కర్ణాటకకు చెందిన లెఫ్టినెంట్ కల్నల్ అజిత్ భండార్కర్ కశ్మీర్ తీవ్రవాదులతో పోరాడుతూ వీరమరణం పొందారు. చెట్టంత మనిషిని పోగొట్టుకున్నాక ఇద్దరు పిల్లలే ప్రపంచంగా బతుకుతున్నారు ఆయన భార్య శకుంతల. భర్త శౌర్య స్ఫూర్తికి, గుండె ధైర్యానికి ఆమె వారసురాలు. అందుకే తనను తాను సంబాళించుకుంటూనే.. పిల్లల పెంపకం మీద దృష్టి సారించారు. తన భర్త త్యాగాన్ని లోకానికి చాటుతూ ‘ద సాగా ఆఫ్ ఎ బ్రేవ్ హార్ట్’ అనే పుస్తకం రాశారు.
అక్కడితో ఆగలేదు. ఓ ఫౌండేషన్ స్థాపించి యువతలో సైనిక శిక్షణ పట్ల అవగాహన కలిగిస్తున్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు భర్త పేరు మీదుగా అవార్డులు అందిస్తున్నారు. ఆమె పిల్లలిద్దరూ ఇప్పుడు సైన్యంలో ఉన్నారు. తన భర్త దేశరక్షణలో ప్రాణాలు కోల్పోయినా.. తన పిల్లలిద్ద్దర్నీ సైన్యానికి పంపడమే కాకుండా… దేశవ్యాప్తంగా వివిధ పాఠశాలలకు వెళ్తూ, విద్యార్థులకు సైన్యం పట్ల ప్రేమను పెంచుతున్నారు శకుంతల.