ఒక రాజు మానసిక అశాంతికి గురయ్యాడు. తన సమస్యను ఎవరికైనా చెప్పుకోవాలని భావించాడు. ‘విషయాన్ని అర్థం చేసుకుని మంచి సలహా ఇచ్చే శ్రేయోభిలాషి ఎవరు ఉన్నారా…’ అని ఆలోచనలో పడ్డాడు. పరిష్కారం దొరకలేదు. ‘మనకు నిపుణులైన మంత్రి వర్గం ఉంది కదా! అసలు మనిషికి నిజమైన శ్రేయోభిలాషి ఎవరో? వారిని అడిగి తెలుసుకుందాం’ అని హుటాహుటిన మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశాడు రాజు.
‘ఎలాంటి పరిస్థితిల్లో అయినా మనల్ని, మన సమస్యల్ని అర్థం చేసుకుని మంచికోరే వారు ఎవరు?’ అని వారిని ప్రశ్నించాడు. మంత్రివర్గంలో కొందరు ‘భార్యకు భర్త, భర్తకు భార్య’ అని చెప్పారు. మరికొందరు ‘తోడబుట్టిన వారని, గురువులని, దేవతలని …’ ఇలా రకరకాల సమాధానాలు చెప్పారు.
ఏదీ రాజుకు తృప్తినివ్వలేదు. సమావేశం ముగించి తన కోటలోకి వెళ్లాడు. భోజనం చేస్తుండగా రాజు ముభావంగా ఉండటం చూసి ‘ఎందుకలా ఉన్నారు?’ అని ప్రశ్నించింది రాణి. విషయమంతా వివరించాడు రాజు. రాణి చిరునవ్వుతో ‘ఈ ప్రపంచంలో తల్లిదండ్రులను మించిన శ్రేయోభిలాషులు మరెవరూ ఉండరు. కలలో కూడా పిల్లల గురించి చెడుగా ఆలోచించరు. వారి ఆయుష్షు కూడా పోసుకొని తమ బిడ్డలు చల్లగా ఉండాలని కోరుకుంటారు. అంతేకాదు, మనల్ని వాళ్లంత దగ్గరగా చూసిన వాళ్లూ ఎవరూ ఉండరు కదా! కాబట్టి నిజమైన శ్రేయోభిలాషులు తల్లిదండ్రులే! వారి తర్వాతే మరెవరైనా!’ అని పలికింది. ఆ సమాధానంతో రాజు సంతృప్తి చెందాడు. భోజనం ముగించుకొని తల్లిదండ్రులు ఉన్న మందిరం వైపు అడుగులు వేశాడు.