మోడల్‌గా కెరీర్ మొదలు పెట్టి చెల్లెలి క్యారెక్టర్లకు కేరాఫ్‌గా నిలిచిన నటి శిరీష చతుర్వేదుల. ‘మనసంతా నువ్వే’ సినిమాలో ఉదయ్ కిరణ్ చెల్లెలిగా టాలీవుడ్‌కు పరిచయమైన ఆమె దాదాపు అందరు హీరోలకు చెల్లెలుగా నటించింది. పెండ్లి తర్వాత నటనకు దూరమైన శిరీష మళ్లీ పదేండ్ల తర్వాత బుల్లితెరపై రీ ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో సినిమాలు, సీరియల్స్‌లో నటిస్తూ, యాంకరింగ్, డబ్బింగ్ చేస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. ప్రస్తుతం జీ తెలుగు ‘సీతే రాముడి కట్నం’ సీరియల్లో లలిత పాత్రలో అలరిస్తున్న శిరీష జిందగీతో పంచుకున్న ముచ్చట్లు..
మా నాన్న కేంద్రప్రభుత్వ ఉద్యోగి. అమ్మ గృహిణి. నేను పుట్టింది, పెరిగింది హైదరాబాద్‌లోనే. ఇంటర్ చదువుతున్నప్పుడు కాలేజ్ కాంపిటీషన్స్ హోస్ట్ చేశాను. ఒక ప్రముఖ పత్రికలో ఆ ఫొటోలు పబ్లిష్ అయ్యాయి. ఆ పత్రికలో వచ్చే ఫ్యాషన్ పేజీకి మోడల్‌గా చేయమని వాళ్లు అడిగారు. అలా డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మోడల్‌గా మొదటి అవకాశం వచ్చింది. చదువు దెబ్బతింటుందని అమ్మానాన్న మొదలు ఒప్పుకోలేదు. కానీ, వాళ్లు పట్టు వదల్లేదు. సెలవుల్లో మాత్రమే షూట్ చేస్తామని నచ్చజెప్పారు. చీరలు, గాగ్రాలు, చుడీదార్లు మాత్రమే వేసుకుంటాననే కండీషన్ మీద ఒప్పుకొన్నా! ఫైనల్‌గా డిగ్రీ చదువుతూనే మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టాను.
పేపర్లో నా ఫొటో చూసి దర్శకుడు వీఎన్ ఆదిత్యగారు ‘మనసంతా నువ్వే’ సినిమాలో హీరో పాత్రకు చెల్లెలి క్యారెక్టర్‌కు ఆడిషన్స్‌కు రమ్మని పిలిచారు. సినిమా అనగానే అమ్మావాళ్లు అస్సలు ఒప్పుకోలేదు. ‘మోడలింగే వద్దంటుంటే సినిమాల్లోకి కూడా వెళ్తావా?’ అని కోప్పడ్డారు. చివరికి ‘సినిమాలో నటించినా బాగా చదువుకుంటాను, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో ఫ్రీ సీటు తెచ్చుకుంటాను’ అని ప్రామిస్ చేయడంతో ఆదిత్యగారిని కలవడానికి అనుమతిచ్చారు. స్క్రీన్ టెస్ట్ ఓకే అయితే చూడొచ్చులే అనుకున్నారు. ఆదిత్యగారి ఆఫీస్‌కు వెళ్లిన మేము అక్కడ ఉదయ్‌కిరణ్‌ను చూడగానే షాకయ్యాం.
అప్పటికే ఆయన నటించిన ‘చిత్రం’ సినిమా పెద్ద హిట్ అయ్యింది. నేను ఆయనకు పెద్ద అభిమానిని. అంత పాపులర్ హీరోకి చెల్లెలి క్యారెక్టర్ అనగానే ఎలాగైనా చెయ్యాలి అని ఫిక్సయ్యా. ఆడిషన్స్‌లో ఒక డైలాగ్ పేపర్ ఇచ్చి ప్రిపేర్ అయ్యి యాక్ట్ చేయమన్నారు. యాక్టింగ్ గురించి అసలేమీ తెలియకపోవడంతో ఆ కెమెరా, అక్కడ జనాలందరినీ చూసి డైలాగ్స్ మర్చిపోయా, భయంతో వణికిపోయా. చాలా టేక్స్ తీసుకున్నా. ఇక నావల్ల కాదనిపించి చేయలేనని చెప్పా. కానీ మా నాన్న మాత్రం ఇంకోసారి ట్రై చెయ్ అని ఎంకరేజ్ చేశారు.
మేం లంచ్ చేస్తుండగా ఉదయ్ కిరణ్ వచ్చి ‘నీ ప్రాబ్లమ్ ఏంటి? ఈ సీన్ పేపర్, డైలాగ్స్ అన్నీ మర్చిపో.. నేనే నీ అన్నయ్య అనుకుని.. అతను ఈ పరిస్థితుల్లో ఉంటే నువ్వు ఏం అంటావో అదే చెప్పు’ అని ధైర్యమిచ్చారు. దాంతో సరేనని యాక్షన్ అనగానే నా నోటికొచ్చింది చెప్పా. ఆదిత్యగారు బాగా చేశానని మెచ్చుకుని ఆ క్యారెక్టర్‌కు నన్ను ఎంపిక చేశారు. కానీ, అమ్మానాన్నల్ని ఒప్పించడం చాలా కష్టం అయ్యింది. సెలవుల్లోనే షూటింగ్ ఉంటుందనీ, మా పేరెంట్స్ కూడా షూటింగ్‌కు రావొచ్చని చెప్పడంతో వాళ్లు
ఒప్పుకొన్నారు.
