డైరెక్టర్: రెడీ.. కెమెరా.. యాక్షన్!!
హీరో: (పొట్టలో దిగిన కత్తిని పట్టుకుని) అమ్మా.. నీకిచ్చిన మాట నిలబెట్టుకున్నా. నీ ఒడిలో హాయిగా కన్ను మూస్తున్నా. ఈ జన్మకిది చాలు.
తల్లి: బాబూ!!! నా ఆయువు కూడా పోసుకుని నువ్వు నూరేండ్లూ బతకాలి.
హీరో: నాకంత టైమ్ లేదమ్మా.. లేదు.. లేదు..!! తల పక్కకు వాల్చేశాడు! (కట్ చేస్తే..) చుట్టూ హీరో ఫ్యామిలీ.. హీరో కండ్లు ఇంకా తెరిచే ఉన్నాయి.. తల్లినే చూస్తూ..!!
థియేటర్ మొత్తం నిశ్శబ్దం.. సీన్ ఫ్రీజ్ అయ్యింది.. తెరపై జూమ్ అవుట్ అవుతూ.. శుభం.. The End! కార్డు!! థియేటర్ లైట్స్ ఆన్ అయ్యాయ్. కండ్లు తుడుచుకుంటూ కొందరు.. హీరో చనిపోకుండా ఉంటే బాగుండు.. అని ఇంకొందరు.. ఇంటి ముఖం పట్టారు!!
అవును.. అయితే.. ఇప్పుడేం చేయమంటారు? మాకంత ఓపిక లేదంటారా? యస్.. నేటి తరం డైరెక్టర్లకు కూడా ఓపిక లేకుండాపోయింది. అందుకే.. 70 ఎంఎం స్క్రీన్ నుంచి ‘శుభం’ కార్డు గల్లంతయ్యింది. పార్టు పార్టులుగా సినిమా పలకరిస్తున్నది. అందుకేనేమో.. తరాల అంతరాల నడుమ తెరమరుగైన ‘శుభం’ కార్డును తలుచుకోవాల్సి వస్తున్నది.
ఓ రెండు తరాలు వెనక్కి వెళ్తే.. తెలుస్తుంది..క్లైమాక్స్ అనగానే ఈల వేసుకుంటూ పోలీసులు వచ్చేసేవారు. ‘రండి ఇన్స్పెక్టర్ గారూ ఈ దుర్మార్గులను జైల్లో వేయండి’ అని మనసు మార్చుకున్న సూర్యకాంతం అంటే ‘మిస్టర్ యువార్ అండర్ అరెస్ట్’ అని ఇన్స్పెక్టర్ అనడమూ, పండ్లు పటపట కొరుకుతూ రాజనాల జైలుకు వెళ్లిపోవడమూ జరిగిపోయేవి. లేదంటే చేసిన తప్పులకు చింతిస్తూ ‘నాలాంటి వాడికి ఈ సభ్య సమాజంలో ఉండే హక్కు లేదు’ అంటూ నాగభూషణం నట విన్యాసం ప్రదర్శిస్తూ బేడీలు వేయించుకునేవాడు. మరోవైపు.. ఎన్టీ రామారావు ‘పెద్దయ్యా, ఎంత చెడ్డా బావ మనవాడు. అందరూ మనవారు అన్నది మరచిపోయాడు. అనవసరంగా జైలుపాలు చేస్తే మనమే బాధపడాలి కదా’ అని ఎస్వీఆర్‌ని కన్విన్స్ చేస్తే.. రేలంగి ‘నన్ను క్షమించు బావా’ అనేవాడు, జామీను మీద విడిపించుకునేవారు.
ఇలా ఏది ఏమైనా చివరికి అందరూ కలిసి ఓ ఫ్యామిలీ ఫ్రేమ్‌లోకి వచ్చేవారు. ప్రేక్షకుల కడుపు నిండిపోయేది. రెండున్నర నుంచి మూడు గంటలపాటు సినిమా జీవితచక్రంలో నలిగిన ప్రేక్షకుడికి అదో సంతృప్తి. అందుకే అప్పట్లో డైరెక్టర్లు ఒక్కో తీరుగా శుభం కార్డు వేసేవారు. అంటే.. ఇప్పుడు బిగినింగ్‌లో.. ఓ రాజముద్ర వేస్తున్నారుగా.. ‘ఇట్స్ ఏ రాజమౌళి ఫిల్మ్’.. అని! అలాగన్నమాట. ఇప్పటి డైరెక్టర్లు.. కథ ముగింపు కన్నా ఎక్కువగా హీరో ఇంట్రొడక్షన్లే పద్ధతిగా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే.. చెప్పక్కర్లేదు. మరి,క్లైమాక్స్ సంగతేంటి?.. ‘శుభం’ కార్డు పడే వరకూ ఆడియన్స్ కూర్చుంటున్నారా? లేచి నడుచుకుంటూ వెళ్లి డోర్ దగ్గర ఆగుతున్నారా? పార్టు 2 ఎలాగూ ఉందిగా.. దాంట్లో చూద్దాంలే అనుకుంటూ జేబులోకి చేతులు పోనిచ్చి.. అందులో ఉన్న ఫోన్ పైకి తీసి.. చాట్ చేస్తూ ఎటో వెళ్లిపోతున్నారా? ‘శుభం’ కార్డు చూసే ఓపిక లేక కాదు! సినిమాకు ‘ది ఎండ్’ ఉంటేగా!
