మన సనాతన వేదాంత పరిభాషలో ‘ప్రవృత్తి’, ‘నివృత్తి’ అనే పదాలకు విశేష ప్రాధాన్యముంది. ‘ప్రవృత్తి’ అంటే మనసును బాహ్యప్రపంచం వైపునకు మరల్చడం. బహిర్ముఖమై వివిధ కర్మల్ని నిర్వర్తించటం. ప్రపంచంలో కార్యనిర్వహణ ధర్మాన్ని నెరవేర్చటంలో ఇది అత్యవసరం కూడా! పనిలో నైపుణ్యం ‘ప్రవృత్తి’ వల్లే సాధ్యపడుతుంది. జీవితంలో ఒకానొక అంకం వరకు మనిషి అభ్యుదయం వైపు పయనించటానికి ‘ప్రవృత్తి’ ప్రధాన సాధనం. ఇక రెండోది ‘నివృత్తి ధర్మం’.
ఇది తాబేలు కాళ్లను లోనికి మడుచుకోవటం లాంటిది. అంటే మనలోకి మనం చూసుకోవటం, మనలోకి మనం ప్రయాణం చేయటం నివృత్తి. ఇలా ‘అంతర్ముఖులం’ కావటం కూడా కర్మకు మూలధారమే! బాహ్యకర్తవ్య నిర్వహణ చేయటమే కాక, అనివార్యమైన పరిస్థితుల్లో ప్రశాంతంగా తనలో తాను అంతర్లీనం కావటం అలవరచుకోవాలి. ఇలా ‘ప్రవృత్తి’, ‘నివృత్తి’ పడుగుపేకల్లా అల్లుకున్న జీవితమే సంపూర్ణ జీవనం. ‘ద్వివిధో హి వేదోక్తో ధర్మః ప్రవృత్తి నివృత్తి లక్షణః, చ జగతః స్థితి కారణం’ అని చెబుతున్నది సనాతన ధర్మం. అంటే ప్రవృత్తి, నివృత్తి ధర్మాలను సమన్వయ పరిచినప్పుడే జగత్తు సజావుగా ముందుకు సాగుతుంది.
– మనోజ్ఞ