సోషల్ మీడియా వేదికగా ఎన్నో చాలెంజ్‌లు వచ్చాయి. వాటిలో కొన్ని ఆన్లైన్ ప్రపంచాన్ని ఓ ఊపు ఊపాయి కూడా. ఆ జాబితాలో కొత్తగా వచ్చిన ట్రెండ్ #photodump. ఈ ఫొటో డంప్‌ను సెలబ్రిటీలు మొదలు సినీ అభిమానుల వరకూ అంతా ఫాలో అవుతున్నారు. ఒకేసారి బోలెడన్ని ఫొటోలు అప్లోడ్ చేసి, సింపుల్‌గా ‘ఫొటోడంప్’ అనే హ్యాష్‌ట్యాగ్ ఇచ్చేస్తున్నారు. ఇలా ఒకరిని చూసి మరొకరు కొత్త ట్రెండ్‌ను ప్రమోట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ హ్యాష్‌ట్యాగ్‌కు పది లక్షలకుపైగా పోస్టులున్నాయి. బాలీవుడ్లో ప్రియాంక చోప్రా, సోనమ్ కపూర్ తమ ఇన్‌స్టా, ఫేస్బుక్, ట్విటర్ ఖాతాల్లో ఫొటోలు డంప్ చేస్తున్నారు. టాలీవుడ్ నుంచి సమంత, రష్మికా మందన్న ఇప్పటికే గంపెడు డంప్ చేశారు. ‘ఏమిటీ ఫొటోడంప్?’ అనే కదా మీ అనుమానం.
ఒకదానితో ఒకటి సంబంధం లేని ఫొటోలను.. నచ్చినవీ, నచ్చనివీ.. టోకుగా ఇన్‌స్టా, ఫేస్బుక్, ట్విటర్ ఖాతాల్లో పోస్టు చేయడం అన్నమాట. ఓపికుంటే క్యాప్షన్లు రాయవచ్చు. లేకుంటే, నచ్చిన ఫొటోలను యథాతథంగా డంప్ చేయవచ్చు. లాక్డౌన్లో స్నేహితులకు దూరంగా ఉన్న చాలామంది, ఇలా ఫొటోలు డంప్ చేసి పాత
స్మృతులను నెమరేసుకుంటున్నారు.