జియో హాట్స్టార్: స్ట్రీమింగ్ అవుతున్నది
తారాగణం: నివిన్ పౌలీ, నిషాంత్ సాగర్,
బాలచంద్ర మీనన్, సబితా ఆనంద్ తదితరులు
దర్శకత్వం: ఉన్ని కృష్ణన్
సినిమాలు-రాజకీయాలు.. ఈ రెండిటిదీ విడదీయరాని బంధం. సినిమాల్లో హీరోలుగా చేసి.. రాజకీయాలను శాసించిన వారు ఉన్నారు. రాజకీయ నేపథ్యంలో సినిమాలు తీసి.. చిత్ర పరిశ్రమను ఏలినవారూ కనిపిస్తారు. అందుకే, పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో ఎన్నో చిత్రాలు రూపొందాయి. తెరపై రాజకీయ డ్రామాలను రక్తికట్టించడంతోపాటు బాక్సాఫీస్ దగ్గర బాగానే కలెక్షన్స్ సాధించాయి. ఈ నేపథ్యంలో మలయాళంలో వచ్చిన పొలికల్ డ్రామా.. ప్రతిఛాయ. కేరళలో మంచి వసూళ్లను సాధించిన ఈ చిత్రం.. ఇటీవలే ‘జియో హాట్ స్టార్’ వేదికగా తెలుగులోనూ స్ట్రీమింగ్కు వచ్చింది. సినీ ప్రేక్షకులతోపాటు రాజకీయ విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నది. కథలోకి ఎంట్రీ ఇస్తే.. కేరళ ముఖ్యమంత్రి వర్గీస్ (బాలచంద్ర మేనన్)పై ఎన్నో ఆరోపణలు వస్తుంటాయి. అయినా ప్రతిపక్షాలకు చిక్కకుండా.. తెలివిగా చక్రం తిప్పుతుంటాడు. ఈయన పెద్ద కొడుకు ఎంపీ. తండ్రి తర్వాత ముఖ్యమంత్రి స్థానం తనదే అనే ఆశతో ఉంటాడు. చిన్నకొడుకు జాన్ (నివిన్ పౌలీ).. రాజకీయాలకు దూరంగా స్టార్టప్ ప్రారంభించి విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేస్తుంటాడు.
సరిగ్గా అదే సమయంలో ఓ యువతి మీడియా ముందుకు వచ్చి.. వర్గీస్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తుంది. సాయం కోరిన తనను ముఖ్యమంత్రి లైంగికంగా వేధించాడని చెబుతుంది. దాంతో రాష్ట్రంలో గందరగోళ వాతావరణం ఏర్పడి, వర్గీస్ తన పదవికి రాజీనామా చేస్తాడు. తీవ్రమైన మనోవ్యధకు గురై.. అదేరోజు గుండెపోటుతో మరణిస్తాడు. ఈ నేపథ్యంలో అనూహ్య పరిణామాల మధ్య.. జాన్ వర్గీస్ ముఖ్యమంత్రి అవుతాడు. తన తండ్రి గురించి అందరూ చెడుగా చెప్పుకోవడం, దానిని అనుకూలంగా మార్చుకుంటూ కొందరు సీఎం సీటు కోసం ప్రయత్నించడం లాంటివన్నీ జాన్ గమనిస్తాడు. ఈ క్రమంలో జాన్ ఎలా స్పందిస్తాడు? వర్గీస్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు నిజమా? అబద్ధమా? ఆరోపణలు చేసిన నిషా ఎవరు? ఆమె వెనక ఎవరున్నారు? అసలు రాజకీయాల్లో వర్గీస్ కుటుంబానికి శత్రువులు ఎవరు? తెరవెనుక ఎలాంటి కుట్రలు చేశారు? చివరికి ఏమైంది? అనేది తెలవాలంటే.. ప్రతిఛాయను చూడాల్సిందే!