నేను సినిమాల్లో నటిస్తున్నాని తెలియగానే బంధువులు, తెలిసినవాళ్లు చాలామంది రకరకాలుగా మాట్లాడారు. కానీ, నేను మాత్రం చదువుకు, ప్రొఫెషన్‌కు ఒకే ప్రాధాన్యం ఇచ్చాను. టైమ్ ఉన్నప్పుడు, హాలీడేస్‌లో షూటింగ్స్‌కు వెళ్లేదాన్ని. ఇంట్లో ఇచ్చిన మాటప్రకారం ఎమ్మెస్సీలో ఫ్రీ సీటు సాధించాను. ‘మనసంతా నువ్వే’ సక్సెస్ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. స్టూడెంట్ నెం.1, వెంకీ, అతడే ఒక సైన్యం, సుబ్బు, బాలు, చిరుజల్లు, బలాదూర్, ఆంధ్రావాలా, సత్యం, వెంకీ.. దాదాపు 30 సినిమాల్లో నటించా.
చిరంజీవి, బాలకృష్ణ, రవితేజ, జూ.ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ దాదాపు అందరు హీరోలకు చెల్లెలుగా చేశా. సినిమాలతోపాటు యాంకరింగ్, సీరియల్స్ చేశాను. నా మొదటి సీరియల్ నాగాస్త్రం. అది చాలా పెద్ద హిట్. అలౌఖిక, పద్మవ్యూహం, ఎండమావులు, నాతిచరామి.. ఇలా హిట్ సీరియల్స్‌లో నటించాను. అలా కుదిరింది. నా జీవితంలో ఇండస్ట్రీకి రావడం ఎలా అనుకోకుండా జరిగిందో నా పెళ్లి కూడా అలాగే జరిగింది. ‘హోం మినిస్టర్’ షో కోసం ఒకరింటికి వెళ్లాను.
అక్కడ ఒకావిడ నన్ను చూసి ‘మంచి సంబంధం ఉంది పెళ్లి చేసుకుంటావా?’ అని అడిగారు. నేను నో చెప్పాను. కానీ, ఆవిడ వెంటపడి నా నెంబర్ తీసుకుని మా పేరెంట్స్‌తో మాట్లాడారు. పెళ్లిచూపుల్లో మా ఆయనని చూసిన తర్వాత నో చెప్పలేకపోయా. చూడగానే నచ్చేశారు. గంట మాట్లాడుకున్నాం. ఆయన ఆలోచనా విధానం బాగా నచ్చింది. వాళ్లు వెంటనే ఓకే చెప్పారు. నాకే మూడు రోజులు పట్టింది. మా ఆయన ఎంబీఏ చేశారు, ప్రస్తుతం డెల్ టెక్నాలజీస్‌లో లీడ్‌గా చేస్తున్నారు.
పెళ్లి తర్వాత నటించొద్దని అనుకున్నా. టీచింగ్ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. చదువుకునే రోజుల్లోనే ట్యూషన్స్ చెప్పేదాన్ని. బి.ఎడ్ కూడా చేసి ఉండటంతో పెళ్లి తర్వాత టీచర్‌గా పని చేయాలనుకున్నా. ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో జాయినయ్యా. తర్వాత బెంగళూరుకు షిఫ్ట్ అయ్యాం. మాకు ఇద్దరు పిల్లలు. చిన్నబాబు స్కూల్‌కు వచ్చాక కేంద్రీయ విద్యాలయంలో హైస్కూల్ ఇంగ్లిష్, మ్యాథ్స్ టీచర్‌గా చేస్తున్న సమయంలో మా గురువు ఆర్కే మలినేనిగారు ఫోన్ చేశారు. ఆయన దగ్గర నేను తొలినాళ్లలో ‘సత్య’ అనే సీరియల్ చేశాను. మలినేనిగారు, రసూల్ గారు చాలా విషయాలు నేర్పించారు. దాదాపు పదేండ్ల తర్వాత ఆయన నుంచి కాల్ రావడంతో మొదట నమ్మలేదు.
తను చేసే తర్వాతి ప్రాజెక్టులో హీరోయిన్ తల్లి పాత్ర ఉందని, అది నన్ను దృష్టిలో పెట్టుకుని రాశానని చెప్పి ఒప్పించారు. అలా నేను మళ్లీ తెరమీద కనిపించిన సీరియల్ ‘మౌనరాగం’. అది పెద్దహిట్ కావడంతో వరుస అవకాశాలు వచ్చాయి. కానీ, నాకు కుటుంబమే మొదటి ప్రాధాన్యం. ఇంట్లోవాళ్లకు సమయం ఇవ్వడం కోసం బాగా నచ్చిన సీరియల్స్, సినిమాలు మాత్రమే ఒప్పుకొంటున్నా. ‘సీతే రాముడి కట్నం’ సీరియల్లో నా పాత్ర చాలా నచ్చింది. అందుకే స్టోరీ చెప్పగానే ఓకే చేశా. మా ఆయన సపోర్ట్‌తోనే నేను వర్క్ చేయగలుగుతున్నా. నా కెరీర్ ఇంత సక్సెస్‌ఫుల్‌గా సాగడానికి కారణం మా అమ్మానాన్న, నా భర్త. వాళ్లకి ఎప్పుడూ రుణపడి ఉంటా!