e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home జిందగీ ఢిల్లీలో ‘మన’ లేడీ డ్రైవర్‌

ఢిల్లీలో ‘మన’ లేడీ డ్రైవర్‌

ఢిల్లీలో ‘మన’ లేడీ డ్రైవర్‌

ఊహించని మలుపులతో సాగిపోయే ‘అంతులేని కథ’ సినిమాలో కథానాయిక పేరు సరిత. ఆ సినిమా చూశారో, లేదో తెలియదు కానీ, ఈ ఆడకూతురికి ఆమె తల్లిదండ్రులు ‘సరిత’ అని పేరు పెట్టారు. ఇది కాకతాళీయమే అయినా సరిత జీవితం కూడా ‘అంతులేని కథ’లా సాగిపోతున్నది. ఇంటిల్లిపాది కోసం తానొక్కతే కష్టపడుతున్నది. బడికి దూరమై, పొలానికి దగ్గరైంది. పుస్తకాలు పట్టాల్సిన చేతులతో ‘ఆటో స్టీరింగ్‌’ తిప్పింది. అప్పుల ఊబినుంచి కుటుంబాన్ని గట్టెక్కించడానికి మారు మూల తండానుంచి ఢిల్లీ చేరింది. అక్కడా ‘బస్సు స్టీరింగ్‌’ పట్టింది. ‘దేశంలోనే మొట్టమొదటి మహిళా డ్రైవర్‌’ అనిపించుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలంలోనిసీత్యతండాకు చెందిన వాంకుఢావత్‌ సరిత బతుకు ప్రయాణమిది..
‘ఓ దేఖ్‌ఁ లేడీ బస్‌ చలారే’‘క్యా డ్రైవర్‌ సాహిబాఁ డ్రైవింగ్‌ ఆతే హైనా..’ పదేండ్ల కిందట సరిత మొదటిరోజు బస్సు నడిపినప్పుడు వినిపించిన మాటలివి. అలా అన్న వాళ్లంతా ఆమె డ్రైవింగ్‌కు ఫిదా అయినవారే. ‘కమాల్‌ కియా బేటీ. హ్యాట్సాఫ్‌’ అంటూ బస్సు దిగినవారే. ‘నాకే ఎందుకిన్ని కష్టాలు?’ అనుకొని తల పట్టుకొని కూర్చుంటే సరిత భవిష్యత్తు తండాకే పరిమితమయ్యేది. కష్టాలకు ఎదురీదే ధైర్యమే ఆమెను ఇలా ముందుకు నడిపించింది.
సంస్థాన్‌ నారాయణపురం మండలంలో మారుమూల సీత్యతండాకు చెందిన వాంకుఢావత్‌ రాంకోటి, రుక్కీలకు ఐదుగురు ఆడపిల్లలు. వారిలో చివరమ్మాయి సరిత. మగపిల్లాడి కోసం తండ్రి ఇంకో పెండ్లి చేసుకున్నాడు. ఓ కొడుక్కి జన్మనిచ్చి ఆ రెండో భార్య కన్నుమూసింది. పదెకరాల పొలం కాస్తా నలుగురు ఆడపిల్లలకు పెండ్లిళ్లు చేసేసరికి 30 గుంటలకు చేరింది. ఇంత అమ్ముకున్నా అప్పులు తీరలేదు. బడికి దూరమై కూలీ పనులకు వెళ్లేది సరిత. వ్యవసాయంలో అమ్మానాన్నలకు సాయం చేసేది.

ఆటోతో మొదలు..

