Galaxy TriFold | స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తుల్లో అగ్రగామి సామ్సంగ్ (Samsung).. తన అత్యంత ప్రతిష్టాత్మక ట్రైఫోల్డ్ ఫోన్‌ను అధికారికంగా ఆవిష్కరించింది. ‘సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ట్రైఫోల్డ్’ను (Galaxy TriFold) మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ప్రీమియం, ఫ్లాగ్షిప్ యూజర్లను దృష్టిలో పెట్టుకొని ఈ మోడల్‌కు రూపకల్పన చేసింది. ఇప్పటికే ఉన్న బుక్ స్టయిల్, ఫ్లిప్ మోడళ్లను మించిన ఫోల్డబుల్ అనుభవాన్ని ఈ ట్రైఫోల్డ్ ఫోన్ అందిస్తుందని సామ్సంగ్ చెబుతున్నది. సామ్సంగ్ నుంచి అధికారిక ప్రకటన వెలువడగానే.. ఈ ట్రైఫోల్డ్ మోడల్ గురించి నెట్టింట తెగ వెతుకులాట మొదలైంది. ఇందులోని ఫీచర్లు, భారత్‌లో విడుదల గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అధికారిక ధరను ప్రకటించనప్పటికీ.. ఈ హ్యాండ్సెట్ 512 జీబీ, 1టీబీ వేరియంట్లలో లభించనున్నది.
సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ట్రైఫోల్డ్లో అతిపెద్ద హైలైట్.. దాని డిస్ప్లే ఇంజినీరింగ్ వ్యవస్థ. ఇందులో 10.0 అంగుళాల QXGA+ డైనమిక్ AMOLED మెయిన్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. 120Hz రిఫ్రెష్ రేట్‌తో.. అద్భుతమైన యూజర్ అనుభూతిని అందిస్తుంది. రెండో డిస్ప్లే.. 6.5 అంగుళాల FHD+ కవర్ స్క్రీన్. ఇదీ 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తున్నది. రోజువారీ ఉపయోగం కోసం ప్రైమరీ ఇంటర్ఫేస్గా పనిచేస్తుంది. ఫోన్ బాడీ తయారీలో గొరిల్లా గ్లాస్ సిరామిక్ 2, సిరామిక్ గ్లాస్ ఫైబర్ బ్యాక్, ఆర్మర్ అల్యూమినియం ఫ్రేమ్‌తోపాటు టైటానియం హింజ్‌ను ఉపయోగించారు. దాంతో, మన్నికలోనూ అగ్రస్థానంలో నిలుస్తుంది.
309 గ్రాముల బరువుండే ఈ ఫోన్.. ఐపీ 48 రేటింగ్‌ను కలిగి ఉంటుంది. దుమ్ము ధూళి నుంచి రక్షణతోపాటు 1.5 మీటర్ల లోతులో 30 నిమిషాల పాటు ఉంచినా ఈ ఫోన్‌కు ఏమీకాదు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఫర్ గెలాక్సీ చిప్సెట్, 16 జీబీ ర్యామ్ ఏర్పాటుచేశారు. ప్రొఫెషనల్ వర్క్‌తోపాటు గేమింగ్, క్రియేటివ్ వర్క్‌ను ఎలాంటి ల్యాగ్ లేకుండా, చాలా స్మూత్‌గా చేసుకోవచ్చు. 5,600 ఎంఏహెచ్ ట్రిబుల్-సెల్ బ్యాటరీ, 45వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తున్నది. కేవలం 30 నిమిషాల్లో 50శాతం ఛార్జింగ్ అయిపోతుంది.
ఇక ఇందులోని కెమెరా సెటప్.. మరో రేంజ్లో ఉండబోతున్నది. 200 ఎంపీ ట్రిపుల్ రియర్ మెయిన్ కెమెరా స్పెషల్ అట్రాక్షన్. 12ఎంపీ అల్ట్రా వైడ్, 10ఎంపీ టెలిఫొటో లెన్స్ ఉన్నాయి. 30x డిజిటల్ జూమ్‌ను అందిస్తుంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 10 ఎంపీ సామర్థ్యం కలిగిన రెండు ఫ్రంట్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆండ్రాయిడ్ 16 ఆధారంగా వన్ యూఐతో పనిచేసే సామ్సంగ్ ట్రైఫోల్డ్ ఫోన్లో.. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, 5జీ, వైఫై 7, బ్లూటూత్ 5.4, యూఎస్బీ-సి.. లాంటి మరెన్నో ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. మొత్తానికి స్మార్ట్‌ఫోన్ రంగంలో సరికొత్త మైలురాయిగా నిలిచిపోయే ఈ ట్రైఫోల్డ్ ఫోన్.. త్వరలోనే భారత్‌లోనూ అడుగు పెట్టనున్నది.