అందాన్ని ఇనుమడింపజేసే ఆభరణాల ఎంపికలో ఆచితూచి అడుగువేస్తారు అతివలు. నలుగురిలో ప్రత్యేకంగా ఆకర్షించే నగలకే వారు ప్రాధాన్యం ఇస్తారు. బంగారు ఆభరణాలే కాకుండా.. ట్రెండ్‌కు తగ్గట్టు ఫ్యాబ్రిక్, సిల్క్, థ్రెడ్ జువెలరీకీ ఓటేస్తున్నారు. ఆ కోవకే చెందుతాయి లక్క నగలు కూడా. బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్న ఈ తరుణంలో తక్కువ ధరలో లభిస్తూ, పుత్తడిని మరిపిస్తున్న లక్క ఆభరణాల విశేషాలు ఇవి..
బంగారు ఆభరణాల ఖాళీల్లో నింపేందుకు లక్కను వాడుతారు. దీనివల్ల ఆభరణాలు నొక్కుకుపోయినప్పుడు.. డిజైన్లు చెదిరిపోకుండా, ఆకారం మారిపోకుండా ఉంటుంది. అయితే లక్కతోనూ ఆభరణాలు తయారు చేస్తుంటారు. ఇది ఇప్పటి ట్రెండ్ కాదండోయ్. శతాబ్దాల కిందటి నుంచీ ఉన్నదే! రాజస్థాన్‌లోని జైపూర్, ఉదయ్‌పూర్ తదితర నగరాల్లో లక్క నగలకు మంచి ఆదరణ కనిపిస్తుంది. రాజస్థానీ అతివలు తమ అలంకరణలో వీటికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు.
పెండ్లి సందర్భంగా వధువు లక్క గాజులు ధరించడం అక్కడ సంప్రదాయం. రాజస్థాన్‌తోపాటు గుజరాత్, మహారాష్ట్రలోనూ లక్క ఆభరణాలకు ఆదరణ ఉంది. గుజరాత్ పడుచులు దాండియా ఆటలు ఆడేటప్పుడు లక్క నగలను ప్రత్యేకంగా అలంకరించుకుంటారు. తక్కువ బంగారంతోనూ ఈ లక్క నగలు చేస్తారు. వీటిలో రంగు రాళ్లు, రత్నాలు, ముత్యాలు పొదిగి మరింత అందంగా మలుస్తున్నారు. మిగతావాటితో పోలిస్తే ఇవి చాలా తేలికగా ఉంటాయి. పైగా అన్ని రకాల దుస్తులపైనా ధరించడానికి అనుకూలంగా ఉంటాయి.
చెట్ల నుంచి సేకరించిన లక్కను వివిధ రంగుల్లో కలిపి ఈ నగలను తయారుచేస్తారు. ముందుగా లక్క రెసిన్‌ను వివిధ రంగుల్లో కలిపి చెక్క, లోహపు ఫ్రేమ్‌లో పోసి అందమైన ఆభరణాల ఆకారాల్లోకి మారుస్తారు. లక్క వేడిగా ఉన్నప్పుడే వాటిపై రాళ్లు, అద్దాలను అతికించి వాటికి చూడచక్కని రూపం తీసుకొస్తారు. లక్కతో అచ్చుపోసిన పెండెంట్లు, ఉంగరాలు, చెవి కమ్మలు, హారాలు, గాజులు అందుబాటులో ఉన్నాయి. ఆకులు, లతలు, పూలతో కూడిన డిజైన్లు కూడా అబ్బురపరుస్తున్నాయి. నగలపై ఇష్టమైన వ్యక్తుల పేర్లు, అక్షరాలనూ పొందుపరిచే వీలుంటుంది. ఎందుకు ఆలస్యం… ఈ లక్క నగలపై మీరూ ఓ లుక్కేయండి!