అయినవారింట పెండ్లి. ఇంటిల్లిపాదీ వెళ్లాలి. కానీ, ఇంట్లో జిమ్మిగాడు ఒక్కడే ఎలా ఉంటాడు పాపం. అలా అని, జిమ్మి ఆ ఇంట్లో మనిషికాదు. పెంపుడు శునకం. పక్కింటివాళ్లకు అప్పగించి వెళ్లామా.. దానికి పూనకం వచ్చేస్తుంది. మరేం చేయాలి? ఇప్పుడు ఆ ఇంట్లోవాళ్లకే కాదు, ఏ పెంపుడు జంతుప్రేమికులకూ ఇబ్బంది లేదు. హైదరాబాద్ లాంటి మహానగరాల్లో కొత్త కొత్త కాన్సెప్ట్‌లతో పెట్ కేఫ్‌లు పురుడు పోసుకుంటున్నాయి. జంతువులు విహరించడానికి పెద్ద లాన్, జలకాలాటలకు స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేస్తున్నాయి. పెట్స్కోసం పర్సనల్ క్యాబిన్స్ కూడా ఉన్నాయి. అంతేకాదు, వాటి యజమానులు కోరిన విధంగా కస్టమైజ్డ్ ఆహారం అందిస్తున్నాయి. బంజారాహిల్స్, గచ్చిబౌలి లాంటి ప్రాంతాల్లో ఆదరణ మరీ ఎక్కువ. శునకాలు, పిల్లులు, కుందేళ్లు, కోళ్లను కూడా ఇక్కడ ఉంచొచ్చు. రోజుల నుంచి ఏండ్ల వరకూ పెంపుడు జంతువులను ధైర్యంగా వదిలిపెట్టొచ్చు. వాటి పూర్తి సంరక్షణ బాధ్యత కేర్ సెంటర్ నిర్వాహకులదే. ‘కొందరు విదేశాలకు వెళ్తూ కూడా పెట్స్‌ను ఇక్కడ ఉంచుతుంటారు. వాటి ఆలనాపాలనా మేమే చూసుకుంటాం. తరచూ యజమానులకు వీడియోకాల్ చేసి వాటి క్షేమ సమాచారాలు నేరుగా చూపిస్తాం’ అని చెబుతున్నారు పా కింగ్డమ్ నిర్వాహకులు. సాటి జంతువుల మధ్య ఆటల్లో పడిపోయిన ఆ మూగజీవాలకు యజమానికి దూరంగా ఉన్నామన్న భావనే కలగదని భరోసా ఇస్తున్నారు.