ప్రొస్టేట్ క్యాన్సర్.. మగవాళ్ల తొలి శత్రువు. అందులోనూ నడివయసు పురుషులను లక్ష్యం చేసుకుంటుంది. నిశ్శబ్దంగా విస్తరిస్తుంది. పరిపూర్ణ ఆరోగ్యవంతులనూ వదిలిపెట్టదు. అత్యాధునిక రోబోటిక్ సర్జరీ ద్వారా ఆ మహమ్మారిని నియంత్రించవచ్చని భరోసా ఇస్తున్నారు వైద్య నిపుణులు.
క్యాన్సర్.. పేరు వింటేనే సగం ప్రాణం చచ్చిపోతుంది. కొన్ని రకాల క్యాన్సర్లకు కచ్చితమైన కారణాలు తెలియవు. మరికొన్ని క్యాన్సర్లకు మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరకశ్రమ లేకపోవడం, కాలుష్యం, హానికరమైన రసాయనాలు రాచమార్గాలని చెబుతారు. అయితే అన్ని క్యాన్సర్లు అందరికీ రావు. కొన్ని మహిళలను లక్ష్యం చేసుకుంటాయి. ఇంకొన్ని పురుషుల మీద గురిపెడతాయి. అలా పురుషుల ప్రాణాలతో ఆడుకునే వ్యాధి.. ప్రొస్టేట్ గ్రంథి క్యాన్సర్. ప్రపంచ వ్యాప్తంగా మగవారి మరణాలకు రెండో ప్రధాన కారణం.. ప్రొస్టేట్ క్యాన్సర్. గతంలో ఈ రుగ్మత విదేశాలలోనే ఎక్కువ. కానీ ఇప్పుడు మన దగ్గరా కేసులు పెరుగుతున్నాయి. అసలు ప్రొస్టేట్ గ్రంథి అంటే ఏమిటి? మన శరీరంలో ఎక్కడ ఉంటుంది? ప్రొస్టేట్ క్యాన్సర్ లక్షణాలుఏమిటి, చికిత్సా విధానాలు ఎన్నిరకాలు? తదితర అంశాల గురించి చర్చించుకుందాం.
నేరేడు పరిమాణం
ప్రొస్టేట్ గ్రంథి అనేది మూత్ర సంచి దిగువన, మూత్రనాళాన్ని అంటుకుని, నేరేడు కాయ పరిమాణంలో ఉంటుంది. యుక్త వయసులో పురుషుల్లో వీర్యం తయారీకి అవసరమైన 50 శాతం స్రావాలను ఇది ఉత్పత్తి చేస్తుంది. అంటే, పునరుత్పత్తి వ్యవస్థలో ముఖ్యపాత్ర పోషిస్తుందన్నమాట.
వయసుతోపాటు
వయసు పైబడేకొద్దీ ప్రొస్టేట్ గ్రంథి పరిమాణమూ పెరుగుతుంది. ఈ పరిస్థితిని బీపీహెచ్ (బినైన్ ప్రోస్టాటిక్ హైపర్ప్లేజియా) అంటారు. సాధారణంగా ఈ గ్రంథి 15 గ్రాముల బరువు ఉంటుంది. 50 ఏండ్లు దాటిన వారిలో ప్రొస్టేట్ గ్రంథి బరువు క్రమంగా అధికం అవుతుంది. 40 గ్రాముల లోపు ఉంటే గ్రేడ్-1 ఎన్లార్జ్మెంట్గా, 60 గ్రాముల లోపు ఉంటే గ్రేడ్-2 ఎన్లార్జ్మెంట్గా, 60 గ్రాముల కంటే ఎక్కువ ఉంటే గ్రేడ్-3 ఎన్లార్జ్మెంట్గా పరిగణిస్తారు.
తొలి దశల్లో గుర్తిస్తే ..
