పొద్దున లేస్తే.. టీ! మధ్యాహ్నానికి.. మరో‘టీ’! సాయంత్రానికి.. ఇంకో‘టీ’! ఇలా.. రోజులో కనీసం నాలుగైదు సార్లు వేడివేడి ‘చాయ్’ తాగేస్తుంటారు చాలామంది. ఇంట్లోవాళ్లు కూడా.. అడిగిందే తడవుగా చిక్కని ఉష్ణోదకాన్ని చేసిపెడతారు. అంతేకాదు, ‘టీ.. ఎంత ఎక్కువ సమయం మరిగితే అంత రుచి’ అనుకుంటారు. కానీ, ఇలా ఎక్కువసేపు మరిగించిన చాయ్ తాగడం ఆరోగ్యానికి హానికరం అని చెబుతున్నారు నిపుణులు.
చాయ్ ఎక్కువసేపు మరిగితే.. దాన్ని తాగడం వల్ల శరీరానికి లభించే శక్తి నశిస్తుంది. ‘టీ’లో టానిన్లు అనే రసాయనాలు ఉంటాయి. ఎక్కువసేపు మరిగించడం వల్ల వాటి సాంద్రత పెరిగిపోతుంది. శరీరంలోకి అధిక మొత్తంలో చేరే టానిన్లు.. కడుపునొప్పి, వికారం, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలకు కారణం అవుతాయి.
అధికంగా మరిగించడం వల్ల టీలో ఉండే కెఫీన్.. చేదుగా మారుతుంది. అంతేకాదు పాలలో ఉండే కాల్షియం, విటమిన్లు, విటమిన్ బి, బి12, సి వంటి పోషకాలు కూడా నశిస్తాయి. టీలో ఉండే యాంటి ఆక్సిడెంట్లు కూడా ఉనికి కోల్పోతాయి. అందుకే.. పాలతో టీ చేసుకునేవారు 3 నుంచి 5 నిమిషాల్లోపే వడగట్టేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతకన్నా ఎక్కువసేపు మరిగిస్తే.. రుచి సంగతి ఏమో కానీ, ఆరోగ్యానికి చేటు తప్పదని హెచ్చరిస్తున్నారు.