జీవితంలో ఏదైనా సాధించాలంటే కష్టనష్టాలను తట్టుకోవాలి, ధైర్యంగా అడుగు ముందుకేయాలి. ఆ ధైర్యంతోనే జీ తెలుగు ‘వైదేహి పరిణయం’ సీరియల్ హీరోయిన్ యుక్తా మల్నాడ్ ఎయిర్హోస్టెస్ఉద్యోగానికి రాజీనామా చేసి.. వెండితెరమీద బంగారు భవిష్యత్తును వెతుక్కుంటున్నది. బలంగా నమ్మితే, దేవుడే మనల్ని వెన్నంటి నడిపిస్తాడంటున్న యుక్తతో ‘జిందగీ’ ముచ్చట్లు..
నటనపై ఆసక్తి ఎలా కలిగింది?
ఊహ తెలిసినప్పటినుంచీ సినిమాలు, సీరియళ్లు చూసేదాన్ని. అలా నటీనటుల మీద అభిమానం మొదలైంది. నటించాలన్న కోరిక ప్రారంభమైంది. సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలన్న ఆరాటం ప్రశాంతంగా ఉండనివ్వలేదు. ఆ తపనే ఎన్ని అవాంతరాలు ఎదురైనా, నటిగా మారేందుకు కారణమైంది.
ఇండస్ట్రీకి ఎలా వచ్చారు?
నాకు డ్యాన్స్ అంటే ఇష్టం. డిగ్రీ రోజుల్లో ఓ పోటీలో పాల్గొన్నా. ముఖ్య అతిథిగా వచ్చిన ఓ కన్నడ డైరెక్టర్ నన్ను చూసి, తన సినిమాలో అవకాశం ఇచ్చారు. అప్పుడు భయమేసింది. చదువు పూర్తయ్యాక ఆలోచిద్దామని వదిలేశా. నా స్నేహితురాలు కొరియోగ్రాఫర్‌గా దాదాపు ఏడు భాషల్లో పనిచేసింది. ఆమె సాయంతో ఇంకో అవకాశం వచ్చింది.
నటిస్తానంటే ఇంట్లో ఒప్పుకొన్నారా?
మొదట్లో కాదన్నారు. చదువు పూర్తయ్యాక ఆలోచిద్దామన్నారు. ఆ మాటకు కట్టుబడే డిగ్రీ చదివాను. నాకు ఎయిర్ హోస్టెస్ ఉద్యోగమన్నా ఇష్టమే. అందుకే డిగ్రీ కాగానే, ఎయిర్ హోస్టెస్ జాబ్‌కు అప్లయ్ చేశా. ట్రైనింగ్ కూడా పూర్తయింది. బెంగళూరులో ఇస్తారనుకుంటే కలకత్తా బేస్ ఇచ్చారు. బెంగళూరు అయితే సినిమాల్లోనూ ప్రయత్నించ
వచ్చని నా ఆలోచన. రెండు నెలలు ఉద్యోగం చేశాక, ఏదో ఒకటి పరిశ్రమలోనే తేల్చుకుందామని రాజీనామా ఇచ్చేశాను. మళ్లీ సినిమా ప్రయత్నాలు ప్రారంభించాను.
ఎన్ని సినిమాల్లో చేశారు?
డిగ్రీలో ఉండగా ఒక సినిమా చేశాను. విడుదల కాలేదు. ఉద్యోగం వదిలి వచ్చాక ఇండస్ట్రీలోనే ఉండాలనే ఉద్దేశంతో అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా నాలుగు సినిమాలు చేశాను. తెలుగువారైన డైరెక్టర్ రవికిరణ్‌గారు, తన కొడుకును కన్నడలో హీరోగా పరిచయం చేస్తున్నారు. ఆ సినిమాలో హీరోయిన్గా నన్ను తీసుకున్నారు. సినిమా షూటింగ్ పూర్తయినా, కరోనా కారణంగా విడుదల ఆగిపోయింది. ఆ చిత్రం విడుదలైతే, మరిన్ని అవకాశాలు వస్తాయన్న నమ్మకం ఉంది.
