సినీ పరిశ్రమ ప్రజాభిప్రాయంతోనే నడుస్తుందనీ, ఇలాంటి చోట విమర్శలు, ట్రోలింగ్‌లను ఎదుర్కోవడం అంత సులభం కాదనీ అంటున్నది బాలీవుడ్ హాట్ బ్యూటీ సారా అలీఖాన్. పబ్లిక్ ఫిగర్‌గా ఉన్నప్పుడు అన్నివైపుల నుంచీ విమర్శలు వస్తుంటాయనీ, వాటిని ఎదుర్కోవడానికి సదా సిద్ధంగా ఉండాలని చెబుతున్నది. ఇటీవల ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ట్రోలింగ్, విమర్శలపై చర్చించింది. ‘మీకు నచ్చినా నచ్చకపోయినా.. పబ్లిక్ ఫిగర్‌గా ఉన్నవారిపైకి నిత్యం ఎన్నోరకాల విమర్శలు వస్తుంటాయి.
మొదట్లో అలాంటి వాటికి నేను చాలా భయపడేదాన్ని. కానీ, మెల్లమెల్లగా వాటిని ఫిల్టర్ చేయడం నేర్చుకున్నా. విమర్శల్లోనూ మంచి-చెడులను వడపోయడంపై అవగాహన పెంచుకున్నా!’ అంటూ వెల్లడించింది. ఇంకా మాట్లాడుతూ.. ‘కొన్ని నిర్మాణాత్మక విమర్శలు మంచివే! వాటిని స్వీకరించాల్సిందే! అవి మనం ఎదగడానికి, కొత్తగా నేర్చుకోవడానికి, మనల్ని మనం మెరుగుపరుచు కోవడానికి సాయపడతాయి. అలాంటి విమర్శలను నేను విలువైనవిగానే భావిస్తాను’ అంటూ చెప్పుకొచ్చింది. అయితే, కొందరు మాత్రం వ్యక్తిగతంగా విమర్శిస్తుంటారనీ, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదనీ అంటున్నది.
బాలీవుడ్ చోటా నవాబ్.. నటులు సైఫ్ అలీఖాన్- అమృతా సింగ్ కుమార్తె సారా అలీఖాన్. కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి చరిత్ర-రాజకీయ శాస్త్రంలో పట్టా అందుకున్నది. ఐశ్వర్యరాయ్ స్ఫూర్తితో తాను సినిమాల్లోకి వచ్చినట్లు గతంలో ఓసారి చెప్పింది సారా. 2018లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో కలిసి ‘కేదార్నాథ్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత సింబా, లవ్ ఆజ్కల్, కూలీ నంబర్ 1, గ్యాస్‌లైట్, జరా హట్కే జరా బచ్కే వంటి చిత్రాల్లో నటించింది.