బంధాలు బలంగా ఉండాలంటే.. నమ్మకం, గౌరవంతో కూడిన బలమైన పునాది ఉండాలి. పరస్పరం ప్రేమను పంచుకోవాలి. ఒకరి అభిప్రాయాలు, నిర్ణయాలను ఎదుటివారు గౌరవించు కోవాలి. అప్పుడే.. ఆ బంధం మరింత బలంగా మారుతుంది. లేకపోతే.. బంధానికి బీటలు వారుతాయి. మరి.. మీ భాగస్వామితో మీ బంధం ఎలా ఉన్నది? అనేది తెలుసుకోవాలంటే.. మీకు మీరు కొన్ని ప్రశ్నలు వేసుకోవాల్సిందే!
ఆరోగ్యకరమైన బంధానికి అతిపెద్ద సంకేతం.. భాగస్వామితో ఉన్నప్పుడు మీరు ఎలా ఉంటున్నారు? అనేదే! మీరు సంతోషంగా, రిలాక్స్డ్గా ఉండటమే కాదు.. మీరు మీలాగే ఉంటున్నారా? లేకుంటే, భాగస్వామి చెప్పినట్లు ప్రవర్తిస్తున్నారా? సమాధానం గురించి ఆలోచించకుండా మీరు వాస్తవికంగా ఉండగలిగినప్పుడు.. మీరు సరైన వ్యక్తితోనే ఉన్నారని అర్థం.
జీవితం సాఫీగా సాగుతున్నప్పుడు అన్నీ బాగానే ఉంటాయి. కష్ట సమయాల్లోనే భాగస్వామి అసలు మనస్తత్వం బయటపడుతుంది. సమస్యలు ఎదురైనప్పుడు ఇద్దరూ కలిసి పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తారా? లేదా మీ సమస్య మీదేనని దూరంగా ఉంటారా? కష్ట సమయాల్లో కూడా కలిసి ఉండటం.. నిజంగా ఒకరిపై ఒకరికి నమ్మకాన్ని పెంచుతుంది.
ఉద్యోగం, అభిరుచి, వ్యక్తిగత మార్పులు.. ఏ విషయంలోనైనా మీ భాగస్వామి మీ ఎదుగుదలకు మద్దతు ఇస్తారా? లేక అభద్రతా భావంతో మీ పురోగతిని అడ్డుకుంటారా? ఆరోగ్యకరమైన బంధంలో ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం ఎంతో ముఖ్యం. మీ భాగస్వామి మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటే.. మీ బంధం ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లే!