Navya Naveli Nanda | నవ్య నవేలి నంద.. కార్పొరేట్ రంగంతో పరిచయం లేనివారికైతే అమితాబ్ మనవరాలు, రాజ్‌కపూర్ మునిమనవరాలు. నవ్య గురించి తెలిసినవారికి మాత్రం, తను మంచి సమాజ సేవకురాలు. అంతేనా! ఎస్కార్ట్ సంస్థకు వారసురాలు. ఎనభై ఏళ్ల క్రితం స్థాపించిన ఎస్కార్ట్ కంపెనీ.. అప్పట్లో భారీ యంత్రాలను రూపొందించేది. కొన్నాళ్లకు జపాన్‌కు చెందిన కుబోటా సంస్థ.. ఎస్కార్ట్‌లో 50 శాతానికి పైగా షేర్లు కొనుగోలు చేసింది.
కంపెనీ యాజమాన్యం చేతులు మారినా, ఎస్కార్ట్ వ్యవస్థాపకులు మాత్రం తమ విలువల్ని అలాగే పదిలంగా ఉంచుకున్నారు. ఉద్యోగులకు, వినియోగదారులకు భారమయ్యే నిర్ణయం ఏదీ తీసుకోలేదు. వేల కోట్ల వారసత్వ సామ్రాజ్యంలో ఇప్పుడు నవ్య చేరారు. వ్యవసాయరంగానికి సంబంధించిన యంత్రాలను రూపొందించాలన్నది నవ్య లక్ష్యం. వ్యవసాయ రంగంలో మానవ వనరులు తగ్గిపోవడం, కూలిపనులకు తగిన రాబడి లేకపోవడంతో మున్ముందు యంత్రాలదే కీలకపాత్ర అని తన ఉద్దేశం. నాట్ల దగ్గర నుంచీ కోతల వరకూ అంచెలవారీగా వ్యవసాయ యంత్రాలను తయారు చేయించే ప్రణాళికతో ఉన్నారు. నవ్య లక్ష్యం నెరవేరి, అది రైతులకు అండగా మారితే… ఒకరి కూతురు, మనవరాలు, మునిమనవరాలి కంటే తన పేరుతోనే దేశం గుర్తించే రోజు వస్తుంది.