ఎంత సెలెబ్రిటీలైనా భార్యాభర్తల మధ్య చిన్నచిన్న గొడవలు సహజమేనని అంటున్నాడు బాలీవుడ్ చోటా నవాబ్ సైఫ్ అలీఖాన్. తనకూ తన భార్య కరీనాకపూర్ మధ్య అప్పుడప్పుడూ గిల్లికజ్జాలు అవుతుంటాయని చెబుతున్నాడు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన వైవాహిక జీవితం గురించిన ముచ్చట్లు పంచుకున్నాడు. కరీనాతో అనుబంధం, భార్యాభర్తల మధ్య గొడవలు, సర్దుకుపోవడాలు.. తన తండ్రి ఇచ్చిన సలహాల గురించీ చెప్పుకొచ్చాడు సైఫ్. ఇతర జంటల మాదిరిగానే తమ మధ్య కూడా గొడవలు జరుగుతుంటాయనీ, వాటిని ఎలా ఎదుర్కోవాలో తనకు తెలుసని అన్నాడు.
ఈ విషయమై తన తండ్రి మన్సూర్ అలీఖాన్ పటౌడీ కూడా ఒకసారి కొన్ని సలహాలు ఇచ్చాడని వెల్లడించాడు. ‘ఒకసారి మా నాన్న నాకో సలహా ఇచ్చారు. వివాహబంధంలో తగాదాలు సహజమనీ, వాటిని మరీ ఎక్కువ సీరియస్‌గా తీసుకోవద్దనీ చెప్పారు. తనూ, మా అమ్మ షర్మిలా ఠాగూర్ కూడా గొడవ పడేవారనీ వెల్లడించారు’ అంటూ సెలెబ్రిటీలైన తన తల్లిదండ్రుల దాంపత్య జీవితం గురించి పంచుకున్నాడు. ‘మా అమ్మ ఎప్పుడైనా మా నాన్నతో వాదనకు దిగితే.. ఆయన క్రికెట్ గురించే ఆలోచించేవారట. ఆమెను ఏమీ అనేవాడు కాదట. అమ్మ మాటలను చెవులతో వింటూ.. మనసులో మాత్రం క్రికెట్, ఇతర విషయాల గురించి ఆలోచిస్తూ ఉండేవారట.
నేను కూడా కరీనా దగ్గర అదే స్ట్రాటజీని ఫాలో అవుతాను’ అంటూ చెప్పుకొచ్చాడు. గతంలో నటి అమృతా సింగ్‌ను వివాహం చేసుకున్న సైఫ్.. 2004లో ఆమెతో విడిపోయాడు. ఈ జంటకు సారా అలీఖాన్, ఇబ్రహీం అలీఖాన్ సంతానం. ఆ తర్వాత 2007లో ‘తాషన్’ సినిమా సమయంలో సైఫ్-కరీనా డేటింగ్ ప్రారంభించారు. బాలీవుడ్లో అత్యంత చర్చనీయాంశమైన ప్రేమజంటగా నిలిచారు. ఐదేళ్ల ప్రేమాయణం తర్వాత 2012లో వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
వీరికి తైమూర్ అలీఖాన్, జహంగీర్ అలీఖాన్ పిల్లలు. సినిమాల విషయానికి వస్తే.. పెళ్లి తర్వాత కరీనా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ, పిల్లలను చూసుకుంటున్నది. సైఫ్ మాత్రం బాలీవుడ్‌తోపాటు ఇతర భాషల చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే నెట్‌ఫ్లిక్స్ చిత్రం.. జ్యువెల్ థీఫ్: ది హీస్ట్ బిగిన్స్లో కనిపించాడు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘దేవర’ చిత్రంలో నెగెటివ్ రోల్‌తో టాలీవుడ్‌కూ పరిచయమయ్యాడు.