పరీక్షిన్మహారాజు పరాశర పౌత్రుడు-
శుక మహర్షితో ఇలా పలికాడు..
ఆ॥ ‘దుష్ట శిక్షణంబు దురిత సంహరణంబు
శిష్ట రక్షణంబు జేయ దలచి
భువిని మనుజుడగుచు బుట్టిన శ్రీకృష్ణు
విమలచరిత మెల్ల విస్తరింపు’
‘మహాత్మా! దుష్టులను శిక్షించడానికి, శిష్టులను రక్షించడానికి, దురితాన్ని- పాపాన్ని దూరీకరించడానికీ, ఇర- ధరణిపై మానవ శరీరంతో అవతరించిన హరి- శ్రీకృష్ణుని విమల చరిత్ర నాకు ఇంకా విరివిగా వివరించు’ అనగా, అప్పుడు శుకుడు ఇలా చెప్పనారంభించాడు… రాజా! బలరామకృష్ణులు కుశస్థలి- ద్వారకలో సుఖంగా ఉన్న దినాలలో సర్వగ్రాస-సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చింది.
ఆ పుణ్య పర్వకాలంలో ప్రజలంతా తమ వెంట తరలిరాగా, వారు అక్రూర వసుదేవాదులతో కాంతా సమేతంగా స్యమంత పంచకానికి వచ్చారు. పూర్వం ఆ ప్రదేశంలో పరశురాముడు దుష్టక్షత్రియ రుధిరం- రక్తంతో ఐదు మడుగులను నిర్మించాడు. అదే స్యమంత పంచకమని దిగంత- జగత్తంతా విశ్రుత (ప్రసిద్ధ) మయింది. పుణ్యతీర్థాలలో స్నానాలు చేసి, ఉపవసించి వారు సువర్ణ రత్న గోదాన భూదానాలతో భూసుర శ్రేష్ఠులను సంతృప్తి పరచారు. బలరామ వాసుదేవులు బంధువర్గంతో కలిసి భాసురంగా- అనురాగం ఉల్లసిల్లగా సరస సల్లాపాలతో భోజనాలు చేశారు. అంతకుముందే ధర్మరాజుతో కలిసి వచ్చిన భీష్మ, ధృతరాష్ట్ర, సంజయ, విదురాదులూ, మరికొందరు క్షత్రియ శ్రేష్ఠులూ స్యమంత పంచకానికి వచ్చారు.
కం॥ ‘ఆ రాజులు గాంచిరి నిజ
నారీయుతు లగుచు నంగనా పరివారున్
ధీరున్ దానవకుల సం
హారున్ గోపీ మనోవిహారు నుదారున్’
ఆ రాజులు తమ ఇంతు- భార్యలతో కూడి ప్రియకాంతా సమేతుడై ఉన్న దానవకుల అంతకుడు, గోపికా మనో విహారుడు, ధీరుడు, ఉదారుడు అయిన మారజనకుని- ద్వారకాధీశుని సందర్శించారు. బలరామకృష్ణులచే సాదరంగా సత్కరింపబడిన వారందరూ యాదవ ప్రముఖులను చూచి మోద- ఆనంద భరితులై దామోదరుడు- కృష్ణుడు వినే విధంగా ఇట్లన్నారు..
మ॥ ‘మన శాస్త్రంబులు వాక్కులున్ మనములున్ మాంగల్యముం బొంది పా
వనమై యొప్పెడి నే రమా విభుని భాస్వత్పాదపంకేజ సే
చన తోయంబుల నే మహాత్ముని పదాబ్జాతంబు లెందేని సో
కినచోటెల్లను ముక్తి హేతువగు, నీ కృష్ణుండె పో! చూడగన్’
మన వేదశాస్ర్తాలూ, బాదరాయణుని- వ్యాసుని వాక్కులూ (వ్యాస సూత్రాలు), మనస్సులూ, ఏ పరంధాముని పాదపద్మ తీర్థాల వలన పవిత్రాలవుతున్నాయో, ఏ మహా మహిముని
పాద స్పర్శకు పాత్రమైన- నోచుకొన్న ప్రదేశమంతా ముక్తిప్రద (దాయక) మవుతుందో, అట్టి అఖిల శక్తిధరుడైన పరాత్పరుడు ఈ శ్రీకృష్ణుడు!
