Inspiration | కొన్ని రంగాల్లో ఇంకా పురుషాధిక్యమే కనిపిస్తున్నది. అక్కడ నెగ్గుకురావడం మహిళలకు అంత సులువు కాదనే అభిప్రాయం ఇందుకు కారణం కావచ్చు. అలాంటిదే జంతుశాస్త్రం కూడా. బెంగాలీ మహిళ ధృతి బెనర్జీకి మొదటినుంచీ జువాలజీ అంటే ఇష్టం. ఆ మక్కువతోనే ఉన్నత చదువులు చదివారు. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో చేరారు. ఆ సంస్థ డైరెక్టర్‌గా పదోన్నతి పొందారు. మన దేశంలో జీవశాస్త్రం పట్ల అవగాహన, కొత్త జాతులను కనుగొనే ప్రయత్నం చాలా తక్కువ.
ఎప్పుడో బ్రిటిష్ హయాంలో గుర్తించిన జీవజాతులే ఇప్పటికీ ప్రామాణికం. ఈ పద్ధతి మార్చాలనుకున్నారు ధృతి. ఈ రంగంలో పరిశోధన కోసం ప్రభుత్వం నుంచి తగినన్ని నిధులు రాబట్టగలిగారు. తన శాఖ ద్వారా ఎన్నో కొత్త జాతులు కనుగొన్నారు. తనే ఓ ఆరు అరుదైన జీవజాతులను గుర్తించారు. ధృతి నేతృత్వంలో దూకుడు పెంచిన జూలాజికల్ సర్వే, గత ఏడాది ఏకంగా నేషనల్ హిస్టరీ మ్యూజియం- లండన్‌తో పరిశోధనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ‘మనతో పనిచేసే వారిని గౌరవంగా చూసినప్పుడు.. నాయకత్వంలో అద్భుతాలు చేయగలం’ అని నమ్ముతారు ధృతి. అది నిజమని నిరూపిస్తున్నారు కూడా!