నల్లగొండ జిల్లా దేవరకొండ మండలంలోని గాజీనగర్‌ తండాలో ఉంటున్న అక్క దగ్గరికి వెళ్లినప్పుడు, బావ సాయంతో ఆటో నడపడం నేర్చుకుంది. కొన్నాళ్లకు ఆ బావ అనారోగ్యంతో చనిపోయాడు. అమ్మానాన్న, తమ్ముడితోపాటు అక్క బాధ్యతనూ తానే భుజానికెత్తుకుంది సరిత. దేవరకొండ ప్రాంతంలో ఆటో నడపడం మొదలుపెట్టింది. ఆకతాయిల అల్లరి ఎక్కువ కావడంతో తన ఆహార్యాన్ని మార్చేసుకుంది. జుట్టు కత్తిరించుకుంది. ప్యాంటు, షర్టు ధరించి మగరాయుడిలా తయారైంది. ప్రైవేట్‌గా 10వ తరగతి చదివింది. ‘హెవీ మోటార్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌’ పొందింది. 2010లో నల్లగొండ ఆర్టీసీ డిపోలో డ్రైవర్ల పోస్టులకు నోటిఫికేషన్‌ పడితే దరఖాస్తు చేసింది సరిత. మహిళలనుంచి ఆమెది ఒకే ఒక్క దరఖాస్తు వచ్చింది. కానీ, ఆడవాళ్లను డ్రైవర్‌గా తీసుకోమన్నారు అధికారులు. కొన్నాళ్లు వ్యక్తిగత డ్రైవర్‌గా కారు నడిపింది. 2015లో ‘ఢిల్లీ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌’ (డీటీసీ)లో నోటిఫికేషన్‌ పడటంతో సరిత దరఖాస్తు చేసుకుంది. సెలక్ట్‌ అయ్యింది. డీటీసీ పరిధిలో 12 వేలకు పైగా బస్సు డ్రైవర్లు ఉంటే, మహిళా డ్రైవర్‌ సరిత ఒక్కతే. ఉద్యోగరీత్యా హిందీభాష నేర్చుకున్న సరిత ఆరేండ్లుగా రాజధాని నగరంలోనే ఉంటూ రహదారులన్నీ బస్సుతో చుట్టేస్తున్నది.

ఢిల్లీలో కొత్త చరిత్ర

ఢిల్లీలో సరిత పేరు చెబితే మహిళలకు ఓ భరోసా. సరితను కేవలం చోదకురాలిగానే చూడకుండా ఆత్మీయురాలిగా భావిస్తారు. ‘మొట్టమొదటి బస్సు డ్రైవర్‌’గా చరిత్ర సృష్టించిన సరిత 2018లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా ప్రత్యేక పురస్కారం అందుకుంది. 2016లో ఢిల్లీ ప్రభుత్వం రూ.25 వేల నగదు ప్రోత్సాహకాన్ని అందించింది. అప్పటి ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంతి అఖిలేష్‌ యాదవ్‌, కిరణ్‌ బేడీ చేతులమీదుగా అవార్డులు.. 2017లో తెలంగాణ ప్రభుత్వం తరఫున కుమ్రం భీం అవార్డును అందుకున్నది. ఢిల్లీలో ఒంటరిగా ఉంటున్న సరితను ‘పెండ్లి ఎప్పుడని’ అడిగితే, ‘పెండ్లి తర్వాత మా అక్కల పరిస్థితి చూశాక నాకు మనువాడాలనే ఆలోచన కూడా రావడం లేదు..’ అంటున్నది. జీవితంలో ఒంటరి ప్రయాణం చేస్తూ రోజూ వందలాది మందిని గమ్యాలకు చేరుస్తున్నది. ‘ఢిల్లీ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌లో కాంట్రాక్ట్‌ పద్ధతిలో పనిచేస్తున్నా. ఓవర్‌ డ్యూటీ చేసినా ఆర్థిక ఇబ్బందులు తీరడం లేదు. తండాలో అమ్మానాన్నలతోపాటు తమ్ముడి బాగోగులను నేనే చూసుకోవాలె. చేసేటోళ్లు లేక ఉన్న కొద్ది భూమి పడావు పడ్డది. మన టీఎస్‌ ఆర్టీసీలో అవకాశం ఇస్తే అమ్మానాన్నలను దగ్గరుండి చూసుకునే వీలుంటది’ అంటున్నది వాంకుఢావత్‌ సరిత.

గంజి ప్రదీప్‌ కుమార్‌
యాదాద్రి భువనగిరి జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఢిల్లీలో ‘మన’ లేడీ డ్రైవర్‌

ట్రెండింగ్‌

Advertisement