సోని లివ్: స్ట్రీమింగ్ అవుతున్నది
తారాగణం: బసిల్ జోసెఫ్, సౌబిన్ షాహిర్, చాందినీ శ్రీధరన్, చంబన్ వినోద్ జోస్ తదితరులు, దర్శకత్వం: శ్రీరాజ్ శ్రీనివాసన్
కొత్తదనాన్ని ప్రోత్సహించడంలో మలయాళ చిత్రసీమ ఎప్పుడూ ముందుంటుంది. హారర్ జానర్‌కు కామెడీని టచ్ చేస్తూ.. సస్పెన్స్ థ్రిల్లర్స్‌కు సెంటిమెంట్‌ను జోడిస్తూ.. ‘కాక్టెయిల్’ చిత్రాలను నిర్మిస్తున్నది. అలాంటి ఓ కాక్టెయిల్ చిత్రమే.. ప్రవింకూడు షప్పు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌కు బ్లాక్ కామెడీని మిక్స్ చేస్తూ.. ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు శ్రీరాజ్ శ్రీనివాసన్. అడవి సమీపంలోని పల్లె నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. గ్రామంలో బాబు (శివజిత్) కల్లు దుకాణం నడుపుతుంటాడు.
మంచి కండపుష్టితో ధైర్యంగా ఉండే బాబుకు.. చుట్టుపక్కల వాళ్లంతా భయపడుతుంటారు. ఒకరోజు బాబు దుకాణానికి 11మంది కస్టమర్లు వచ్చి కల్లు తాగుతారు. భారీ వర్షం కురవడంతో రాత్రికి ఇంటికి వెళ్లే అవకాశం లేక.. అక్కడే పేకాడుతూ ఉంటారు. తెల్లవారిన తర్వాత చూస్తే.. అదే దుకాణంలో బాబు ‘ఉరితాడు’కి వేలాడుతూ కనిపిస్తాడు. మరోవైపు సంతోష్ (బసిల్ జోసెఫ్) నిజాయతీపరుడైన పోలీస్ అధికారి. టేకప్ చేసిన కేసులన్నిటినీ పది రోజుల్లోనే పరిష్కరిస్తుంటాడు. దాంతో బాబు కేసును ఉన్నతాధికారులు సంతోష్‌కు అప్పగిస్తారు. రంగంలోకి దిగిన సంతోష్.. అది ఆత్మహత్య కాదనీ, అతణ్ని ఎవరో హత్య చేసి, ఆత్మహత్యలా చిత్రీకరించడానికి ప్రయత్నించారని కనిపెడతాడు.
కల్లు దుకాణంలో పనిచేసే కన్నన్ (సౌబిన్ షాహిర్), అదే గ్రామంలో ఉండే సుని (చెంబన్ వినోద్ జోస్) ఈ హత్య చేసి ఉంటారని అనుమానిస్తాడు. ఆ కోణంలోనే ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు. మరి.. అన్ని కేసుల మాదిరిగానే బాబు హత్య కేసునూ సంతోష్ పది రోజుల్లోనే పరిష్కరించాడా? తన ట్రాక్ రికార్డును కొనసాగించాడా? కన్నన్.. సునిపై సంతోష్‌కు ఎందుకు అనుమానం వస్తుంది? మెరిండా (చాందినీ శ్రీధరన్) ఎవరు? ఆమెకూ బాబుకూ ఉన్న సంబంధం ఏమిటి? ఈ కేసు విషయంలో సంతోష్ ప్రత్యేక శ్రద్ధ పెట్టడానికి వేరే ఏదైనా కారణం ఉందా? అనే విషయాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తాయి.