పండుగల వేళ మగువుల చేతుల్లో గోరింట పూస్తుంది. అయితే, అరచేత మొగ్గతొడిగిన మైదాకు అంత త్వరగా పోదు. ఈలోపుగానే మరోసారి మైదాకు పెట్టుకోవాల్సి వస్తే పెద్ద చిక్కే! ఇలాంటప్పుడు చాలామంది మైదాకు రంగు తొలగించడానికి రసాయనాలతో కూడిన ఉత్పత్తులను వాడుతారు. అవి చర్మానికి హాని కలిగించే అవకాశం ఉంటుంది. అదే.. ఇంట్లోనే సులభంగా దొరికే నిమ్మకాయ, బేకింగ్ సోడాతో.. హెన్నాను సులభంగా తొలగించుకోవచ్చు.
నిమ్మరసం సహజసిద్ధమైన బ్లీచింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. చేతులపై మైదాకును తొలగించడంలో సమర్థంగా పనిచేస్తుంది. నిమ్మకాయ రసానికి బేకింగ్ సోడా కలిపి పేస్ట్‌లా తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని చేతులకు అప్లయి చేసి.. 15 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే.. మెహెందీ రంగు మాయమై పోతుంది. బేకింగ్ సోడాకు బదులుగా చక్కెర కలిపినా మంచి ఫలితం కనిపిస్తుంది. అయితే, చిన్నపిల్లలు, సున్నితమైన చర్మం ఉన్నవారు నిమ్మరసం వాడకపోవడమే మంచిది.
మైదాకు మరకలను తొలగించడంలో ఆలివ్ నూనె కూడా ఉపయోగపడుతుంది. ఆలివ్ ఆయిల్లో కాటన్ బాల్‌ను ముంచి, అరచేతులపై సున్నితంగా రుద్దాలి. కాసేపయ్యాక.. మెత్తని, శుభ్రమైన వస్త్రంతో తుడిచేస్తే సరిపోతుంది.
3% హైడ్రోజన్ పెరాక్సైడ్తోనూ మైదాకు తొలగిపోతుంది. ఒక కాటన్ బాల్‌ను హైడ్రోజన్ పెరాక్సైడ్ ద్రావణంలో ముంచి, దానితో చేతులపై సున్నితంగా రుద్దాలి. కాసేపయ్యాక.. నీటితో శుభ్రం చేసుకుంటే హెన్నా మరకలు మాయమైపోతాయి. కానీ, హైడ్రోజన్ పెరాక్సైడ్ కొందరిలో అలర్జీని కలగించవచ్చు. అందుకే, దీనిని ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి.
గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పువేసి.. అందులో చేతులను 15 నుంచి 20 నిమిషాలు నానబెట్టాలి. ఆ తర్వాత చేతులను సున్నితంగా స్క్రబ్ చేస్తే.. హెన్నా రంగు తొలగిపోతుంది.