ప్రొస్టేట్ క్యాన్సర్‌ను మొదటి రెండు దశలలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చని నిపుణులు భరోసా ఇస్తున్నారు. అదే మూడు, నాలుగు దశలలో వైద్యులను సంప్రదిస్తే.. రోగి కోలుకోవడం అంత సులభం కాదు. అయితే, అప్పుడు కూడా సమర్థమంతమైన చికిత్సతో జీవితకాలాన్ని పెంచవచ్చు. అంతేకానీ, వ్యాధిని పూర్తిగా నయం చేయలేం.
ప్రొస్టేట్ క్యాన్సర్ పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల..
ప్రారంభంలో రుగ్మత లక్షణాలను గుర్తించలేకపోతున్నారు చాలామంది. దీంతో వంటింటి చిట్కాలతో, అనర్హులైన వైద్యులతో అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేస్తారు. చివరి దశలో.. అదీ మృత్యువు ముంచుకొస్తున్న వేళ నిపుణులను సంప్రదిస్తున్నారు. అప్పటికే క్యాన్సర్ ముదిరిపోయి, ఇతర అవయ వాలకు విస్తరించే దశలో ఉంటుంది.
వ్యాధి ఏ గ్రేడ్‌లో ఉందన్నది ముఖ్యం కాదు. గ్రంథి పెరుగుదల కారణంగా కనిపించే లక్షణాల తీవ్రతే ఇక్కడ ప్రధానం. దీని ఆధారంగానే చికిత్స చేయాల్సి ఉంటుంది.
రోబో సాయంతో…
ప్రొస్టేట్ గ్రంథి క్యాన్సర్ తొలి రెండు దశలలో ఉన్నప్పుడు రోబోటిక్ చికిత్సతో పూర్తిగా నయం చేయవచ్చు. రోబోటిక్ సర్జరీ అనేది మనకు అందుబాటులో ఉన్న అత్యాధునిక పద్ధతి. ఈ మార్గంలో అతి సులభంగా
ప్రొస్టేట్ గ్రంథి
క్యాన్సర్‌ను తొలగించవచ్చు. ఓపెన్ సర్జరీ, ల్యాపరోస్కోపిక్ సర్జరీల కంటే రోబోటిక్ వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి. రోగి ఎక్కువ రోజులు దవాఖానలో ఉండాల్సిన అవసరం లేదు. సర్జరీ తర్వాత నొప్పి కూడా తక్కువే. సాధారణంగా క్యాన్సర్ శస్త్ర చికిత్స తర్వాత కొంత మందిలో ఇతర సమస్యలు ఉత్పన్నం అవుతాయి. రోబోటిక్ సర్జరీతో ఆ ఇబ్బంది తక్కువని నిపుణులు చెబుతున్నారు.
అవగాహన పెరగాలి
ప్రొస్టేట్ క్యాన్సర్‌ను నిలువరించడానికి ఒకటే మార్గం.. ఆ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండటం. యాభై దాటిన ప్రతి పురుషుడూ తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలి. మూత్ర వ్యవస్థలో ఏ చిన్న ఇబ్బంది తలెత్తినా.. వెంటనే వైద్య నిపుణులను సంప్రదించాలి. ఆలస్యం చేసినకొద్దీ క్యాన్సర్ ఇతర భాగాలకూ విస్తరిస్తుంది. కొన్నిసార్లు ఈ వ్యాధి వారసత్వంగా రావచ్చు. ఆరోగ్యవంతమైన జీవనశైలి ప్రొస్టేట్ క్యాన్సర్‌ను పూర్తిగా నిలువరించలేకపోవచ్చు. కానీ, ఆ వ్యాధిని ఎదిరించే ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి, వ్యసనాలను దూరం చేసుకుని.. ఆరోగ్యవంతమైన ఆహారాన్ని పళ్లెంలోకి ఆహ్వానించండి. ఊబకాయాన్ని దగ్గరికి రానివ్వకండి. వ్యాయామానికి సమయం కేటాయించండి.
ప్రధాన లక్షణాలు
– డాక్టర్ గుత్తా శ్రీనివాస్
కన్సల్టెంట్ యూరాలజీ అండ్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్
యశోద హాస్పిటల్
హైటెక్ సిటీ, హైదరాబాద్