మా బాబు వయసు రెండేండ్లు. గుమిలి తీసే ఇయర్ బడ్ని చెవిలో పెట్టుకున్నాడు. దాని మొనకు ఉండే కాటన్ ఊడిపోవడం వల్ల అది లోపల గుచ్చుకుంది. ఈఎన్టీ డాక్టర్కి చూపిస్తే… చెవిలో కర్ణభేరి పొర (టెంపానిక్ మెంబ్రేన్) చిట్లిపోయిందని చెప్పారు. యాంటిబయాటిక్స్తోపాటు నొప్పి మాత్రలు కూడా రాశారు. ఇది ప్రమాదకరమా? భవిష్యత్లో వినికిడి సమస్య వస్తుందా?
మొనదేలి ఉండే వస్తువులు చెవులో పెట్టుకోవడం వల్ల కర్ణభేరి పొర (టెంపానిక్ మెంబ్రేన్)కు రంధ్రం పడుతుంది. సహజంగానే అది తిరిగి పూడుతుంది. ఈలోపు దానికి ఇన్ఫెక్షన్ సోకకుండా చూసుకోవాలి. చెవుల్లోకి నీళ్లు పోకుండా జాగ్రత్తపడాలి. అప్పటిదాకా నొప్పి తగ్గడానికి మందులు వాడాలి. ఈఎన్టీ డాక్టర్ని కలిశామన్నారు. కాబట్టి ఆయన చెప్పిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి. ఒకవేళ పూర్తిగా నయమైతే వినికిడికి ప్రమాదం ఉండదు. అవసరమైతే ఈఎన్టీ డాక్టర్ చెప్పిన పరీక్షలు చేయించండి. ఆయన సూచనలు పాటించండి.
అప్పుడే నడవడం నేర్చుకునే (దాదాపు ఒకటి, ఒకటిన్నర నుంచి మూడేండ్లలోపు) పిల్లలు పరిసరాల్లో కనిపించే అన్ని రకాల వస్తువుల పట్ల ఆసక్తి చూపుతారు. ప్రతి వస్తువును తడమాలని కోరుకుంటారు. పరిసరాలన్నీ తిరుగాడుతుంటారు. కాబట్టి పిల్లలను ప్రమాదాల నుంచి రక్షించుకోవాలి. అలాగని వాళ్లను కట్టిపడేసినట్టు ఒకేచోట ఉంచే ప్రయత్నం చేయకూడదు. వాళ్లు తిరుగుతూ, అన్నిటినీ చూస్తూ ఉండటం ఎదుగుదలలో భాగం. పదునైన వస్తువులు, కాలేవి, రసాయనాలు పిల్లలకు అందుబాటులో లేకుండా చూడాలి. పిల్లలు జారిపడకుండా, నేలపై నీళ్లు లేకుండా చూసుకోవాలి. బాల్కనీ, మెట్లవైపు వెళ్లకుండా తలుపు వేసి ఉంచాలి. ఈ వయసు పిల్లల్ని కుటుంబంలో ఎవరో ఒకరు ఎప్పుడూ కనిపెట్టుకుంటూ ఉండాలి. అప్పుడే నడక నేర్చిన పిల్లల్ని పెద్దలు పర్యవేక్షిస్తూ ఉండటం చాలా ముఖ్యం.
-డాక్టర్ విజయానంద్
నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్