట్సాప్. ఒకప్పుడు చాటింగ్‌కే పరిమితమైన వాట్సాప్ ఇప్పుడు ‘ఆల్ ఇన్ వన్’గా మారింది. వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, పేమెంట్స్, చానెల్స్, కమ్యూనిటీలు… ఇలా అన్నిటికీ వేదికైంది.
యూజర్లకు మరింత దగ్గర కావడానికి వాట్సాప్ రెగ్యులర్‌గా కొత్త ఫీచర్స్‌ను పరిచయం చేస్తున్నది. ఈ క్రమంలో వచ్చిన మరో హాట్ అప్డేట్ ‘స్పామ్ బ్లాకర్’. ఇది త్వరలోనే ఆండ్రాయిడ్ ఐఓఎస్‌లపై లాంచ్ కానుంది. దీని సాయంతో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే సందేశాలకు అడ్డుకట్ట వేయొచ్చు.
వాట్సాప్‌లో తరచూ అన్నోన్ నంబర్స్, గ్రూప్స్ నుంచి మెసేజ్‌లు రావడం, వాటిని చూసి డిలీట్ చేయడం రొటీన్‌గా మారింది. ముఖ్యంగా ఆఫర్లు, డిస్కౌంట్లు, వర్క్ ఫ్రమ్ హోమ్.. ఇలా రకరకాల మెసేజ్‌లు వరుసకట్టి వస్తుంటే.. చికాకు కలగకమానదు.
ఈ ఇబ్బందులకు ‘స్పామ్ బ్లాకర్’ ముగింపు పలకనుంది. దీన్ని ఉపయోగించి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే స్పామ్ మెసేజ్‌లను ఫిల్టర్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఈ బీటా వెర్షన్‌ని వాడుతున్నట్లయితే సెట్టింగ్స్‌లో ‘ప్రైవసీ’లోకి వెళ్లి ‘బ్లాక్ అన్నోన్ అకౌంట్ మెసేజెస్’ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే సరి!