ఇప్పటిదాకా మనకు ఆన్లైన్లో పుస్తకాలు కొనుక్కోవడమే తెలుసు. కానీ మనం చదివిన పుస్తకాలు తిరిగి అమ్మే వెసులుబాటును కలిగిస్తుంది ‘డంప్’ యాప్. తన భర్తతో కలిసి దీన్ని సృష్టించిన మీనాల్ శర్మ ఈ యాప్‌కి హైదరాబాద్ ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నదని చెబుతున్నారు.
బుక్‌చోర్.. పుస్తక ప్రియులకు, ముఖ్యంగా హైదరాబాదీ బుక్రీడర్స్కు సుపరిచితమైన పేరు. కొంత మొత్తం రుసుము కడితే అట్టపెట్టెనిండా పుస్తకాలు తీసుకెళ్లేందుకు వెసులుబాటు కల్పిస్తుందీ సంస్థ. ఏడాదిలో అప్పుడప్పుడూ వివిధ నగరాల్లో బుక్‌ఫెయిర్‌లు నిర్వహిస్తుంటుంది. అయితే మన దగ్గర జనానికి సెకండ్ హ్యాండ్లో పుస్తకాలు కొనే అవకాశం ఉంది.
కానీ, చదివిన వాటిని తిరిగి అమ్మే ఏర్పాటు లేదని గమనించిన సంస్థ ఈ మధ్య ‘డంప్’ పేరిట రివర్స్ లాజిస్టిక్ యాప్‌ని రూపొందించింది. మనం చదివేసిన పుస్తకాన్ని ఈ యాప్‌లో అమ్మకానికి పెట్టొచ్చు. సంస్థ వాళ్లే ఇంటి దగ్గరికి వచ్చి దాన్ని తీసుకెళ్తారు. తద్వారా ఆ పుస్తకం కావాలనుకున్న వాళ్లు దాన్ని కొనుక్కోవచ్చు. ఈ ఐడియాకు చాలా మంచి స్పందనే వచ్చిందని చెబుతారు బుక్‌చోర్ సహవ్యవస్థాపకురాలు మీనాల్. ‘నిజానికి చాలామందికి పుస్తకాలు అంటే ఇష్టం ఉంటుంది.
కానీ, చదివిన తర్వాత వాటిని షోకేసులో పెట్టుకోవాలని అందరూ అనుకోరు. చదివామా… అర్థం చేసుకున్నామా.. పక్కకు పెట్టేశామా అంతే. మళ్లీ మరో కొత్త పుస్తకం చదువుతాం. ఇలాంటి వాళ్లు ఎవరైనా చదివేసిన పాత పుస్తకాలను యాప్ ద్వారా అమ్మడం వల్ల.. కొత్త పుస్తకాలకు షెల్ఫ్‌లో చోటు దక్కుతుంది. మరో పుస్తకం కొనేందుకు కొంత డబ్బూ వస్తుంది. ఈ మధ్య హైదరాబాద్‌కు చెందిన ఒక అమ్మాయి తన దగ్గర ఉన్న 600 పుస్తకాలను తీసుకెళ్లమంటూ మాకు ఫోన్ చేసింది.
ఇప్పటిదాకా మాకొచ్చిన అతి పెద్ద ఆర్డర్ అదే… ’ అని చెబుతారామె. కొన్ని పుస్తకాలు ఖరీదైనవనో, ఇంకొన్ని దొరకడమే కష్టమైనవో అవడం వల్ల ఎక్కువ మంది చదవలేరు. ఇలా అమ్మడం వల్ల అవి చాలామందికి అందుబాటులోకి వస్తాయి కదా అన్నది తమ అభిప్రాయం అంటారు.