హ్యాండ్ బ్యాగ్ అంటే వందల్లోనో కాస్త బ్రాండ్ ఉండాలనుకుంటే వేలల్లోనో ఖర్చుపెట్టి కొనుక్కుంటాం. అయితే ఇక్కడ అచ్చం పాస్తాను తలపిస్తూ ఫంకీగా కనిపిస్తున్న ఈ హ్యాండ్‌బ్యాగ్ ధర మాత్రం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.
ఇటాలియన్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ మోషీనో ఇటీవల మార్కెట్లోకి తీసుకొచ్చిన దీని ధర 2 లక్షల 85 వేల రూపాయల పైచిలుకే! 2025 వింటర్/ ఫాల్ కలెక్షన్ కింద రూపొందించిన ఈ పర్సుకు స్పాగెట్టీని తలపించే దారాలను చేతితో అతికించారట. పైన లెదర్‌తో చేసిన తులసి జాతి ఆకులు (బేసిల్ లీవ్స్), టమాటాల ఆకృతులతో అలంకరించారు. పర్సు తెరిచే క్లిప్పుల దగ్గర రెండు చిన్న టమాటాలు కనిపిస్తాయి. దీని చిత్రమైన రూపంతో పాటు అమ్మో అనిపించే ధరా ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారాయి.