టెక్నాలజీ రంగంలో స్త్రీలు వెనుకబడి ఉన్నారు. ఆవిష్కరణలలో ఆ వెనుకబాటు ఇంకా ఎక్కువ. కానీ, బ్లాక్ చెయిన్ టెక్నాలజీలో మగవాళ్ల కంటే చాలా ముందున్నది తెలంగాణ ఆడబిడ్డ ఆశ్రయా రావు. ‘లాంచ్ హౌజ్యాక్సెలరేటర్ ప్రోగ్రామ్’కు ఎంపికైన ప్రపంచంలోనే అత్యుత్తమ స్టార్టప్‌లలో ఒకటిగా నిలిచింది ఆమె స్థాపించిన ‘యూజెనీ’.
ఆశ్రయ హైదరాబాద్‌లోని చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీబీఐటీ)లో మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు. క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చినా, ఆ లక్షణమైన ఆఫర్‌ను తిరస్కరించారు. ‘మా కాలేజ్‌లో స్ట్రీట్ కాజ్ అనే ఎన్జీవో ఉండేది. నేను దాని కోసం కొంతకాలం పనిచేశాను. అప్పట్లో అనేక సమస్యలకు నిరసనగా దేశంలో నిత్యం ఆందోళనలు జరిగేవి. అప్పుడే, వివిధ సామాజిక రుగ్మతలకు మూలాలను అన్వేషించాలనే ఆలోచన మొదలైంది. సేవా కార్యక్రమాల కోసం నిధులు సేకరించాం. నా జీవితంలో అదో మంచి అనుభవం’ అంటూ తొలి అడుగులను గుర్తుచేసుకుంటారు ఆశ్రయ.
చదువు.. సేవ
చదువు పూర్తయ్యాక ఉద్యోగం వచ్చినా చేరకుండా.. షాంఘై వెళ్లిపోయారు ఆశ్రయ. అక్కడ ఒక సోషల్ ఎంటర్ప్రైజ్లో చేరారు. తర్వాత కొంతకాలానికి ఇండియా తిరిగొచ్చారు. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ నిర్వహిస్తున్న ప్రాజెక్టులలో భాగస్వామి అయ్యారు. వివిధ పథకాలు ప్రజలకు ఎలా చేరువ అవుతున్నాయి? వాటిని ఉపయోగించుకోవడంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి? అన్న కోణంలో లోతైన అధ్యయనం చేశారు. రెండేండ్ల తర్వాత ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చారు. సేవా రంగంలో సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారం కోసం సాంకేతికతను అభివృద్ధి చేయాలని సంకల్పించారు. ఆ లక్ష్యంతో ‘సోషల్ నెట్వర్క్ ఫర్ సోషల్ ఇంపాక్ట్’ కోసం ప్రయోగం మొదలుపెట్టారు.
సేవా రంగంలోని వాళ్లందరినీ ఒకే వేదికపైకి తెచ్చి.. సామాజిక సమస్యలకు పరిష్కారాలు ఒక్క ‘క్లిక్ దూరంలో’ ఉంచాలన్న ఉద్దేశంతో ‘యూజెనీ’ అనే సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశారామె. ఇందులో వివిధ ఎన్జీవోల వివరాలు ఉంటాయి. ఆ వివరాల సాయంతో వలంటీర్లు నచ్చిన సంస్థలో, ఇష్టమైన రంగంలో పనిచేయవచ్చు. ఆన్లైన్ డిస్కషన్స్, క్యాంపెయిన్స్, అర్జీలు, ఫండ్ రైజింగ్, ర్యాలీలు, సభలు, సేవా కార్యక్రమాలు.. ఇలా సమస్త సమాచారమూ అందిస్తుంది యూజెనీ. హైదరాబాద్‌లోని ఎన్జీవోలతో మొదలుపెడితే విదేశాల్లో ఉన్న స్వచ్ఛంద సంస్థల వరకూ వేయికి పైగా వేదికల డేటాను యూజెనీలో పొందుపరిచారు. ‘త్వరలోనే అంతర్జాతీయ కార్యక్రమాలనూ ఇందులోకి తీసుకొస్తాం. నిజానికి, ఇప్పటివరకూ సామాజిక సేవారంగం ఆఫ్‌లైన్‌లోనే ఉంది. అదంతా పాత టెక్నాలజీ. దీన్ని సంస్కరించడం కోసం రెండు ఆవిష్కరణలు చేశాను’ అంటున్నారు ఆశ్రయా రావు.