తెలుగులోకి ఎలా వచ్చారు?
కన్నడలో సినిమా చేస్తున్నప్పుడు, తమిళం నుంచి ఒక ప్రాజెక్ట్ వచ్చింది. నాకేమో కన్నడ, ఇంగ్లిష్ తప్ప వేరే భాష తెలీదు. కానీ నన్ను నేను నిరూపించుకోవడానికి దీన్నో అవకాశంగా భావించాను. దేన్నయినా చాలెంజ్‌గా తీసుకోవడం నాకు అలవాటు.
కష్టమైనా, వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని ఒప్పుకొన్నా. మొదట్లో కాస్త ఇబ్బందిగా అనిపించినా, తర్వాత తమిళం నేర్చుకున్నా. ఆ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత జీ తెలుగు ‘వైదేహి పరిణయం’లో అవకాశం వచ్చింది. తమిళం కంటే తెలుగే సులభంగా అనిపించింది. వెంటనే సరేనన్నా.
ఇష్టమైన ప్రదేశం..
మాది చిక్ మగళూరు. మా ఊరంటే ప్రత్యేక అభిమానం. ప్రకృతితో మమేకమై బతకడానికి ఇష్టపడతాను. పచ్చని పరిసరాల్లో జంతువులు, పక్షులతో కళకళలాడే మా ఊరి వాతావరణమంటే మరీ ఇష్టం.
అభిమాన నటీనటులు?
చాలామంది ఉన్నారు. ముఖ్యంగా సౌందర్య, అనుష్క అంటే ఇష్టం. ఆ ఇద్దరూ కెరీర్‌ను మలుచుకొన్న తీరు నాలాంటివారికి ఆదర్శం. నటుల్లో ప్రభాస్, దర్శన్, నాని, ఇమ్రాన్ హష్మీ అంటే ఇష్టం. ప్రతి నటుడి నుంచీ నేర్చుకోవాల్సిన అంశం ఏదో ఒకటి ఉంటుంది.
మీ ఇష్టాలు, అభిరుచులు?
ప్రకృతి అంటే ప్రాణం. జంతువులంటే ఇష్టం. కవిత్వం రాస్తుంటాను. డ్యాన్స్ అన్నా ఇష్టమే. మంచి సినిమాలు చేయాలని ఉంది. విభిన్న పాత్రల్లో నటించి మంచి పేరు తెచ్చుకోవాలని ఉంది. చివరివరకూ ఏదో ఒక పనిచేస్తూ పరిశ్రమలోనే ఉండాలని కోరిక.
పరిశ్రమలో ఇబ్బందులేమైనా…
పరిశ్రమ గురించి చాలామంది చాలా రకాలుగా చెబుతారు. దేవుడి దయవల్ల నాకెలాంటి అవమానాలు, సమస్యలు ఎదురుకాలేదు.
భవిష్యత్ ప్రణాళిక?
పేరే కాదు డబ్బూ ముఖ్యమే. నా సంపాదనలో సగం సమాజసేవకు వినియోగించాలనే ఆలోచన ఉంది. అది ఏ రూపంలో అన్నది ఇంకా నిర్ణయించుకోలేదు. కానీ, ఏదో ఒకలా కొందరికైనా సాయం చేయాలనే సంకల్పం మాత్రం ఉంది.
మన జీవితంలో జరిగేదేదైనా దైవ నిర్ణయమే. తిరుపతి వేంకటేశ్వర స్వామి అంటే చాలా భక్తి. దేవుడి మీద నమ్మకం ఉంచే ఉద్యోగం వదిలేసి పరిశ్రమకు వచ్చాను. ఈరోజు ఇలా మీ అందరి ముందూ ఉన్నాను. అలాగే ప్రేమ, పెండ్లి కూడా. జరగాల్సిన సమయం వచ్చినప్పుడు తప్పకుండా జరుగుతాయి. మన చేతిలో ఏమీ ఉండదు.
… ప్రవళిక వేముల