మా పాపకు పదమూడు సంవత్సరాలు. మళ్లీ మళ్లీ కంటి కురుపు అవుతుంది. అదే అంతలో తగ్గిపోతున్నది. ఇలా జరిగితే ఏం చేయాలి? డాక్టర్కి చూపించాం. ఆయింట్మెంట్ వాడుతున్నాం. అప్పుడు పగిలిపోతుంది. తర్వాత తగ్గిపోతుంది. ఆ తర్వాత మళ్లీ వస్తుంది. ఏం చేయాలి?
మీరు చెప్పే వివరాల ప్రకారం.. మీ పాపకు బహుశా కలేజియాన్ (chalazion) సమస్య ఉండి ఉండొచ్చు. కంటి రెప్పల్లో ఉండే మెబోమియన్ గ్రంథి నుంచి స్రావం బయటికి రాకుండా ఏదైనా అడ్డుపడటం వల్ల కొవ్వు పదార్థాలు అందులోనే ఉండిపోయి అది కురుపులా మారిపోతుంది. సాధారణంగా ఇది ఇబ్బంది కలిగించదు. కాకపోతే పరిమాణం ఎక్కువైనప్పుడు కంటికి అడ్డుపడి, దృష్టిని ఇబ్బంది పెడుతుంది. సాధారణంగా ఇది పై కనురెప్పకు ఉంటుంది. దీనివల్ల బ్లపరైటిస్ (కనురెప్ప చుట్టూ ఇన్ఫెక్షన్) రావొచ్చు.
ఆ ఇన్ఫెక్షన్ నాలుగు నుంచి ఎనిమిది వారాల్లో దానంతట అదే తగ్గిపోతుంది. యాంటి బయాటిక్ మందులు వాడితే ఇంకా ముందే తగ్గిపోతుంది. అయితే.. ఈ సమస్య మీ బిడ్డకు మళ్లీ మళ్లీ వస్తున్నదంటున్నారు. మీ బిడ్డ వయసు పదమూడేండ్లు అంటున్నారు. ఈ వయసులో మొటిమలు రావొచ్చు. ఆ సమస్య ఏమైనా ఉందా? చుండ్రు తీవ్రంగా ఉన్నా ఈ సమస్య ఎక్కువగా ఉండొచ్చు. ఒకసారి కంటి వైద్యులకు చూపించండి. కలేజియాన్ అయి ఉంటే, మళ్లీ మళ్లీ అదేచోట వచ్చినట్లయితే.. దానికి తగిన చికిత్స చేస్తారు. ఇది ప్రమాదకరమైన సమస్య కాదు. చికిత్స కూడా ఉంది. కాబట్టి కంగారు అవసరం లేదు.