‘ఐపీఎల్’ కప్‌ను కొట్టేందుకు తమ సింహాలు (ఆటగాళ్లు) రెట్టించిన ఆత్మవిశ్వాసంతో మళ్లీ వస్తారని అంటున్నది ‘పంజాబ్ కింగ్స్’ కో ఓనర్ ప్రీతీ జింటా. ఈ సీజన్లో మెరుగైన ఆటతీరు కనబరచిన పంజాబ్ జట్టు.. ఫైనల్లో ఓడిపోవడంతో ప్రీతి భావోద్వేగానికి గురైంది. తాజాగా.. ‘ఐపీఎల్-2025’కు సంబంధించి తన ఇన్‌స్టా వేదికగా ఓ సుదీర్ఘ పోస్ట్ అభిమానులతో పంచుకున్నది. పంజాబ్ జట్టు సభ్యులతో కూడిన ఫొటోను.. పెద్ద అక్షరాలతో ‘ధన్యవాదాలు’ అంటూ షేర్ చేసింది.
‘ఈ సీజన్ మేము కోరుకున్నట్లుగా ముగియలేదు. కానీ, ఈ ప్రయాణం అద్భుతంగా ఉంది. ఎంతో ఉత్తేజకరంగా.. వినోదాత్మకంగా.. స్ఫూర్తిదాయకంగా సాగింది. మా యువ జట్టు, మా సింహాలు (ఆటగాళ్లు) టోర్నీ మొత్తం చూపించిన పోరాటం, పట్టుదల నాకు ఎంతో నచ్చింది. ముఖ్యంగా మా కెప్టెన్ మా జట్టును నడిపించిన తీరు.. అన్క్యాప్డ్ ఆటగాళ్ల పోరాటం అద్భుతం’ అంటూ రాసుకొచ్చింది.
ఇక ఈ సీజన్ ప్రయాణం గురించి వివరిస్తూ.. ‘ఈ సంవత్సరం ఎంతో ప్రత్యేకమైంది. గాయాలు, యుద్ధ భయాలతో కీలక ఆటగాళ్లను కోల్పోయినప్పటికీ.. టోర్నీలో విరామం వచ్చినప్పటికీ.. స్వరాష్ర్టాన్ని విడిచి వేరేచోట్ల ఆడినప్పటికీ.. స్టేడియం మొత్తం ఖాళీ చేసినప్పటికీ.. మేము రికార్డులను బద్దలు కొట్టాం! దశాబ్దం తర్వాత పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచాం. ఉత్తేజకరంగా సాగిన ఫైనల్లో.. చివరి వరకూ పోరాడాం’ అంటూ చెప్పుకొచ్చింది.
వచ్చే ఏడాది తమజట్టు రెట్టించిన ఉత్సాహంతో తిరిగి వస్తుందని హామీ ఇచ్చింది ప్రీతి. ‘టోర్నీ అంతటా ఇంతగొప్ప ప్రదర్శన చేసిన పంజాబ్ కింగ్స్‌లోని ప్రతి ఆటగాడికీ, సపోర్ట్ టీమ్‌కు చాలా ధన్యవాదాలు. అన్నిటికంటే ముఖ్యంగా మా షేర్ స్కాడ్ – మా అభిమానులకు హృదయపూర్వక ధన్యవాదాలు. కప్ గెలవడానికి మేము తిరిగి వస్తామని హామీ ఇస్తున్నాను. వచ్చే ఏడాది కలుద్దాం!’ అంటూ ముగించింది. తాజాగా ముగిసిన ‘ఐపీఎల్-2025’లో.. మెరుగైన ప్రదర్శన చేసింది పంజాబ్ జట్టు. గ్రూప్ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. ఫైనల్లో ఆర్సీబీ చేతిలో ఓడి.. త్రుటిలో కప్పును చేజార్చుకుంది.