ప్రభుత్వ బడంటేనే చాలామందికి చిన్నచూపు. కానీ, అలాంటి పాఠశాల గతిని మార్చేసింది ఓ టీచరమ్మ. ఆమె తరగతి గదిలో చెప్పే పాఠాలు యూట్యూబ్‌లో సరిహద్దులు దాటాయి. గణితం అంటే భయపడే ఆ పిల్లలకు లెక్కలే ఆటగా మారాయి. కామారెడ్డి జిల్లా గాంధారిలోని మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాల (బాలికల)లో టీచర్‌గా పనిచేస్తున్న బొంపెల్లి భవాని వినూత్న బోధనతో పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారు. యూట్యూబ్‌లోనూ పాఠాలు వినిపిస్తున్న ఆమె ఈ ఏడాది జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికైంది. ఈ సందర్భంగా ఎంతోమందికి జీవితపాఠాలు బోధించిన ఈ టీచరమ్మ జిందగీతో పంచుకున్న బతుకు పాఠాలివి..
2006 డీఎస్సీలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సాధించిన భవాని గతంలో లింగంపేట మండలంలో పని చేశారు. ఎనిమిదేండ్ల క్రితం బదిలీపై గాంధారిలోని మండల పరిషత్ బాలికల ప్రాథమిక పాఠశాలకు వచ్చారు. ఒకప్పుడు కనీస సౌకర్యాలు కూడా లేని ఈ పాఠశాల రూపురేఖలు ఆమె రాకతో క్రమంగా మారిపోయాయి. బాలికల విద్యకు పెద్దపీట వేయాలనే ఆలోచనతో కొంగొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టారామె. మొదట్లో పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో పిల్లల సంఖ్య 50లోపే ఉండేది. పిల్లలను బడికి రప్పించేందుకు పాఠశాల గోడలపై వర్ణమాల, అంకెలు, విద్యకు సంబంధించిన బొమ్మలు వేయించారు. సర్కారు బడిని చక్కగా తీర్చిదిద్ది, బోధనా
విధానంతో, తల్లిదండ్రుల దృక్పథాన్ని మార్చేయడంతో విద్యార్థుల సంఖ్య క్రమంగా 150కి చేరింది. బోధనలోనూ తనదైన మార్క్ చూపారు భవాని. కూడిక, తీసివేత, గుణాకారం, భాగహారం బలంగా వస్తే గణితంపై పునాది బలపడుతుందనే దృష్టితో లెక్కలపై ప్రత్యేక దృష్టి నిలిపారు. ఎక్కాలను కంఠస్తం చేయించి వదిలేయకుండా, వాటిని ఉపయోగించి పెద్ద లెక్కలను వేగంగా పరిష్కరించే పద్ధతులను పిల్లలకు నేర్పారు. రేఖాగణితం అంటే కేవలం పుస్తకంలో గీతలు గీసి వివరించడమే కాకుండా దాన్ని ఆటలతో అనుసంధానం చేశారు. తొక్కుడు బిళ్ల వంటి ఆటలను ఉపయోగించి రేఖాగణిత భావనలను పిల్లలకు అర్థమయ్యేలా చేస్తుంటారు. ఈ ప్రక్రియ ‘యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్’కు చేరువైంది. సహజ రీతిలో విద్యార్థులు విని గుర్తుంచుకోవడం కంటే ఈ విధానంలో‘చూస్తారు, ఆడతారు, ప్రయత్నిస్తారు, తప్పు చేస్తారు, సరిదిద్దుకుంటారు, నేర్చుకుంటారు’ అనే పద్ధతిలో అంతర్లీనంగా బోధించారు.
భవాని టీచర్ కేవలం ఆటపాటలతో మాత్రమే విద్యను నేర్పించకుండా మరో ప్రత్యేకతను చాటుకున్నారు. పాఠాన్ని తరగతి గది గోడలకే పరిమితం చేయలేదు. ఆమెతో పాటు పనిచేసే ఉపాధ్యాయుల సహకారంతో వాటిని వీడియోలుగా రూపొందించారు. ఆ వీడియోలను బొంపెల్లి భవాని పేరుతో యూట్యూబ్ చానెల్లో అందుబాటులోకి తీసుకువచ్చారు. గణితంతోపాటు తెలుగు, ఇంగ్లిష్, పరిసరాల విజ్ఞానం లాంటి అంశాలను ఆటలు, పాటలు, బొమ్మలు, ప్రదర్శనలతో అనుసంధానించి వీడియో పాఠాలను రూపొందించారు. డిజిటల్ బోధన అంటే ఖరీదైన స్మార్ట్ క్లాస్ రూమ్ నిర్మించడం మాత్రమే కాదు. తనకు తెలిసిన బోధనా పద్ధతిని ఒక కెమెరా ముందు పెట్టి, మరొక పిల్లవాడికి కూడా ఉపయోగపడేలా అందించడం కూడా డిజిటల్ విద్యనే అని భవాని నిరూపించారు. యూట్యూబ్ చానెల్ ప్రారంభించిన తొమ్మిది నెలల్లోనే లక్షల్లో ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆమె చానెల్‌కు 7.75 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పటి వరకు విజ్ఞానానికి సంబంధించిన 1,336 వీడియోలు అప్లోడ్ చేశారు. వీటన్నిటికీ కలిపి 57 కోట్ల వ్యూస్ రావడం విశేషం. యూట్యూబ్ వీడియోలకు ఆదరణ పెరగడంతో ఇతర ప్రాంతాల నుంచి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆన్లైన్ తరగతుల కోసం సంప్రదించే పరిస్థితి ఏర్పడింది. పాఠశాలలో విద్యను అందించడం అంటే కేవలం పాఠ్యాంశాలను పూర్తి చేయడం కాదు. వాళ్లలో ‘నేను చేయగలను’ అనే భావనను పెంచడం కూడా విద్యలో భాగమే. అందుకే విద్యతో పాటు నృత్యం, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇలా బహుముఖ ప్రజ్ఞతో విద్యా బోధన చేస్తూ.. జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికైన భవానికి మనమూ కంగ్రాట్స్ చెబుదాం.
ప్రభుత్వ పాఠశాలలు అంటే వెనుకబడిన విద్యకు ఉదాహరణలు కాదు. అవి ప్రతిభకు కేంద్రాలు. శ్రద్ధ పెడితే సర్కారు బడిలోనూ అనేక అద్భుతాలను సృష్టించవచ్చు. ఈ ఏడాది ‘జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం-2026’కు దేశవ్యాప్తంగా 48 మంది ఎంపికైతే మన రాష్ట్రంనుంచి నాకు చోటు దక్కడం చాలా ఆనందాన్ని ఇస్తున్నది. మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ అవార్డులు అన్నీ స్వీకరించాను. గతేడాది రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యాను. ఈ గుర్తింపు నా బాధ్యతను మరింత పెంచింది. పిల్లల అభ్యున్నతికి ఇంకా కష్టపడి పని చేస్తాను.
– బొంపెల్లి భవాని
– జూపల్లి రమేష్, నిజామాబాద్