ప్రతి పైసాకూ లెక్క
ఇల్యూమినేటెడ్ డవ్ (డవ్) పద్ధతిలో దాతల విరాళాలు ఏయే రూపాల్లో ఎక్కడికి చేరాయన్నది యూజెనీ ద్వారా కనిపెట్టవచ్చు. ఎప్పుడు, ఎంత మొత్తంలో ఖర్చు అయ్యిందీ తెలుసుకునే పారదర్శకత ఉంటుంది. దీనివల్ల ఎక్కువ మంది లబ్ధి పొందుతారు. ఫిన్‌టెక్ రంగంలో విరివిగా వాడుతున్న బ్లాక్ చెయిన్ టెక్నాలజీని అన్వయించుకోవడంతో ఈ వెసులుబాటు సాధ్యమైంది. దీనివల్ల ప్రతి రూపాయికీ లెక్క ఉంటుంది. ప్రతి పనీ నమోదు అవుతుంది. ఆ ఆవిష్కరణ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. వినూత్నమైన ఆలోచనతో పనిచేసే సంస్థలకు టెక్నాలజీ డెవలప్మెంట్, మార్కెటింగ్ ్ట, ఫండింగ్ కోసం నిర్వహించే ‘లాంచ్ హౌజ్ యాక్సెలరేటర్ ప్రోగ్రామ్’కు యూజెనీ ఎంపికైంది. ఇందుకు ప్రపంచవ్యాప్తంగా 20 స్టార్టప్‌లను మాత్రమే ఎంపిక చేశారు. వాటిలో ఇదీ ఒకటి. కొన్ని రోజుల్లోనే తన సాంకేతికత అందరికీ అందుబాటులోకి వస్తుందని ఆశ్రయ చెబుతున్నారు.
కుటుంబ ప్రోత్సాహం
మా ఇంట్లో మంచి వాతావరణం ఉంటుంది. నాన్న సైనికోద్యోగి. అమ్మ పెట్రోల్ బంకులు నడుపుతున్నారు. సొంతూరు సికింద్రాబాద్. నాన్న ఉద్యోగ రీత్యా చాలా ప్రాంతాల్లో ఉన్నాం. చిన్నప్పటి నుంచీ ప్రపంచ పరిణామాల్ని టీవీల్లో చూశాం. సమాజంలో ఇన్ని సమస్యలు ఉన్నాయా? అనిపించేది. ముఖ్యంగా సామాజిక సేవా రంగంలో ఉద్యోగం ఎంచుకునే వాళ్లకు అవకాశాల గురించి తెలియదు. నిపుణులైన సిబ్బంది గురించేమో ఎన్జీవోలకు తెలియదు. అందుకే ఈ రంగంలో మానవ వనరుల సమస్యలకు పరిష్కారం వెతికే పని ప్రారంభించాను. నా ఆలోచన ఇంత తొందరగా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుందని ఊహించలేదు. చాలా సంతోషంగా ఉంది (www.yugenie.com).
ఉద్యోగ జీవితాల్లో సమాజ సేవకు సమయం కేటాయించేంత వెసులుబాటు ఉండకపోవచ్చు. కానీ, ఏదైనా సమస్యకు పరిష్కారం చెప్పగలిగే తెలివితేటలు చాలామందికి ఉంటాయి. వాటిని నలుగురి కోసం పంచుకోమని యూజెనీ అడుగుతున్నది. ఈ నెట్ వర్క్‌లో ఉన్నవారితో సమస్యలు గురించి చర్చిస్తూ, కొత్త పరిష్కార మార్గాలు సూచించవచ్చు కూడా. ఎవరెన్ని చెప్పినా ఆర్థిక వనరులు లేనిదే ఏ ఆలోచన కూడా కార్యరూపం దాల్చలేదు. సహృదయులైన దాతలు స్వచ్ఛంద సేవకులను ఈ వేదిక ద్వారా కలుసుకోవచ్చు. పర్యావరణం, ఆరోగ్యం, పేదరికం, అక్షరాస్యత, వలసలు.. ఇలా ఏ సమస్య గురించి అయినా స్పందించవచ్చు. ఏ రూపంలోఅయినా సేవలో పాలుపంచుకోవచ్చు.
– ఆశ్రయా రావు
– నాగవర్ధన్ రాయల