మతాలు, సంప్రదాయాలు కాదు.. దంపతుల మధ్య పరస్పర గౌరవమే ముఖ్యమని అంటున్నది బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా (Sonakshi Sinha). సీనియర్ నటుడు శత్రుఘ్ను సిన్హా కుమార్తెగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. అనతికాలంలో అగ్రతారగా ఎదిగింది. డబుల్ ఎక్స్ఎల్ చిత్రంలో తనతో కలిసి నటించిన జహీర్ ఇక్బాల్‌ను మతాంతర వివాహం చేసుకొని.. అందరికీ షాకిచ్చింది. తాజాగా, ఓ ఆన్లైన్ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. తన వివాహం, వ్యక్తిగత జీవితం గురించి చెప్పుకొచ్చింది.
‘మతం’ అనేది తమ మధ్య ఎప్పుడూ రాని విషయమనీ, ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవమే తమ బలమని పేర్కొన్నది. “ఇద్దరం విభిన్న ఆచార వ్యవహారాల్లో పెరిగాం. ఇక్బాల్.. తన కుటుంబం అనుసరించే కొన్ని ఆచారాలు పాటిస్తాడు. వాటిని నేను గౌరవిస్తాను. నేను, నా కుటుంబం అనుసరించే ఆచార వ్యవహారాలకు ఇక్బాల్ మర్యాదిస్తాడు” అంటూ వెల్లడించింది. తాను మతాంతర వివాహం చేసుకున్నా.. కుటుంబ సభ్యులు స్వాగతించారని చెప్పింది.
“నాతో కన్నా.. ఇక్బాల్తోనే ఎక్కువ సమయం గడపడానికి నాన్న ఇష్టపడతారు. నిజంగా వాళ్లిద్దరు మంచి స్నేహితులయ్యారు!” అంటూ చెప్పుకొచ్చింది. దాదాపు ఎనిమిదేళ్లు డేటింగ్లో ఉన్న సోనాక్షి-ఇక్బాల్.. 2024లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లి తర్వాత కొన్నాళ్లు చిత్రసీమకు దూరమైన సోనాక్షి.. ఆ తర్వాత అడపాదడపా సినిమాలు చేస్తున్నది. సుధీర్‌బాబు హీరోగా రాబోతున్న ‘జఠాధార’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం కాబోతున్నది.
ఇదికాకుండా.. మరో హిందీ చిత్రంలోనూ నటిస్తున్నది. కెరీర్ ప్రారంభంలో కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసిన సోనాక్షి.. యాక్షన్-డ్రామా చిత్రం దబాంగ్ (2010)తో నటనా రంగ ప్రవేశం చేసింది. తొలి సినిమాతోనే ఫిలింఫేర్ అవార్డును గెలుచుకుంది. అనేక విజయవంతమైన చిత్రాలతో.. బాలీవుడ్ టాప్ హీరోయిన్గా
ఎదిగింది. తమిళ డబ్బింగ్ చిత్రం ‘లింగా’తో తెలుగు ప్రేక్షకులను పలక రించింది.