నలభై ఏండ్లలోపు మహిళలను తుంటి ఎముక సమస్యలు ఎక్కువగా వేధిస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ ఇబ్బందికి మూలాలను వెతికే పనిలో పడ్డారు శాస్త్రవేత్తలు. ముందుగా కొందరు స్త్రీల భోజనశైలిని పరిశీలించారు.
నిత్యం మాంసం తినేవారు, అప్పుడప్పుడు తినేవారు, చేపలను మాత్రమే తినేవారు, శుద్ధ శాకాహారులు.. ఇలా నాలుగు గ్రూపులుగా విభజించారు. మొత్తం 26,318 మందిని పరీక్షిస్తే.. అందులో 822 మంది మహిళలు తుంటి ఎముక ఫ్రాక్చర్‌కు గురైనట్లు గుర్తించారు. పోషక విలువల లోపమే ఇందుకు ప్రధాన కారణమని తెలిసింది. ధూమపానం చేసేవారు, వయసు పైబడిన వారి తర్వాతి స్థానంలో శాకాహారులే ఉన్నారు.
మాంసాహారులతో పోలిస్తే.. శాకాహారుల్లో తుంటి సమస్య ఉన్నవారు 33 శాతం ఎక్కువ. మాంసాహారంలో ప్రొటీన్, క్యాల్షియం, విటమిన్-డి, విటమిన్ బి12తోపాటు.. ఎముక, కండరాలకు మంచిచేసే సూక్ష్మ పోషకాలు అధికంగా ఉంటాయి. శాకాహారుల్లో వీటి లోపం కనిపించింది. ఈ పరిమితులన్నీ ఫ్రాక్చర్‌ను ప్రేరేపిస్తాయని నిర్ధారించారు నిపుణులు. ఈ అధ్యయనం బీఎంసీ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురితమైంది.