చలినుంచి ఉపశమనం పొందడానికి చాలామంది రూమ్ హీటర్‌ను ఆశ్రయిస్తారు. దీనినుంచి వచ్చే వేడిగాలితో.. వెచ్చని అనుభూతిని పొందుతారు. అయితే, ఈ పరికరాన్ని సరిగ్గా నిర్వహించకుంటే.. కొన్నిసార్లు ప్రాణాంతకంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రూమ్ హీటర్ వాడకంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.
రూమ్ హీటర్ గదిలోని గాలిని వేడిచేసే క్రమంలో.. ఆక్సిజన్ స్థాయులు తగ్గుతాయి. తలుపులు, కిటికీలు మూసి ఉండే గదిలో ఈ హీటర్ పెడితే.. మనిషికి కావాల్సినంత ఆక్సిజన్ అందదు. దాంతో, తలనొప్పి, మైకం, అలసట వంటి సమస్యలు ఎదురవుతాయి.
గాలిలో తేమ ఎక్కువగా తగ్గితే.. కళ్లపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కళ్లు పొడిబారడం, దురద, మంట, కళ్లనుంచి నీరు కారడం లాంటి ఇబ్బందులు చుట్టుముడతాయి. ఇక కొందరిలో జుట్టు కూడా పొడిబారి బలహీనంగా తయారవుతుంది. చుండ్రు, జుట్టు రాలిపోడం, మాడుపై దురద లాంటి సమస్యలు వస్తాయి.
కొన్నిరకాల హీటర్ల నుంచి ప్రమాదకరమైన కార్బన్ మోనాక్సైడ్ వాయువు విడుదల అవుతుంది. దీనిని ఎక్కువగా పీలిస్తే.. తలనొప్పి, మైకం, ఊపిరాడకపోవడం, స్పృహ కోల్పోవడం లాంటివి సంభవించవచ్చు. శ్వాసకోశ బాధితులకు ప్రాణాంతకంగా మారవచ్చు.
పొడిగాలి వల్ల దగ్గు, జలుబు, సైనస్ లాంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా, పిల్లలు, పెద్దవాళ్లపై మరింత ప్రభావం చూపుతుంది. పిల్లలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతారు. పెద్దవాళ్లలో గుండె వేగంగా కొట్టుకోవడం, దగ్గు లాంటి సమస్యలు కనిపిస్తాయి.
గాలిలోని తేమను హీటర్ పూర్తిగా పీల్చేసి.. చర్మ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా, చర్మం పొడిబారడం, పెదవుల పగుళ్లు, దురద, అలర్జీలు దాడిచేస్తాయి. హీటర్లను దీర్ఘకాలంపాటు వాడితే.. చర్మం ముడతలు పడుతుంది. శరీరం కూడా డీహైడ్రేట్ అవుతుంది.
నాణ్యతలేని పరికరాలు ఓవర్‌హీట్ అవుతాయి. కొన్నిసార్లు అగ్నిప్రమాదాలకూ దారితీస్తాయి.
మంచి క్వాలిటీ, ఆటో కట్ ఆఫ్ లాంటి ఫీచర్లు ఉండే హీటర్లను కొనుగోలు చేయాలి. హీటర్ వాడే గదిలో కిటికీలను కొద్దిగా తెరిచి ఉంచాలి. దానివల్ల గాలి మార్పిడి జరుగుతుంది.
హీటర్‌ను రాత్రి మొత్తం ఆన్‌లో ఉంచడం మంచిదికాదు. నిద్రపోవడానికి 30 నిమిషాల ముందు ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఇక ఒక గిన్నెలో నీళ్లు పోసి.. గదిలో ఉంచితే, తేమ పెరుగుతుంది.
హీటర్లను మంచం నుంచి కనీసం 4 నుంచి 5 అడుగుల దూరంలో ఉంచాలి. అప్పుడే.. వేడిగాలి శరీరంపై పడకుండా ఉంటుంది.
హీటర్లను దుస్తులు, చెక్క వస్తువులు, మండే పదార్థాలకు దూరంగా ఉంచాలి. లేకుంటే, అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది.