ఆమె ఓ పరిశోధకురాలు. హరియాణాలోని ఫరీదాబాద్‌లో ఉంటారు. అందరూ నిద్రపోతున్న వేళ వీధి కుక్కలను ప్రేమగా దగ్గరికి తీసుకుంటారు. కడుపునిండా భోజనం పెట్టి పంపుతారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శ్రేయసి దాస్‌కు మూగజీవాల పట్ల మమకారం ఎక్కువ. @belly_bubs పేజీతో ఇన్‌స్టా గ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటారు శ్రేయ. సామాజిక మాధ్యమాల ద్వారా శునకాల సంరక్షణపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రస్తుతం, ఓ ముప్పై వీధి కుక్కలను సంరక్షిస్తున్నారు. ఆహారం, శుభ్రత, ఆరోగ్యం.. అన్ని బాధ్యతలూ తనే చూసుకుంటారు. కానీ, ఆమె ఉంటున్న గేటెడ్ కమ్యూనిటీ జనానికి ఇదంతా నచ్చలేదు. ‘ఏమిటీ న్యూసెన్స్. కాలనీలో చెత్త పోగవుతున్నది. వెంటనే ఆపేయండి’ అంటూ గొడవకు దిగారు. దీంతో తన సేవా కార్యక్రమాలను మధ్యరాత్రికి మార్చుకున్నారు శ్రేయ. ‘నిజమే నాకు నిద్ర సరిపోవడం లేదు. కానీ ఆ మూగ జీవాలను ఆకలితో మాడ్చలేం కదా’ అంటారామె.