అధిక బరువు అనేక అనర్థాలకు దారితీస్తుంది. దాదాపు 19 రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ విషయాన్ని తాజా అధ్యయనం ఒకటి బయటపెట్టింది. ‘నేచర్ మెటబాలిజం’ జర్నల్లో ప్రచురితమైన ఈ అధ్యయనం.. ఊబకాయ బాధితులను గట్టిగా హెచ్చరిస్తున్నది. ఇందులో భాగంగా, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని 15 లక్షలకు పైగా క్యాన్సర్ కేసులను పరిశీలించారు. లుకేమియా, బ్లాడర్ క్యాన్సర్, గ్లియోమా వంటి కొత్త రకాల క్యాన్సర్లతో స్థూలకాయానికి ఉన్న లింకులను గుర్తించారు. అలాగే, ఈ క్యాన్సర్ల ప్రభావం లింగభేదం, వారు నివసించే ప్రాంతాన్ని బట్టి మారుతుందని కూడా కనుగొన్నారు. కాబట్టి, శరీరంలో అదనపు కొవ్వు.. కేవలం అందానికి సంబంధించింది మాత్రమే కాదనీ, అంతకు మించిన తీవ్రమైన ఆరోగ్య సమస్యకు దారితీస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
అదనపు కొవ్వు శరీరంలో ఒక క్రియాశీల అవయవంలా పనిచేస్తుంది. ఇన్ఫ్లమేటరీని కలిగించే రసాయనాలను విడుదల చేస్తుంది. హార్మోన్ల స్థాయులను మారుస్తుంది. ఇన్సులిన్ జీవక్రియను ప్రభావితం చేస్తుంది. ఈ మార్పులన్నీ కాలక్రమేణా శరీరంలో క్యాన్సర్ పెరగడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత వచ్చే హార్మోన్ల మార్పులు ఇందులో కీలక పాత్ర పోషిస్తాయట. మెనోపాజ్ తర్వాత, శరీరంలోని కొవ్వు కణజాలమే ఈస్ట్రోజెన్ హార్మోన్ ఉత్పత్తికి ప్రధాన వనరుగా మారుతుంది.
ఇది రొమ్ము, అండాశయ క్యాన్సర్ల వంటి హార్మోన్-సెన్సిటివ్ క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతుందని వారు వెల్లడించారు. అందుకే, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి మంచి జీవనశైలిని అలవర్చుకోవాలని సిఫార్సు చేస్తున్నారు. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలతోపాటు లీన్ ప్రొటీన్లు ఎక్కువగా ఉండే సమతుల ఆహారం తీసుకోవాలని అంటున్నారు. రెగ్యులర్ వ్యాయామం, అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్, చక్కెర పానీయాలను పరిమితం చేయడం, పొగాకు అలవాట్లకు దూరంగా ఉండటం అలవాటు చేసుకోవాలని సలహా ఇస్తున్నారు. ఇలా, జీవనశైలిలో చేసుకునే చిన్నపాటి మార్పులు కూడా దీర్ఘకాలంలో ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు. మంచి జీవనశైలితో జీవక్రియల ఆరోగ్యం మెరుగవుతుంది. దీర్ఘకాలంలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. కాబట్టి, స్థూలకాయం తీవ్రంగా మారే వరకు వేచి చూడకూడదని సూచిస్తున్నారు.