‘మీ సినిమాల సక్సెస్ వెనక రహస్యం ఏంటి’ అని ఎవరైనా హీరో లేదా డైరెక్టర్ని అడిగితే.. ఎక్కువ శాతం ‘మంచి కథ’ అని చెబుతారు. ఓ కథ బాగుంది అన్నామంటే.. కచ్చితంగా దానికి మంచి ముగింపు ఉన్నట్టే. సినిమాల విషయానికి వస్తే డైరెక్టరే కెప్టెన్. సో.. ఆ క్రెడిట్ మొత్తం దర్శకుడికే దక్కుతుంది. అందుకే చాలా మంది డైరెక్టర్లు వారిదైన పద్ధతిలో కథకు చివర్లో శుభం కార్డులు వేసేవాళ్లు. అదీ చూశాకే- హమ్మయ్యా!! అంటూ కథ తాలూకూ ఎమోషన్స్‌ని కళ్లలో నింపుకొని వెళ్లేవారు ప్రేక్షకులు. పోను.. పోనూ.. చేతిలోకి స్మార్ట్‌ఫోన్.. దానికో కెమెరా కన్ను వచ్చేసరికి కథ కంచికిపోయి.. టెక్నాలజీ ముందుకొచ్చింది. కథలో తీరుతెన్నుల్ని.. మార్చేస్తూ.. బ్లాక్ అండ్ వైట్ నుంచి రంగుల్లోకి వచ్చేశాం. ఈ క్రమంలోనే.. సింపుల్ ‘శుభం’ కార్డు.. కాస్త క్రియేటివ్‌గా మారింది. త్యాగాలు.. పోలీసుల్ని దాటుకుని పెళ్లి మంటపాలు, గుడి ఆవరణల్లోకి మారింది. హీరో.. హీరోయిన్ మెడలో తాళికట్టగానే.. ఫ్యామిలీ మొత్తం వాట్సాప్‌లో మనం వాడే ఎమోజీల మాదిరిగా ఫన్ ఎక్స్ప్రెషన్స్ పెట్టేవాళ్లు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు లాంటివాళ్లు.. సీన్‌ని ఫ్రీజ్ చేసి.. శుభం అని వేస్తే.. పెళ్లిసందళ్లని ప్రేక్షకులు ఇంటిదాకా తీసుకెళ్లేవారు.
యస్.. కాలంతోపాటు డైరెక్టర్స్ రూటు మారుతూ వచ్చింది. కథలతో కల్చర్, కట్టుబాట్లు చెప్పాలని కొందరు.. కథంటే హాయిగా నవ్వుకోవడమే అని ఇంకొందరు.. కథంటే నవరసాలు కలగలిపిన నాటకం అని మరికొందరు.. ఈ క్రమంలోనే వారి కథల తాలూకు భావాల్ని శుభం కార్డుపై రీప్లేస్ చేశారు. కళాతపస్వి కె.విశ్వనాథ్ సినిమాల్ని తీసుకుంటే.. చివర్లో No End for Art!! అని కథలో ఫ్రేమ్‌ని ఫ్రీజ్ చేసేవారు. ‘నవ్వడం ఒక భోగం.. నవ్వించకపోవడం ఒక రోగం..’ అని ఎవరైనా అంటే.. కచ్చితంగా వాళ్లు జంధ్యాల ఫ్యాన్సే. హాస్యరసంతోనూ చక్కని కథల్ని వండి వార్చిన ఆయన.. చివర్లో ‘నవ్వండి.. నవ్వించండి.. నవ్వు ఆరోగ్యకరం’ అని శుభం కార్డుపై నవ్వుల పువ్వుల్ని పూయించారు. మరోవైపు.. ఈవీవీ.. ‘టాటా’ అంటూ.. కొన్నిసార్లు.. పళ్లూ, ఫలాలలో ఊరించే గడ్డం గురువు రాఘవేంద్రరావు ‘సర్వేజనాః సుఖినో భవంతు’ అంటూ ప్రేక్షకుల్ని శుభం కార్డుతో దీవించి పంపేవారు. యాక్షన్ కింగ్ అర్జున్ లాంటోళ్లు.. ‘జైహింద్’ అంటూ దేశభక్తిని చాటే ప్రయత్నం చేశారు.
సినిమా గురించి టాక్ మొదలైందంటే చాలు.. ఇప్పుడంతా బ్రాండ్లు, బడ్జెట్ల గురించే డిస్కషన్. అందుకేనేమో.. డైరెక్టర్లు, హీరోలు.. వారి తాలూకు ఇమేజ్‌లను దృష్టిలో పెట్టుకుని అన్నీ ప్లాన్ చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ దగ్గర్నుంచి అంతా సెన్సేషనే. ప్రీరిలీజ్ ఈవెంట్లు, ప్రమోషన్స్‌తో కథను ముందే చెప్పేస్తున్నారు. రిలీజ్ అవ్వగానే రివ్యూలతో కథని అంగట్లో ఉంచుతున్నారు. ఇలా అన్ని అశుభాలు దాటుకుని.. హిట్‌టాక్ తెచ్చుకుని.. రికార్డులు సృష్టించే బిజీలో పడి.. శుభం కార్డును చూపించే ఆలోచన డైరెక్టర్లు ఎప్పుడో డిలీట్ చేసుకున్నట్టున్నారు. ఇక కొందరైతే కథను ఎలా ముగించాలో తెలియకనో.. ముగిస్తే ఇంకో కథ దొరకదనే బెంగతోనో.. ‘పార్ట్ 2’ ఉందంటూ.. ప్యాక్ అప్ చెబుతున్నారు. హుం.. ఇంకేం చేద్దాం.. మంచి కథ ఏదైనా వస్తే.. చివరి వరకూ కూర్చుని.. శుభం కార్డు పడుతుందేమో చూద్దాం. డైరెక్టర్లూ.. కథకు మంచి శుభం కార్డు వేస్తే.. ఆ కిక్కే వేరబ్బా!!