కొందరు తల్లిదండ్రులు.. పిల్లల విషయంలో ‘అతి’గా ప్రవర్తిస్తుంటారు. అతి గారాబం, అతిగా ప్రేమను పంచడం, అతి జాగ్రత్తగా చూసుకోవడం చేస్తుంటారు. ఇవన్నీ ఇప్పుడు సౌకర్యంగా అనిపించినా.. భవిష్యత్తులో పిల్లలు ఇబ్బందులు పడతారని మానసిక నిపుణులు అంటున్నారు. అలాకాకుండా ఉండాలంటే.. కొన్ని సలహాలు-సూచనలు పాటించాలని చెబుతున్నారు.
కొందరు తల్లిదండ్రులు పిల్లలకు ఏమాత్రం అసౌకర్యాన్ని కలగనివ్వరు. చిన్నచిన్న పనులు కూడా తామే చేసిపెడుతుంటారు. దీనివల్ల పిల్లలు పెద్దయ్యాక.. అన్నిటికీ మీపైనే ఆధారపడుతుంటారు. భవిష్యత్తులో సవాళ్లను స్వీకరించడంలో ఇబ్బంది పడతారు.
ఇంకొంతమంది తల్లిదండ్రులు తమకు ఎదురయ్యే సమస్యలు, భయాలను కూడా పిల్లల ఎదుటే ప్రదర్శిస్తుంటారు. దాంతో.. పిల్లల్లోనూ భయాందోళనలు పెరుగుతాయి.
మరికొందరు తల్లిదండ్రులు పిల్లలు చేసే ప్రతి పనిలోనూ తప్పులు వెతుకుతుంటారు. వాటిని అతిగా సరిదిద్దడం కూడా.. పిల్లల ఆలోచనా దృక్పథాన్ని మారుస్తుంది. తాము అన్నిట్లోనూ ఏదో ఒక తప్పు చేస్తున్నామనే భావనలో మునిగిపోతారు.
ఇక చదువులు, ఆటలే కాదు.. అన్నిట్లోనూ తమ పిల్లలే ‘ఫస్ట్’ రావాలని అనుకుంటారు. అందుకు తగ్గట్టుగా ప్రోత్సహించడంతోపాటు అప్పుడప్పుడూ ఒత్తిడి కూడా తీసుకొస్తుంటారు. దీనివల్ల వారిని వైఫల్య భయం వెంటాడుతుంది. ఇది వారి సామర్థ్యంపైనా ప్రభావం చూపుతుంది.
కొత్త విషయాలను ప్రయత్నించేటప్పుడు చిన్నచిన్న తప్పులు దొర్లడం మామూలే! కానీ, కొందరు తల్లిదండ్రులు వాటిని సీరియస్గా తీసుకుంటారు. పిల్లల తప్పులపై అతిగా స్పందిస్తుంటారు. అరవడం, కొట్టడం లాంటివి చేస్తుంటారు. దీనివల్ల పిల్లలు ఎక్కువ ఆందోళనకు గురవుతారు. కొత్త విషయాలను ప్రయత్నించడానికి భయపడతారు.