చ॥ ‘సనక సనందనాది మునిసత్తము లంచిత యోగదృష్టిచే
బనివడి యాత్మలన్ వెదకి పట్ట నగోచరమైన మూర్తి యి
ట్లనవరతంబు మాంసనయనాంచల గోచరుడయ్యె నట్టె! యే
మన నగు? వీరి పుణ్యమున కాదట నెట్టితపంబు సేసిరో?’
సనక సనందనాది మహామునులు అంచిత- పూజితమైన తమ యోగదృష్టితో పనిగట్టుకొని మరీ ఆత్మ స్వరూపాన్ని కన (చూడ) దలచినా గోచరం కాని- కనిపించని వనజాక్షుని- నళిన నేత్రుని, మంగళమూర్తి యైన హరిని వీరు అనవరతం- ఎల్లవేళలా తోలు కళ్లతో చూడగలుగుతున్నారు. వీరి సంచిత పుణ్యం ఎంత
సమంచితమో- ఎంతటిదో! వీరు ఎంతలేసి తపస్సులు చేశారో ఏమనగలం?
మ॥ ‘నిరయ స్వర్గము లాత్మగైకొనక తా నిర్వాణమూర్తైన యీ
హరి జూడన్, హరితోడ బల్క, హరి మే నంటన్ హరిం బాడగా
హరితో నేగ, సహాసనాస్తరణ శయ్యావాసులై యుండగన్
హరి బంధుత్వ సఖిత్వముల్ గలుగు భాగ్యం బెట్లు సిద్ధించెనో’
ఉగ్రసేన, అక్రూర, ఉద్ధవాది యాదవ వర్గ ప్రముఖులు, అరయంగా- పరికించగా స్వర్గ నిరయా (నరకా)లను గూర్చి విచారించక ఈ హరిని చూస్తూ, హరితో పలుకుతూ, హరి దేహాన్ని తాకుతూ, హరిని కొనియాడుతూ, హరితో చేరి పయనిస్తూ, కలిసి కూర్చుంటూ, శయనిస్తూ ఉన్నారు. ఆనంద సింధువైన పరమాత్మునితో ఇలా బంధుత్వ మిత్రుత్వాలు కలిగే భాగ్యం వీరికెలా చేకూరిందో అని ఆ రాజబృందం ఆశ్చర్యవడ్డది.
శుకుడు… రాజా! ఆ సమయంలోనే నంద యశోదలు, గోపాల గోపికా బృందాలు తమ తోడురాగా మందరధరుని చూడటానికి పరమానందంతో వచ్చారు. ఇలా చాలాకాలం తరువాత తమను కలవ వచ్చిన నందాదులకు యాదవ ప్రముఖులందరూ ఎదురేగి, హెచ్చిన- మిక్కిలి ప్రేమతో కుశల ప్రశ్నలు గావించి వరుసగా ఆలింగనాలు సలిపారు. బలరామకృష్ణులు వినయ సుందరులై నందయశోదలకు వందించారు.
డెందాలలో అమందమైన ఆత్మీయత, అనురాగం నిండారగా, నయనారవిందాల నుండి ఆనందబాష్పాలు పొంగిపొరలగా, మాటలు పెకలక- రాక మౌనంగా ఉండిపోయారు. యశోద, రామకృష్ణులను ఒడిలోకి తీసుకొని, ప్రేముడి- ముచ్చటగా అక్కున చేర్చుకుంది. చెక్కిలి ముద్దాడింది. మిక్కిలి వాత్సల్యంతో మూర్ధాఘ్రాణం చేసింది- మస్తాకాలను మూర్కొంది (వాసన చూసింది). నెనరు- చనువుతో చిబుకాలు (గడ్డాలు) నిమురుతూ, పలుమారులు కౌగిలించుకొని పరమానందం పొందింది.
