కొన్ని సందర్భాల్లో జన్యు, ఆహార లోపం వల్ల ‘ట్రోపికల్ పాంక్రియాటైటిస్’ చిన్న వయసులోనే బయటపడొచ్చు. ఈ సమస్య ఉన్నవారికి అల్ట్రాసౌండ్ పరీక్షలతో పాంక్రియాస్ గొట్టంలో వాపు, రాళ్లు చేరడాన్ని గమనించొచ్చు.
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలోని ప్రతి అవయవం బాగుండాలి. వాటి పనితీరు సక్రమంగా జరగాలి. అలాంటి వాటిలో జీర్ణవ్యవస్థ కూడా ముఖ్యమైంది. జీర్ణవ్యవస్థలోని ప్రధాన భాగమైన పాంక్రియాస్ గ్రంథి మరీ ముఖ్యమైంది. పాంక్రియాస్ వాపు, పాంక్రియాస్లో రాళ్లు, పాంక్రియాటిక్ క్యాన్సర్ మొదలైన సమస్యలు ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయి. మారుతున్న జీవనశైలి, మద్యపానం వీటికి ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు. పాంక్రియాస్, వాటికి వచ్చే సమస్యలేంటో తెలుసుకుందాం.
పాంక్రియాస్లో రెండు భాగాలు :
శరీరంలో పాంక్రియాస్ గ్రంథికి చాలా ప్రాముఖ్యం ఉంది. ఇది జీర్ణాశయంలో ఎగువ భాగంలో ఉంటుంది. ఇందులో ముఖ్యంగా రెండు భాగాలుంటాయి. ఒక భాగం ఎంజైమ్‌లను ఉత్పత్తి చేసి చిన్నపేగులోని ఆహారం జీర్ణమయ్యేలా చేస్తుంది. దీన్ని ‘ఎక్సోక్రైన్ పాంక్రియాస్’ అంటారు. వీటిలోని అమైలేజ్ ఎంజైమ్ పిండి పదార్థాలను, లైపేజ్ ఎంజైమ్ కొవ్వు పదార్థాల్ని, ట్రిప్సిన్ ఎంజైమ్ మాంసకృత్తుల్ని జీర్ణం చేస్తాయి. మరో భాగాన్ని ‘ఎండోక్రైన్ పాంక్రియాస్’ అంటారు. ఇది అనేక రకాల హార్మోన్లను ఉత్పత్తి చేయడం ద్వారా, శరీరంలోని గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తుంది. ఈ భాగంలో ఎదురయ్యే సమస్యలు మధుమేహానికి దారి తీస్తున్నాయి.
సమస్య 1 : అక్యూట్ పాంక్రియాటైటిస్
పాంక్రియాస్ గ్రంథిలో వాపు రావడాన్ని ‘అక్యూట్ పాంక్రియాటైటిస్’ అంటారు. గాల్ బ్లాడర్‌లో రాళ్లు, అధిక మద్యపానం, ఇతర మందుల వాడకం, అధిక కొలెస్ట్రాల్ వంటివి ఈ సమస్యకు ముఖ్య కారణాలు. ఇది ఉన్నవారికి కడుపులో, వెన్నులో తీవ్రనొప్పి వస్తుంది. తీవ్రతనుబట్టి జ్వరం, వాంతులు, కడుపు ఉబ్బరం, శ్వాసలో ఇబ్బంది, మూత్రం తగ్గిపోవడం కూడా జరగొచ్చు. ఇంకొందరిలో కామెర్లు, ఇన్ఫెక్షన్లు, పేషెంట్ అపస్మారక స్థితిలోకి వెళ్లడం గమనించొచ్చు. అందువల్ల, సమస్య తీవ్రం కాకముందే రక్త పరీక్షలు, సీరమ్ అమైలేజ్, అల్ట్రాసౌండ్ పరీక్ష చేయిస్తే వ్యాధిని త్వరగా గుర్తించే వీలుంటుంది. చాలా సందర్భాల్లో మందులతోనే సమస్య తగ్గుతుంది. కొన్ని సందర్భాల్లో మాత్రం లాప్రోస్కోపీ, ఎండోస్కోపీ పద్ధతులద్వారా ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది.
