ముదురు గోధుమ రంగులో కనిపించే సీకాయలను ఎండబెట్టి చూర్ణం చేసి, జుట్టుకు పట్టిస్తే.. ఎన్నో ఉపయోగాలని చెబుతారు ఆయుర్వేద నిపుణులు. సీకాయలోని శక్తిమంతమైన ఔషధ గుణాలు చుండ్రును నివారిస్తాయి. కేశాల కుదుళ్లను తేమగా ఉంచి పొడిచర్మపు సమస్య నుంచి కాపాడతాయి. బలమైన, ఒత్తయిన జుట్టు కోసం.. తాజా పెరుగులో సీకాయ పొడిని వేసి పేస్టులా కలపాలి. తర్వాత జుట్టు కుదుళ్ల నుంచి చివరి వరకూ రుద్దుకుని, అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే కేశాలు దృఢంగా తయారవుతాయి. జుట్టు చివర్లు చీలిపోవడం, రాలడం కూడా తగ్గిపోతుంది.
సీకాయలో వేపాకు, పసుపు కలిపి పేస్టుగా చేసుకుని ఆ మిశ్రమాన్ని నొప్పి, దురద ఉన్నచోట రాస్తే మెరుగైన ఫలితం ఉంటుందని చెబుతారు. సీకాయ, ఉసిరికాయ పొడి మిశ్రమాన్ని వారానికి మూడుసార్లు రాయడం వల్ల జుట్టు తెల్లబడటం ఆగిపోతుంది. సీకాయ, ఉసిరికాయ, పెరుగు కలిపి జుట్టుకి ప్యాక్‌లా వేసుకుంటే.. చాలా చల్లటి అనుభూతి కలుగుతుంది. రిలాక్సేషన్ లభిస్తుంది.