‘జనన మొందింది మొదలు మీరే (నందయశోదలు) ఎనలేని బంధుప్రీతితో బలరామకృష్ణులను ఘనమైన అనురాగంతో పెంచి పెద్ద చేశారు. అందువల్లనే ఈ మీ తనయులు ఇప్పటికీ మమ్ము తల్లిదండ్రులుగా తలపోయ- భావింప లేకున్నారు’ అంటూ దేవకీ రోహిణులు యశోదతో ఇలా సల్లాపం (సంభాషణ) చేస్తుండగా వల్లవ (గొల్ల) కాంతలు ఎల్లరూ రాకరాక వచ్చిన తమ ప్రాణనాథుని, శ్రీకరుని- నల్లనయ్యను- విశోకుని, శోకనాశనుని దర్శించాలనే వాంఛ- ఆకాంక్ష ఉల్లము (హృదయా)లలో వెల్లివిరియగా- ఉప్పొంగగా శిఖిపింఛ మౌళి సన్నిధికి వేంచేశారు.
అప్పుండరీకాక్షుని చూస్తూ ఉన్నంత సేపూ తమ కళ్ల రెప్పలని వాల్చలేకపోయారు. పరీక్షిన్మహారాజా! నగధరుని జగన్మోహన సౌందర్య వైభవాన్ని ధ్యానిస్తూ తమ ఆత్మలలో అచ్యుతుని ఆలింగనం చేసుకొన్నారు. వారి తనువులు పులకరించాయి. పరబ్రహ్మ సాక్షాత్కారం వలన పరవశించిపోయే మహాయోగుల మాడ్కి (వలె) గోపికలు పారవశ్యం- తన్మయత్వం (తాదాత్మ్యం) పొందారు. గోపకాంతల స్వాంతం- మదిలోని కాంక్షను గ్రహించి శ్రీకాంతుడు వారిని ఏకాంత ప్రదేశానికి తోడ్కొని పోయి ప్రేమతో కౌగిలింతలలో కరిగించి, భక్తి నితాంత చిత్తలైన- భక్తి పరవశలైన వారితో చిరునవ్వు చిందిస్తూ ఇలా వచించాడు…
చ॥ ‘వనజదళాక్షులార! బలవద్రిపువర్గములన్ జయింపగా
జని తడవయ్యె; దీనికి భృశంబుగ మీ మది నల్గకుండుడీ
యనయము దైవమిట్లు సచరాచరజాలము నొక్కవేళ గూ
ర్చును నొక వేళ బాపును మరుద్ధతతూల తృణంబులం బలెన్’
‘ఇంతులారా! బలవంతులైన పెక్కురు పరిపంథు- శత్రువులను పరిమార్చ (జయించ)డానికి వెళ్లినందుకు మా రాకకు ఇంత తడవు- ఆలస్యం అయింది. ఇందులకై మీరు కినుక- అలుక పూని కుందువడ- దైన్య పడకండి. పెనుగాలికి చెల్లా చెదరై మరల ఒకటయ్యే దూది పింజెలు, గడ్డి పరకల వలె సర్వ ప్రాణులూ దైవ నిర్ణయాన్ని బట్టి ఒకప్పుడు కలుస్తూ (సంయోగం) మరొకప్పుడు విడిపోతూ (వియోగం) ఉంటాయి. వియోగం వలన ప్రేమ వర్ధిల్లుతుంది. అందుకే అది విశిష్టమైన యోగం! సంయోగంలో ప్రేమ ఫలప్రదమవుతుంది. ఆ ప్రేమ దేహ, ఇంద్రియ పరం కాక ఆత్మపరమైతే, కాంతలారా! అదే ‘భక్తి’ రూపాన్ని సంతరించుకుంటుంది.
నాపై అనన్య భక్తి కలవారికి మోక్షానందం కరతలామలకం! కేవలం జప తపో వ్రత దానాది సత్కార్యాల వల్ల ముక్తి లభించదు. క్రతుధ్వంసి (శివుడు), చతురాననుడు (బ్రహ్మ), సనకాది మహామునుల చిత్తాలలో సైతం అంకురించని భక్తి మీలో మొలకెత్తింది. మీ పురాకృత సుకృతాలు నేటికి నిండుగా ఫలించాయి.