సమస్య 2 : పాంక్రియాస్లో రాళ్లు
ఈ సమస్యతో బాధపడే వారికి కడుపు పైభాగంలో నొప్పి ఉంటుంది. అలాగే, ఆ నొప్పి వెన్నుపూసలోకి జారడం జరుగుతుంది. వీటివల్ల పని చేసుకోలేని పరిస్థితి ఎదురవుతుంది. పాంక్రియాస్ కుంచించుకుపోయే అవకాశం ఉంది. దానివల్ల విరేచనాల్లో నూనె జిగురు పడుతుంది. మధుమేహం దాడి చేయడంతో సమస్య తీవ్రత పెరగవచ్చు. దీంతో కామెర్లు, బరువు తగ్గడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో జన్యు, ఆహార లోపం వల్ల ‘ట్రోపికల్ పాంక్రియాటైటిస్’ చిన్న వయసులోనే బయటపడొచ్చు. ఈ సమస్య ఉన్నవారికి అల్ట్రాసౌండ్ పరీక్షలతో పాంక్రియాస్ గొట్టంలో వాపు, రాళ్లు చేరడాన్ని గమనించొచ్చు. ఎంఆర్సీపీ పరీక్షలు అవసరం పడొచ్చు. రోగ తీవ్రతనుబట్టి పాంక్రియాస్ ఎంజైమ్ సప్లిమెంట్స్, నొప్పి నివారణ మందులు వాడాల్సి ఉంటుంది. రాళ్లు ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని లిథో ట్రిప్సీ, ఎండోస్కోపీ ద్వారా తొలగించొచ్చు. ఆ రాళ్ల పరిణామం ఎక్కువున్నా, పాంక్రియాస్ గొట్టం ఆరు మిల్లీ మీటర్లకన్నా ఎక్కువగా ఉన్నా ఎల్పీజే ఆపరేషన్ద్వారా శాశ్వత పరిష్కారం కనుగొనవచ్చు.
సమస్య 3 : పాంక్రియాస్లో క్యాన్సర్
పాంక్రియాస్ డక్ట్‌లో ఈ క్యాన్సర్ వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇది పాంక్రియాస్ గ్రంథిలో నీటి తిత్తుగా రావచ్చు. పాంక్రియాస్ క్యాన్సర్ ఉన్నవారిలో కడుపు నొప్పి, కామెర్లు, బరువు తగ్గడం, విరేచనం నల్లగా రావడం వంటివి ప్రధాన లక్షణాలుగా గుర్తించొచ్చు. అల్ట్రాసౌండ్ అబ్డామిన్ పరీక్ష, సీటీ స్కాన్ పరీక్షద్వారా క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించొచ్చు. సీఏ 19.9 రక్త పరీక్ష, ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్, ఈఆర్సీపీ, బయాప్సీ పరీక్షలు అవసరం పడొచ్చు. వ్యాధిని తొలిదశలోనే గుర్తిస్తే కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జరీలతో మంచి ఫలితాలు ఉంటాయి. మద్యం పూర్తిగా మానేస్తే ఫలితాలు మెరుగు పడతాయి. ఏదేమైనా చికిత్సకన్నా నివారణ ముఖ్యం.
డా॥ ఆర్.వి. రాఘవేంద్రరావు,
M.S, M.Ch,F.H.P.B, F.L.T.
కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటెరాలజిస్ట్ అండ్
లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జన్
డైరెక్టర్-రెనోవా NIGL హాస్పిటల్
న్యూ ఎమ్ ఎల్ ఎ కాలనీ, రోడ్ నెం.12,
బంజారాహిల్స్, హైదరాబాద్
ఫోన్ : 79930 89995