వేదిక.. ఫ్రాన్స్. వేడుక.. కేన్స్ ఫిలిం ఫెస్టివల్. ప్రధాన పోటీ విభాగంలో ఒక చిత్ర ప్రదర్శన జరిగింది. అక్కడివాళ్లు ఎనిమిది నిమిషాలపాటు నిలబడి చప్పట్లు కొట్టారు. అత్యద్భుతం.. అసామాన్యం… అంటూ విమర్శకుల ప్రశంసలు వినిపించాయి. కేన్స్ ఫెస్టివల్‌లోని రెండో అతిపెద్ద అవార్డు ‘గ్రాండ్ ప్రిక్స్’ను గెలుచుకుందా చిత్రం. అవును, నిజంగా అసామాన్యమే. ఎందుకంటే, భారత్‌కు ఈ కేటగిరీలో వచ్చిన తొలి పురస్కారం అది. దాని వెనుక ఉన్నది ఓ మహిళ. సినిమాలోని ప్రధాన పాత్రలూ మహిళలవే. మనవాళ్లు కేన్స్ క్వీన్స్ అయిన ఈ సందర్భంగా… ఆ చిత్రం గురించీ, దర్శకురాలు పాయల్ కపాడియా గురించిన సంగతులు…
‘ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్’… సినిమా పేరు ఇప్పుడు భారతదేశం మొత్తం మారు మోగుతున్నది. విభిన్న నేపథ్యాల నుంచి ముంబయి వచ్చిన ముగ్గురు నర్సుల కథ ఇది. వివిధ కారణాల వల్ల నగరానికి చేరిన వీళ్లంతా ఒకే ఆసుపత్రిలో పనిచేస్తుంటారు. ఒక చిన్నగదిలో అద్దెకు ఉంటారు. వీళ్లలో ఒక్కొక్కరిదీ ఒక్కో సమస్య. ఓపక్క వాళ్ల జీవితాలను ఉన్నది ఉన్నట్టు చూపిస్తూనే, ఆ సమస్యలకు మెరుగైన పరిష్కార మార్గాలను మరోవైపు సూచిస్తున్నట్టుగా సాగుతుందీ కథ. ఇందులో దివ్యప్రభ, కని కుశ్రుతి, ఛాయా కదం… ప్రధాన పాత్రల్లో నటించారు. దర్శకురాలు పాయల్ కపాడియాతో కలిసి వీళ్లూ కేన్స్ వేదిక మీద పురస్కారం అందుకున్నారు. కేన్స్ ప్రధాన పోటీ విభాగంలో ముప్పయ్యేండ్ల తర్వాత ప్రదర్శనకు ఎంపికైన మరో భారతీయ చిత్రం ఇది. ఇక, ఈ ఉత్సవంలోని రెండో అతిపెద్ద అవార్డునూ అందుకోవడంతో మనవాళ్ల ఉత్సాహం రెట్టింపయ్యింది. దీంతో పాయల్ కపాడియాను దేశం ఆకాశానికెత్తుతున్నది. ఈ ఒక్కటనే కాదు… పాయల్ తీసిన సినిమాలన్నిటిలోనూ మహిళలకు సంబంధించిన ప్రత్యేక కోణం ఉంటుంది. ఆమె ఎదిగిన పరిసరాలు, ఎదురైన అనుభవాలే ఇందుకు కారణంగా కనిపిస్తాయి.
పాయల్ తల్లి ముంబయికి చెందిన ప్రముఖ చిత్రకారిణి నళిని మలాని. ఆమె పెయింటర్ మాత్రమే కాదు తొలితరం వీడియో ఆర్టిస్ట్ కూడా. ఆమె గీసే చిత్రాల్లో ఎక్కువగా మహిళలకు సంబంధించిన రకరకాల అంశాలు కనిపిస్తూ ఉంటాయి. సొంతూరు ముంబయి అయినా పాయల్ చదువుకున్నది మాత్రం ఆంధ్రప్రదేశ్ రుషి వ్యాలీ స్కూల్లో. అనేక ఆధునిక బోధనా పద్ధతులకు, ప్రయోగాలకు ఆ పాఠశాల పెట్టింది పేరు. అక్కడే తను ప్రయోగాత్మక చిత్రాల దర్శకులు రిత్విక్ ఘటక్, ఆండ్రీ తర్కోవ్స్కీలాంటి వాళ్లను కలుసుకుంది. పాఠశాల ఫిలిం క్లబ్లో పాయల్ సభ్యురాలు. ఆ తర్వాత ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి దర్శకత్వంలో పట్టా అందుకుంది. అడ్వర్టయిజింగ్ రంగంలోనూ కొన్నాళ్లు పనిచేసింది. అయితే చిన్ననాటి నుంచి సినిమాల మీద ఉన్న ఆసక్తి కారణంగా దర్శకత్వం వైపే వచ్చింది.
