నిన్న మొన్నటి వరకు వృద్ధులకే పరిమితమైన గుండెపోటు సమస్య నేడు యువతకు గండంలా దాపురించింది. దీనికి ప్రధాన కారణం మన జీవనశైలిలో వచ్చిన మార్పులే. గుండె పదిలంగా ఉండాలంటే.. యుక్త వయసు నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
ప్లాస్టిక్కు దూరంగా: మనం వాడే ప్లాస్టిక్ కేవలం పర్యావరణానికే కాదు మన గుండెకు కూడా శత్రువే. ప్లాస్టిక్ కణాలు విచ్ఛిన్నమై మైక్రోప్లాస్టిక్స్, నానో ప్లాస్టిక్స్గా మారి మనం పీల్చే గాలిలో, తాగే నీటిలో చేరుతున్నాయి. ఇవి శరీరంలో చేరి దీర్ఘకాలిక వాపు కలిగిస్తాయి. దీనివల్ల ధమనుల్లో అడ్డంకులు ఏర్పడి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. వీలైనంత వరకు ప్లాస్టిక్ బాటిళ్లు, డబ్బాల వాడకాన్ని తగ్గించాలి.
సీఫుడ్ తీసుకోండి: గుండె ఆరోగ్యానికి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎంతో అవసరం. ఇవి చేపల్లో పుషలంగా లభిస్తాయి. రక్తంలో ఒమేగా-3 స్థాయులు ఎకువగా ఉన్నవారిలో గుండె సంబంధిత సమస్యలు తకువగా ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. వారానికి కనీసం రెండుసార్లు చేపలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల గుండె పనితీరు మెరుగుపడుతుంది.
ఎండలో గడపండి: మనలో చాలామంది ఏసీ గదులకే పరిమితమవుతున్నారు. కానీ, సూర్యరశ్మి సహజంగానే రక్తపోటును నియంత్రిస్తుంది. క్రమం తప్పకుండా ఎండలో గడపడం వల్ల ధమనుల్లో ఏర్పడే ప్లేక్ తగ్గుతుంది. తద్వారా పక్షవాతం, గుండెపోటు ముప్పు తప్పుతుంది.
నిద్రతోనే ఆరోగ్యం: చాలామంది నిద్రను విలాసంగా భావిస్తారు. కానీ, అది ప్రాథమిక అవసరం. శరీరం విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు గుండె కండరాలు తమను తాము మరమ్మతు చేసుకుంటాయి. సరైన నిద్ర లేకపోతే శరీరంలో జీవక్రియలు దెబ్బతిని గుండెపై అదనపు భారం పడుతుంది. అందుకే ప్రతిరోజూ 7-8 గంటల నిద్ర తప్పనిసరి.
శారీరక శ్రమ: ఒకే చోట కూర్చుని పనిచేసే అలవాటు గుండెకు శాపం. రోజూ కనీసం 30 నిమిషాలపాటు నడక, హైకింగ్, సైక్లింగ్ వంటి వ్యాయామాలు చేస్తుండాలి. శరీర కదలికలు రక్త ప్రసరణను మెరుగుపరిచి గుండెను దృఢంగా ఉంచుతాయి.
ఒత్తిడిని తగ్గించుకోండి: వందలాది గుండెపోటు కేసుల్లో ఒత్తిడి ప్రధాన కారణంగా తేలింది. మానసిక ఆందోళన రక్తనాళాలపై ఒత్తిడిని పెంచుతుంది. యోగా, ధ్యానం వంటి పద్ధతుల ద్వారా ఒత్తిడిని నియంత్రించుకోవాలి.
పరీక్షలు చేయించుకోండి: గుండె ఆరోగ్యంపై అంచనాలతో కాకుండా, డేటా ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలి. శరీరంలో ఇన్ఫ్లమేషన్ లెవల్స్, హోమోసిస్టీన్, విటమిన్లు, మినరల్స్ స్థాయులను ఎప్పటికప్పుడు వైద్య పరీక్షల ద్వారా తెలుసుకోవాలి. దీనివల్ల ముప్పును ముందే పసిగట్టవచ్చు.
ఈఎంఎఫ్ తగ్గించండి: మొబైల్ ఫోన్లు, వై-ఫై నుంచి వచ్చే విద్యుదయసాంత కిరణాలు (EMF) గుండెలోని ఎలక్ట్రికల్ సిగ్నల్స్ పై ప్రభావం చూపే అవకాశం ఉందని కొన్ని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. అందుకే రాత్రిపూట వై-ఫై స్విచ్ ఆఫ్ చేయడం, నిద్రపోయేటప్పుడు ఫోన్ను దూరంగా ఉంచడం వంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం మన గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.