ఇక మీదట మీకు ఏ బాధలూ ఉండవు. నరకానికి కారణమైన జన్మకర్మలు మీకిక కలుగవు. విమల మతులారా! అండజ, స్వేదజ, ఉద్భిజ, జరాయుజాలనే చతుర్విధ ప్రాణుల సృష్టి, స్థితి, లయాలకు నేనే కారణం. ప్రాణుల సృష్టికి ముందు, అవి లయమొందిన తరువాత కూడా ఉండేవాడను నేనే! తేనెలో వ్యాపించి ఉన్న తీపి వలెనే వాటి లోపల వెలుపల కూడా నేనే ఉన్నాను. ఇలా అంతటా వ్యాపించి ఉన్న నన్ను, ఓ ఇందువదనలారా! మీరు ఎప్పటికీ పొందే ఉన్నారు.
కాన, నాకూ మీకూ ఎడబాటనేదే లేదు. ఎట్టి దశలోనూ కుండలకు మట్టితో వియోగముంటుందా? పంచభూతాల పంచీకరణ వలన సృష్టి ఏర్పడింది. కావున, ఘటం (కుండ) పటం (వస్త్రం) మొదలైన భూతసృష్టికి పంచభూతాలు (మట్టి, నూలు పోగులు) ఉపాదాన కారణం. కాగా, ఘటపటాదులు (కుండలు, వస్ర్తాలు) వానికార్యాలు. ఈ కార్యకారణాలు రెంటికీ నేనే ఆధారం. (కుండకు మట్టి ఉపాదాన కారణం కాగా, కుమ్మరి నిమిత్త కారణం. కాని, సృష్టికి రెండు కారణాలూ భగవంతుడే). పరమార్థంలో ఈ సమస్త సృష్టికి నేనే అభిన్న నిమిత్త ఉపాదాన కారణం! సృష్టీ నేనే.. స్రష్టా నేనే! వల్లవాంగనలారా! ఇంక వేలు- పెక్కు లొల్లి (అల్లరి), కల్లరి (అసత్యపు) మాటలేల? ‘మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ’ (గీత)- నా కన్నా ఇతరమైనది- నేను కానిది ఏదీ లేనే లేదు’.
శుకుడు- రాజా! ఈ విధంగా మాధవుడు అతుల- అసమానమైన తన మహిమను గూర్చి విశదీకరించగా విని వ్రేతలు- గోపికలు వివేకవతులై దేహాత్మ (‘మేనే నేను’ అన్న) బుద్ధిని విడిచారు. పురుషోత్తముని ప్రస్తుతిస్తూ ఇలా ప్రార్థించారు..
తే॥ ‘ఘోర సంసార సాగరోత్తారణంబు
ధీయుత జ్ఞాన యోగి హృద్ధ్యేయవస్తు
వగుచు జెలువొందు నీ చరణాంబు జాత
యుగళమును మా మనంబుల దగుల నీవె’
పద్మనాభా! సచ్చరిత్రా! భక్త మందరా! ఘోరమైన సంసార సాగరాన్ని తరించడానికి ఆలంబన (ఆధార)మై, ధీరులైన మహాయోగుల హృదయాలలో చిరంతన- సనాతన ధ్యాన విషయమై విరాజిల్లు నీ పాద పద్మ యుగళం మా హృదంతరంలో కూడా నిరంతరం- సుస్థిరంగా ఓజ- శోభ, శక్తితో తేజరిల్లు- వెలుగొందు గాక! శుకుడు- రాజా! కరుణావరుణాలయుడు- దయాసాగరుడు, భక్త వత్సలుడు వాసుదేవుడు పల్లవాధరలు- వల్లవకాంతలు కోరిన వరాలిచ్చి అనుగ్రహించాడు. మూలంలోని రెండు అత్యంత గంభీర అనుష్టుప్ ఛందస్సులోని శాస్త్ర సారాన్ని పోతనామాత్యుడు శ్రీధరాచార్యుల భాష్యానుసారంగా వీసమంత కూడా యాస లేకుండా ఒక్క సీస పద్యంలో భాసమానంగా అందించి అలరించాడు. (సశేషం)
-తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ ,98668 36006