పాయల్ ఏ చిత్రం తీసినా, అందులో ఏ అంశం ప్రస్తావించినా చర్చంతా మహిళల చుట్టూనే తిరుగుతుంది. ఆమె కథకు హీరో ఎప్పుడూ మహిళే. ‘ఆఫ్టర్నూన్ క్లౌడ్స్’ పేరిట ఆమె రాసి, తీసిన తొలి చిత్రంలో ముంబయిలోని ఒక అపార్ట్మెంట్లో తన పనిమనిషితో కలిసి జీవించే 70 ఏళ్ల వితంతువు కథను చూపించింది. అందులో ఆమె ఒంటరితనాన్ని సృజనాత్మక ధోరణిలో చిత్రీకరించింది. 2017లో భారత్ నుంచి కేన్స్‌లో ప్రదర్శనకు ఎంపికైన ఏకైక చిత్రం ఇది. తర్వాత ఆమె తీసిన ‘ద లాస్ట్ మ్యాంగో బిఫోర్ ద మాన్సూన్’లో… భర్తను కోల్పోయి, తాను ఉంటున్న అడవిని వదిలి నగరానికి చేరి… భర్త గురించీ, అడవి గురించీ తల్లడిల్లే మహిళ కథను కళ్లకు కడుతుంది. ఫిలిం ఇన్స్టిట్యూట్లో చదువుకునే ఒక అమ్మాయి ప్రేమను కులం ఎలా ప్రభావితం చేసిందన్న అంశాన్ని ‘ఎ నైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్’లో చూపించింది పాయల్. 2021 కేన్స్‌లో బెస్ట్ డాక్యుమెంటరీ ఫిలింగా ఇది ‘గోల్డెన్ ఐ’ అవార్డును అందుకుంది. ఇలా… చిత్రం ఏదైనా, నేపథ్యం ఏమైనా పాయల్ కథలో మాత్రం ఎప్పుడూ మహిళే హీరో. సినిమా అవార్డు అందుకున్న సందర్భంగా ఆడవాళ్ల జీవితం గురించి తన మనసులో మాటను పంచుకున్నదామె.
‘నేను చాలామంది ఆడవాళ్లు ఉండే ఇంట్లో పెరిగాను. కాబట్టి వాళ్ల మధ్య స్నేహం గురించి ఎప్పుడూ ఆలోచిస్తాను. అయితే భారత్‌లో అని కాదు, చాలా చోట్ల స్త్రీలు వాళ్ల పరిస్థితులను, పరిధిని దాటి ఆలోచించే ప్రయత్నం చేయరు. అంతకన్నా భిన్నంగా ఎలా బతకవచ్చో ఆలోచించరు. కాబట్టి వాళ్లు ఇలా కాకుండా ఎలా జీవించవచ్చో ఈ సినిమా ద్వారా చెప్పాలనుకున్నా. ఇందులోని కథలు నేను చూసిన కొంతమంది జీవితాలకు సంబంధించినవి. అందులో కొన్నిసార్లు నేను కూడా ఉండొచ్చు. నా వరకూ, సినిమా అంటే మనల్ని మనం అర్థం చేసుకోవడం. మన చుట్టూ ఉన్న పరిసరాలను, పరిస్థితులను అవగాహన చేసుకోవడం’ అంటూ ముగించింది. నిజమే, స్త్రీ అనుకుంటే ఏదైనా సాధిస్తుందని చెప్పడానికి కేన్స్ అవార్డుతో నిలబడ్డ ఆమె ఫొటో నిలువెత్తు నిదర్శనం కదూ!